Friday, April 19, 2024

ఏపీలో గ్రూప్‌-1, 2 పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : ఏపీపీఎస్‌సీ గ్రూప్‌-1. గ్రూప్‌-2 పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. గురువారం ఉదయం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రికి అధికారులు పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలు అందజేశారు. సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా పారదర్శకంగా సాగుతోందని తెలిపారు. ప్రభుత్వంలోని వివిధ శాఖల నుంచి ఖాళీల వివరాలు తెప్పించుకున్నామని, నోటిఫికేషన్‌ జారీకి అవసరమైన కసరత్తు జరుగుతోందని చెప్పారు.

గ్రూప్‌-1కి సంబంధించి సుమారు 100కిపైగా పోస్టులు, గ్రూప్‌-2కు సంబంధించి సుమారు 900కిపైగా పోస్టులు, మొత్తం 1000కిపైగా పోస్టులు భర్తీచేయనున్నామని వివరించారు. వీలైనంత త్వరలో దీనికి సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాలు వెల్లడి తదితర అంశాలపై దృష్టిసారించాలన్నారు. వచ్చే నెల్లో నోటిఫి కేషన్‌ విడుదలకు ఏపీపీఎస్సీ సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -

గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు ఆమోదం

గ్రామ సచివాలయం ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన ఫైల్‌పై ముఖ్యమంత్రి ఆమోదముద్ర వేశారు. జూన్‌ 10 వరకు సచివాలయ ఉద్యోగులకు బదిలీలకు అవకాశం కల్పించారు. రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకుని ప్రొబేషన్‌ డిక్లేర్‌ అయిన ఉద్యోగులందరూ బదిలీలకు అర్హులు. జిల్లా పరిధిలో బదిలీలతో పాటు- అంతర్‌ జిల్లాల బదిలీలకు కూడా వీలు కల్పిస్తూ మార్గదర్శకాలు జారీ కానున్నాయి. జిల్లాలో రిక్వెస్ట్‌ చేసుకున్న ఉద్యోగులందరికీ బదిలీలకు అవకాశమివ్వాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అంతర్‌ జిల్లా బదిలీలలో స్పౌజు కేసు మ్యూచువల్‌ ట్రాన్స్ఫర్లను పరిగణనలోకి తీసుకుంటారు. సచివాలయ ఉద్యోగుల బదిలీలకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రికి ఆంధ్రప్రదేశ్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డి తదితరులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement