Wednesday, April 24, 2024

Shame: పొదుపు రుణాల మంజూరుకు మామూళ్లు.. లక్షకు ఐదు వేలు ఇవ్వాల్సిందేనని డిమాండ్​

గిద్దలూరు, (ప్రభ న్యూస్) : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌కాశం జిల్లాలో మ‌హిళా పొదుపు సంఘాల‌కు విచిత్ర ప‌రిస్థితి ఎదుర‌వుతోంది. రుణాలు ఇప్పించే స‌మ‌యంలో కొంత‌మంది మామూళ్ల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌య‌మ్మీద గిద్దలూరు నగరపంచాయితీ పరిధిలోని మెప్మా కార్యాలయంలో అవినీతి, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ గిద్దలూరు 7వ వార్డు మహిళా కౌన్సిలర్ బిల్లా జయలక్ష్మి, ఆమె భర్త రమేష్ యాదవ్ ఇవ్వాల (గురువారం) జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ కు లిఖితపూర్వకంగా కంప్లెయింట్‌ చేశారు. పొదుపు గ్రూపు సభ్యులకు బ్యాంకు రుణాలు మంజూరు చేసేందుకు మామూళ్లు వసూలు చేస్తున్నారని వారు తెలిపారు. గ్రూపు సభ్యులకు తక్కువ బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి. అందుకుగాను గ్రూపు సభ్యులు మెప్మా అధికారులకు దరఖాస్తు చేసుకుంటారు.

బ్యాంకుల నుండి రుణాలు మంజూరు కావాలంటే లక్షకు ఐదు వేల చొప్పు యాణిమేటర్ల ద్వారా ముడుపులు వసూలు చేయిస్తు పొదుపు మహిళలను ఇబ్బందులపాలు చేస్తున్నారని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మెప్మా కార్యాలయంలో పనిచేస్తున్న సిసి యాణిమేటర్లపై ఒత్తిడి చేస్తూన్నట్లు కొందరు తనకు ఫిర్యాదు చేసారని తెలిపారు. పొదుపు గ్రూపు సభ్యుల నుండి డబ్బు వసూలు చేయనిదే రుణాలు మంజూరు పత్రాలపై సంతకాలు చేసేది లేదని తెగేసి చెబుతున్నట్లు ఆమె తెలిపారు. ఒక్కో గ్రూపు నుండి బ్యాంకు రుణాన్ని బట్టి రూ.25వేల నుండి రూ.50వేల వరకు మామూళ్లు వసూలు చేస్తు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. కావున మెప్మా కార్యాలయంలో జరిగే అవినీతి,అక్రమాలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి పొదుపు రుణాల మంజూరులో అడ్డంకులు లేకుండా చూడాలని, అవినీతికి పాల్పదుతున్న అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement