Friday, April 19, 2024

ఎట్టకేలకు… జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు షురూ..!

విజయనగరం, ప్రభన్యూస్ : జిల్లాలో ఎట్టకేలకు ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమై ఇంత వరకు 23 వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేసింది అధికార యంత్రాంగం. వివిధ రకాల కారణాలు చూపి మొన్నటి వరకు బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించేందుకు మీనమేషాలు లెక్కించిన అధిక శాతం మంది మిల్లర్లు ఇప్పుడిప్పుడే ఆమేరకు ముందుకొచ్చారు. అధికారిక నివేదిక‌ల మేరకు ఇంత వరకు 141 మంది మిల్లర్లు రూ.60 కోట్ల వరకు బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించారు. మరో 34 మంది మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీలు ఇద్దామా? వద్దా? అన్న చందంగా యోచిస్తున్నట్లు తెలుస్తోంది. బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించిన వారు కూడా గతంలో మాదిరిగా భారీ మొత్తాలను బ్యాంక్‌ గ్యారంటీల రూపంలో ఇవ్వని పరిస్థితి. కొంత మంది బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించినప్పటికీ ధాన్యం దించుకోవడం విషయంలో పెద్దగా చొరవ చూపని నేపథ్యం స్పష్టంగా తెలుస్తోంది. మరోవైపు జిల్లాకు చెందిన మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీలు సమర్పించే విషయంలో అధికార యంత్రాంగం ఆశించిన విధంగా చొరవ చూపకపోవడంతో పొరుగు జిల్లాల్లోని రైస్‌ మిల్లులను ట్యాగింగ్‌ చేశారు పౌర సరఫరా అధికారులు. ఈనేపథ్యం పరోక్షంగా జిల్ల్లాలోని రైస్‌ మిల్లర్లలో ధీమాను పారదోలి తొందరపడేలా చేసేందుకేనని పరిస్థితులు చాటిచెబుతున్నాయి.

జిల్లాలో ఇంత వరకు 23 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోళ్లు జరిగినట్లు పౌర సరఫరాల సంస్థ లెక్కలు చెబుతున్నాయి. వాస్తవానికి 5 లక్షల మెట్రిక్‌ టన్నుల పైచిలుకు మొత్తంలో ధాన్యం కొనుగోలు చేయాలన్నది అధికారుల లక్ష్యం. ఇప్పటికే మిల్లర్ల అలసత్వం పుణ్యమా అని కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే, పొరుగు జిల్లాల మిల్లులకు కూడా ధాన్యం తరలించేందుకు పౌర సరఫరాల సంస్థ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం వల్ల లక్ష్య సాధన తక్కువ సమయంలోనే సాధ్యం కావచ్చని చెప్పవచ్చు. దానికి తోడు గతానికి భిన్నంగా ధాన్యం కొనుగోళ్ల వేగం పెంచేందుకు జాయింట్‌ కలెక్టర్‌ రెవెన్యూ, పౌర సరఫరాల సంస్థ అధికారులు వేర్వేరుగా గ్రామ స్థాయిలో పర్యటనలు చేస్తున్న పరిస్థితి ఫలితాన్నివచ్చన్న అంచనా వుంది. ధాన్యం కొనుగోలు జరిగిన 21 రోజుల్లో చెల్లింపులు జరిగేలా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమేరకు అమలు జరుగుతాయో వేచి చూడాల్సి వుంది.


దరువు రైతుకే…
ధాన్యం కొనుగోళ్లు పారదర్శకం.. దళారీలకు అవకాశం లేదు.. అని ప్రభుత్వం ఎంతగా చెబుతున్నా రైస్‌ మిల్లర్లు మాత్రం తమ లక్ష్యాన్ని నెరవేర్చుకుంటున్న పరిస్థితి. పలువురు మిల్లర్లు క్వింటాల్‌కు 110 కిలోల ధాన్యం పట్టు పట్టించుకుంటుండగా కొంత మంది రైతుని కొద్దిగా కరుణిస్తూ 107 కిలోల ధాన్యాన్ని క్వింటాలుగా పరిగణించి పట్టు పట్టిస్తున్న పరిస్థితి. మొత్తం మీద ప్రకృతి కన్నెర్ర చేసినా.. మిల్లర్లు పథకం రచించినా… దరువు మాత్రం అన్నదాత పైనే అనివార్యంగా పడుతోంది. ఏది ఏమైనప్పటికీ ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియతో పాటు చెల్లింపుల ప్రక్రియ వేగం పుంజుకుంటే తప్ప అన్నదాతల ఇళ్లల్లో పండగ సందేహమేనని చెప్పవచ్చు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement