Wednesday, April 24, 2024

సీమ ముంగిట బంగారు గిరి.. బ్లాక్‌ల వారిగా గోల్డు వెలికితీత..

పత్తికొండ నియోజక వర్గంలోని జొన్నగిరి సమీపంలో బంగారం వెలికితీత పనులు ప్రారంభించేందుకు సన్నహాలు మొదలయ్యాయి. బహుశా ఏప్రిల్‌ నుంచి పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తున్నది. పైలట్‌ ప్రాజెక్టు మంచి ఫలితాలు ఇవ్వడంతో బంగారు గనుల ప్లాంట్‌ ఏర్పాటుకు జియో మైసూర్‌ సంస్థ ముందుకు వచ్చింది. ప్లాంట్‌ను నెలకొల్పి ఏడాదిలోపు బంగారం నిక్షేపాల వెలికితీత పనులు చేపట్టనుంది. జిల్లాలో తుగ్గలి, మద్దికెర మండలాల్లో గోల్డు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నట్లు 1994లో జియోలజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా సర్వే నిర్ధారించింది. ముఖ్యంగా జొన్నగిరితో పాటు పగిడిరాయి రెవెన్యూ పరిధిలోని భూముల్లో బంగారం నిక్షేపాల కోసం పరిశోధనలు చేసి అనంతరం భూ సేకరణ చేపట్టారు. ఆ తర్వాత ప్రభుత్వ రంగ సంస్ధ అయిన మినరల్‌ ఎక్స్‌ప్లోరేషన్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా ( ఎంఈసిఎల్‌) తవ్వకాలు జరిపింది. ప్రస్తుతం జియో మైసూర్‌ సంస్ధ ఈ ప్రాంతంలో గోల్డుమైన్‌ చేపట్టేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి పొందింది. జొన్నగిరి, పగిడిరాయి గ్రామ సరిహాద్దుల్లో ఉన్న దోన ప్రాంతం మైనింగ్‌కు ప్రధాన కేంద్రం, గతంలో ఇక్కడ బ్రిటీష్‌ హాయంలోనే బంగారు గని తవ్వకాలు జరిపిన అనవాళ్లు సైతం ఉన్నాయి. ఈ ప్రాంతంలో సుమారు1500 ఎకరాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు.

హంద్రీనీవా నుంచి మైనింగ్‌ రిజర్వాయర్‌కు నీరు..

మైనింగ్‌ జరిపితే నీటి అవసరాల కోసం హంద్రీనీవా కాలువ నుంచి పైపులైన్‌ ద్వారా రిజర్వాయర్లో నీరు నింపేందుకు ప్రభుత్వం అనుమతులు కూడ పొందారు. ప్రస్తుతం మైనింగ్‌ ప్రాంతంలో కర్మాగారం ఏర్పాటు చేయనున్నారు. పూర్తి స్థాయిలో ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్దమైంది. ఇందుకు అవసరమైన యంత్ర సామాగ్రి కొనుగోలు చేస్తుంది. ఏప్రెల్‌ నుంచి ప్లాంట్‌ నిర్మాణ పనులు ప్రారంభించి 12 నెలలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందు కోసం రూ. 300 కోట్లు వ్యయం చేస్తుంది. ప్లాంట్‌ పనుల పురోగతిని జిల్లా కలెక్టర్‌, ప రిశ్రమల శాఖ రాష్ట్ర ప్రతినిధులు ప్రతి వారం సమీక్షిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిబ్లాక్‌లో ముందుగా బంగారు గనుల తవ్వకం ప్రారంభించి, తర్వాత మరో మూడు బ్లాక్‌లలో మైనింగ్‌ చేయాలన్నది సంస్ధ నిర్ణయం, మొత్తం నాలుగు బ్లాక్‌లు కలిపి సుమారు 30 నుంచి 40 టన్నుల బంగారు నిక్షేపాలను వెలికి తీయవచ్చని అంచనా వేస్తున్నారు.సదరు సంస్ధ ప్రతి ఏటా 750 కేజీల బంగారం తీయాలని లక్ష్యంగా పెట్టుకుంది.వాస్తవానికి ఈ ప్రాజెక్టు 2020లోనే ప్రారంభం కావాలి. అయితే అనుమతులు లేటు కావడం, కోవిడ్‌ కారణంగా వాయిదా పడింది.2022 ఏప్రెల్‌ తర్వాత గనుల తవ్వకం చేపట్టేందుకు జియో మైసూర్‌ సంస్ధ సిద్దమవుతుంది. ఏది ఏమైనా స్వాతంత్ర తర్వాత దేశంలో తొలి గోల్డుమైన్‌ మన దేశంలో 1880లో కోలార్‌ గోల్డు మైన్‌ ప్రారంభించింది. స్వాతంత్య్రం వచ్చాక ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా గోల్డుమైన్‌ చేపట్టలేదు. ఇప్పుడు జియో సంస్ధ ఏర్పాటు చేస్తున్నదే తొలి గోల్డుమైన్‌ ప్లాంట్‌ కానుంది. వీటి నిర్మాణంతో ప్రత్యక్షంగా 300 మందికి, పరోక్షంగా 1000 మందకి ఉపాధి లభించనుంది. ఎప్పటి నుంచో జొన్నగిరి వజ్రగిరిగా పేరు. ఇందుకు కారణం ప్రతిఏటా జూన్‌,జూలై తొలకరి జల్లులు కురిసే సమయంలో ఇక్కడి భూముల్లో వేట సాగిస్తే వ జ్రాలు దొరుకుతాయన్నది విశిష్టత. అటువంటిది ఈ ప్రాంతంలో బంగారు గనుల తవ్వకాలు త్వరంలో ప్రారంభం కానుండగా, ఈ ప్రాంతం దేశ వ్యాప్తంగా వ్యాపించనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement