Monday, March 25, 2024

జ‌గ‌న‌న్న కిట్ల‌తో సార‌థులు

ఆంధ్రప్రభ, (అమరావతి బ్యూరో) : సచివాలయ వ్యవస్థతో సరికొత్త పరిపాలనకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పార్టీపరంగా కూడా అదే తరహాలో మరో బలమైన రాజకీయ వ్యవస్థ ను నిర్మించి రంగంలోకి దించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాల పరిధిలో ఇప్పటికే ప్రభుత్వపరంగా బలమైన వ్యవస్థ ఉంది. అయితే అదే తరహాలో రాజకీయ వ్యవస్థను ఏర్పాటు చేసి క్షేత్ర స్థాయిలో వైసీపీ ని తిరుగులేని శక్తిగా బలోపేతం చేయాలని సీఎం జగన్‌ సంకల్పించారు. అందులో భాగంగానే సచివాలయాల పరిధిలో గృహ సారధులు, రాజకీయ కన్వీనర్లను నియమిం చారు. ప్రతి వార్డు పరిధిలోని ప్రతి 50 ఇళ్లకు ఇద్దరు గృహ సారధులు, ముగ్గురు కన్వీనర్ల ను ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి 13 జిల్లాల పరిధిలో 5.65 లక్షల మందిని నియమించారు. అందుకు సంబంధించి దాదాపుగా 95 శాతం పైగా నియామకాలు పూర్తయ్యాయి. గురువారం నుంచి వారికి తొలివిడత శిక్షణ తరగతులను కూడా ప్రారంభించబోతున్నారు. వచ్చే నెల 18వ తేదీ నుంచి రంగంలోకి దిగనున్న సైన్యం అదేరోజు ప్రారంభం కానున్న జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగస్వా ములు కాబోతున్నారు. అందుకు సంబంధిం చి వారి చేతికి జగనన్న కిట్లను కూడా అందిం చబోతున్నారు. రాజకీయ రంగంలో మును పెన్నడూ లేని విధంగా
వైసీపీ వినూత్న రీతిలో కిట్లను రూపొందించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అవగాహన సదస్సుల్లో కిట్లను వైసీపీ శ్రేణులకు చూపించే క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లోనూ జగనన్న కిట్లపై విస్తృత స్థాయిలో చర్చ జరుగుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే కిట్‌లో ఉన్న వివిధ రకాల సామాగ్రి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆ కిట్లలోని సామాగ్రిని ఇంటింటికి పంపిణీ చేయబోతున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం అయితే ఇప్పటికే ప్రభుత్వ పథకాల ప్రచారంతో బలంగా ఉన్న వైసీపీ జగనన్న కిట్లతో క్షేత్రస్థాయిలో మరింత పటిష్టం అవుతుందన్న భావన రాజకీయ విశ్లేషకుల్లో వ్యక్తమవుతుంది.


ప్రతి కిట్‌లోనూ..200 ఇళ్లకు సరిపడా సామాగ్రి
గృహసారధులకు జగనన్న నువ్వే మా భవిష్యత్తు కార్యక్రమానికి సంబంధించి ప్రచార సామాగ్రి కిట్‌ను అందించబోతున్నారు. ప్రతీ సారధికి సామాగ్రి కిట్‌లో 200 ఇళ్లకు సరిపడు సామాగ్రి ఉండేలా కిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వార్డు, ప్రతి గ్రామ సచివాలయాలకు సంబంధించి మూడు సచివాలయాల కన్వీనర్లకు కలిపి నాలుగు ప్రచార సామాగ్రి కిట్లను అందించబోతున్నారు. అందులో గృహసారధులు ధరించడానికి బ్యాడ్జీ, ప్రజా మద్దతు పుస్తకంలో వివరాలను నింపడానికి పెన్ను, ప్రజా మద్దతు పుస్తకం, ప్రభుత్వంపై ప్రజా మద్దతుకు ఉపయోగించే స్లిప్పులు, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వానికి వ్యత్యాసాన్ని చూపుతూ 200 కరపత్రాలు, అలాగే ప్రతి ఇంటి గోడకు అంటించే డోర్‌ స్టిక్కర్‌, అలాగే మొబైల్‌ స్టిక్కర్లు, ప్రచార వస్తువులను తీసుకుని వెళ్లేందుకు వీలుగా వైసీపీ రంగులతో జగన్‌ బొమ్మ ముద్రించిన సంచులను అందివ్వబోతున్నారు. గృహసారధులు ప్రతి ఇంటికి వెళ్లి ప్రచారం చేయడంతో పాటు అందుకు సంబంధించిన స్టిక్కర్లను అంటించాలి. అలాగే ఇంటి యజమాని ఫోన్‌ నెంబర్‌ తీసుకుని అందుకు సంబంధించిన సందేశాన్ని కూడా మిస్సిడ్‌కాల్‌ ద్వారా పంపాలి. ఈ క్రమంలో ఇంటి యజమాని వైసీపీ ప్రభుత్వం పట్ల ఆసక్తి చూపితే వీడియో రూపంలో వారి మద్దతు వీడియో రూపొందించాలి. ఇలా గృహసారధులు వైసీపీ ప్రభుత్వానికి సంబంధించి ప్రచారాన్ని నిర్వహించడంతో పాటు వారి అభిప్రాయాలను పక్కాగా తెలుసుకునేందుకు జగనన్న కిట్లను ఉపయోగించబోతున్నారు.
క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే సారధుల లక్ష్యం
వైసీపీ క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సీఎం జగన్‌ అడుగులు వేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ఆయన రంగంలోకి దిగబోతున్నారు. అందుకోసం ఇప్పటి నుండే బలమైన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో గృహసారధులు, రాజకీయ కన్వీనర్లు మార్చి 18వ తేదీ నుంచి పెద్దఎత్తున రంగంలోకి దిగుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా..లేదా అని తెలుసుకోవడంతో పాటు వారు వైసీపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపితే ఆయా ఇళ్లకు జగనన్న నువ్వే మా భవిష్యత్తు పేరుతో రూపొందించిన స్టిక్కర్‌ను గోడకు అంటించనున్నారు. తద్వారా ఎన్నికల సమయంలో వైసీపీ ఓట్లను గుర్తించడం సులభంగా ఉంటుందన్న యోచనతో ఇప్పటినుంచే వార్డు స్థాయిలోనే పార్టీని బలోపేతం చేసే దిశగా సీఎం జగన్‌ సారధులను బరిలోకి దించబోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 5.65 లక్షల మంది సైన్యం కూడా సిద్ధమైంది. వీరికి రెండు విడతల్లో శిక్షణ కార్యక్రమాలను కూడా పూర్తి చేయబోతున్నారు.

సైన్యం, కిట్లపై రాజకీయ వర్గాల్లో మొదలైన చర్చ
సీఎం జగన్‌ తీసుకుంటున్న ప్రతి నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో ఎప్పటికప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. దేశంలోని మరే ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా ఆయన వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగానే సీఎంగా బాధ్యతలు చేపట్టాక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయగా తాజాగా వైసీపీ పార్టీ మరింత బలోపేతం చేసేందుకు గృహ సారధుల రూపంలో బలమైన సైన్యాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జగనన్న సైన్యంపై చర్చ నడుస్తోంది. అయితే ప్రధాన రాజకీయ పార్టీల్లో ఓ రకంగా చర్చ నడుస్తుండగా వైసీపీ వర్గాల్లో మరో విధంగా ఆసక్తికరమైన చర్చ కనిపిస్తుంది. సచివాలయ వ్యవస్థతో స్థానికంగా ఉన్న వైసీపీ ప్రజా ప్రతినిధులకు ప్రాధాన్యత లేకుండా పోయిందని, తాజాగా గృహసారధులతో పార్టీ నాయకులకు ప్రాధాన్యత తగ్గుతుందన్న ఆందోళన కొంతమంది వైసీపీ ద్వితీయ స్థాయి నేతల్లో కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement