Tuesday, October 1, 2024

Gas Leakage – గోదావరిలో గ్యాస్ లీకేజీ – లంక గ్రామాల్లో కలవరం

( ఆంధ్రప్రభ స్మార్ట్, కాకినాడ) నిన్నటి వరకూ వరద పోటుతో విలవిల్లాడిన గోదారి ప్రజల్ని ..అనూహ్యంగా గ్యాస్ లీకేజీ భయాందోళన సృష్టించింది. గోదావరి లంక ప్రజలు ప్రాణభయంతో అల్లాడిపోతున్నారు. గోదావరి నదిలో గ్యాస్ లీక్ కావడం కలకలం , కలవరం రేపింది.. యానాం దర్యాల తిప్ప, కాట్రేనికోన మండలం బలుసుతిప్ప మధ్య గోదావరిలో ఓఎన్జీసీ సంస్థ గ్యాస్ పైప్ లైన్ వేసింది. శుక్రవారం రాత్రి నుంచీ గ్యాస్ లీక్ కావడం ఇంతవరకూ అధికారులు దాన్ని గుర్తించకపోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. నీటిని చీల్చుకుంటూ గ్యాస్ పైకి తంతుండడంతో మంటలు వ్యాప్తించే ప్రమాదం ఉందని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భారీగా లీకేజీ కావడంతో నీళ్లు సుడులు తిరుగుతున్న దృశ్యాలు కలకలం రేపుతున్నాయి. గ్యాస్ లీక్ కావడంతో భరించలేని వాసన వస్తోంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పటివరకూ యాజమాన్య సంస్థ స్పందిచకపోవడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓఎన్జీసీ సంస్థ తమ ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని మండిపడుతున్నారు.

- Advertisement -

అయితే ముందుగా గ్యాస్ లీకవుతున్న ఘటన మత్స్యకారులు ద్వారా తెలుసుకున్న యానాం కాంగ్రెస్ పార్టీ నాయకుడు దినేశ్ సాహసించి సంఘటనా స్థలానికి బోటుపై వెళ్లారు. దీనికి సంబంధించిన దృశ్యాలను ఆయన చిత్రీకరించి గ్యాస్ లీక్ ఆపాలంటూ సంస్థ యాజమాన్యాన్ని కోరారు. అయితే ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో వీటిని చూసిన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఇలాంటి గ్యాస్ లీక్ ఘటనల వల్ల మంటలు చెలరేగి గతంలో ప్రమాదాలు జరిగాయి. అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా గ్యాస్ లీకేజీని అరికట్టి భారీ నష్టం జరగకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement