Thursday, April 25, 2024

జనరిక్‌ మందుల దుకాణాలు విలవిల.. బ్రాండెడ్‌ కంపెనీల దెబ్బకు కుదేలైన వ్యాపారాలు..

కర్నూలు, ప్రభన్యూస్ : జిల్లాలో బ్రాండెడ్‌ మందుల కంపెనీల ప్రచారానికి తట్టుకోలేక జనరిక్‌ మందుల దుకాణాలు క్రమేణా మూతపడుతున్నాయి. జీవనాధారం కింద అన్న సంజీవిని 4, ప్రధాన మంత్రి భారతీయ జన ఔషధ కేంద్రాలు 11 కలిపి 20 జనరిల్‌ దుకాణాలు ఉన్నాయి. పొదుపు సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఈ దుకాణాలు నిర్వహిస్తున్నారు. పీఎంబిజెకె కింద జనరిక్‌ దుకాణం ఏర్పాటుచేసుకుంటే రూ.1.50లక్షల వరకు రాయితీ ఇస్తామని ప్రకటించడంతో జిల్లావ్యాప్తంగా మెప్మా ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు తదితర పట్టణ ప్రాంతాల్లో ఔత్సాహికులు 40 దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. రాయితీలు ఇవ్వకపోవడం.. జనరిక్‌ మందులపై ఏమాత్రం ప్రచారం లేకపోవడంతో వ్యాపారం అంతంత మాత్రంగా సాగింది. ప్రస్తుతం జిల్లాలో 11 దుకాణాలు నడుస్తున్నాయి. జనరిక్‌ మందులు తక్కువ ధరకు లభిస్తున్నా చాలా మందికి అవగాహన లేక కొనుగోలుకు మొగ్గు చూపడం లేదు. విస్తృత ప్రచారం చేపట్టే మందులను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంతో దుకాణాలు మూతపడ్డాయి.

జిల్లావ్యాప్తంగా పిహెచ్‌సిలు 29, సిహెచ్‌సిలు 18, జిల్లా ఆసుపత్రి 1, ఆదోని ప్రాంతీయ ఆసుపత్రిలో జనరిక్‌ దుకాణాలు ఏర్పాటుచేశారు. ప్రస్తుతం నంద్యాల, కర్నూలు, ఎమ్మిగనూరు ఆసుపత్రుల్లో తప్పా మిగిలిన చోట బయట ఉన్నాయి. తప్పనిసరిగా ఫార్మాసిస్టులను నియమించుకొని దుకాణాలను నడపాల్సి ఉంది. వారు వెళ్లిపోతే కొత్త వారిని తీసుకువచ్చి నియమించేలోపు వ్యాపారం తగ్గిపోతుండటంతో అసలైన సమస్యలు ఎదురవుతున్నాయి. సర్వజన వైద్యశాలలో మూడు జనరిక్‌ మందుల దుకాణాలు ఉన్నాయి. ఒకటి పొదుపు సంఘం ఆధ్వర్యంలో మరొకటి స్వచ్చంద సంస్థ, విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి.

మందుల కొరత..

ప్రధానమంత్రి భారతీయ జన ఔషధ పథకాన్ని 2008లో ప్రారంభించారు. దుకాణం ఏర్పాటుచేసుకున్న వారికి రూ.2.50 లక్షల రాయితీతో పాటు ఫర్నీచర్‌కు సొమ్ము చెల్లించారు. నెలవారీ విక్రయాలపై 15 నుండి 20 శాతం మేర కమీషన్‌తో పాటు ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ఆయా కేం ద్రాల్లో 1400 రకాల ఔషధాలు, 240 శస్త్ర చికిత్సలకు సంబంధించిన మాత్రలు అందుబాటులో ఉంచాలి. దుకాణ నిర్వాహకులు ముందుగా డబ్బులు చెల్లించి మందులు తెచ్చుకోవాలి. చెన్నై, విజయవాడ, తిరుపతి నగరాల నుంచి సరఫరా అవుతున్నాయి. తెచ్చుకున్న ఔషధాల మొత్తానికి ఇవ్వాల్సిన కమీషన్‌ వెంటనే వారి బ్యాంకు ఖాతాలలోకి జమచేయాలి. ఆయా కేంద్రాల్లో ఔషధాలు లేక ఒక్కొక్కటి క్రమేణా మూతపడుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో నాలుగు దుకాణాలు మాత్రమే నడుస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జనరిక్‌ మందులపై అవగాహన కల్పించి సకాలంలో మందులు సరఫరా చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement