Wednesday, April 24, 2024

సెల్‌ఫోన్‌ దొంగల ముఠా అరెస్టు -228 సెల్‌ఫోన్లు స్వాధీనం

అక్రమ రవాణాను అరికట్టాలని, జిల్లా వ్యాప్తంగా చెక్‌ పోస్టులు ఏర్పాటు చేసి పోలీసుల చేత వాహనాలు మమ్ముర తనిఖీలు నిర్వహించి, అసాంఘీక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని నెల్లూరు జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి పర్యవేక్షణలో గూడూరు రూరల్‌ సీఐ శ్రీనివాసులు రెడ్డి, రూరల్‌ ఎస్సై బ్రహ్మనాయుడు పోలీసు సిబ్బందితో చిల్లకూరు పోటుపాలెం జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా శుక్రవారం సాయంత్రం అనుమానాస్పద స్థితిలో బస్సు దిగిన వారిని పట్టుకుని చాకచక్యంగా విచారణ జరిపి గూడూరు రూరల్‌ స్టేషన్‌కు తరలించారు. ఆ తరువాత వారి నేర చరితపై సమగ్ర దర్యాప్తు చేయడంతో వారి దొంగతనాలు బయటపడ్డాయి. ఈ ముఠాలోని నిందితులు మేకల కృష్ణ, మేకల పవన్‌ల నుంచి 228 ఆండ్రాయిడ్‌ సెల్‌ ఫోన్లు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు 23, 50, 900 రూపాయలు ఉంటుందని పోలీసులు వెల్లడించారు.

శనివారం జిల్లా ఎస్పీ విజయరావు గూడూరు 1వ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం, ఆకివీడు గ్రామానికి చెందిన మేకల కృష్ణ, మేకల పవన్‌ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక ముఠాగా ఏర్పడి సెల్‌ ఫోన్‌ దొంగతనాలు చేసే వారన్నారు. దొంగిలించిన సెల్‌ ఫోన్లను ఆకివీడు గ్రామానికి చెందిన స్నేహితుడు ద్వారా సెల్‌ ఫోన్‌ లకు చెందిన సాఫ్ట్‌వేర్‌ లను మార్చి వేసి, మరో స్నేహితుడు ద్వారా అమ్మకాలు జరిపేవారని వెల్లడించారు. వచ్చిన డబ్బులను ముఠాలోని స‌భ్యులంద‌రూ సమానంగా పంచుకొనేవారన్నారు. మేకల కృష్ణ పై 15 కేసులు, సస్పెక్ట్‌ షేట్‌ ఉందని ఎస్పీ వెల్లడించారు. ఈ క్రమంలో 45 రోజుల క్రితం మేకల కృష్ణ, మేకల పవన్‌, మరో ఇద్దరు స్నేహితులు కలిసి చెన్నైలోని ఎగ్మోర్‌ ప్రాంతంలో కూలీ పనులు చేసుకుంటున్నామ‌ని చెప్పి, 3 వేల రూపాయలకు రూమ్‌ ను అద్దెకు తీసుకుని పగలు బస్టాండ్‌లలో, సిటీ బస్సుల్లో ముఖ్యమైన రద్దీ ప్రదేశాల్లో జేబు దొంగతనాలు, సెల్‌ ఫోన్‌లు దొంగిలిస్తూ రాత్రికి రూమ్‌ కి చేరుకొనే వారన్నారు.

దొంగలించిన డబ్బులు నిందితులు వారి ఖర్చులకు వాడుకుని సెల్‌ ఫోన్లను పోగు చేసుకుని, రెండు బ్యాగ్‌ లకు నింపుకుని వారి గ్రామానికి వెళ్లేందుకు చెన్నైలో బస్సు ఎక్కి వెళ్తుండగా, చిల్లకూరు జాతీయ రహదారి వద్ద బస్సు ఆగడంతో నిందితులు బస్సు దిగి విజయవాడకు లారీ ఎక్కేందుకు ఉన్న సమయంలో వారి ప్రవర్తన పై అనుమానం రావడంతో అప్రమత్తంగా ఉన్న గూడూరు రూరల్‌ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్‌ చేసి వారి వద్ద నుండి సెల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు. అనంతరం ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్‌ సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎస్సై బ్రహ్మనాయుడు, చిల్లకూరు ఎస్సై అజయ్‌ కుమార్‌, పోలీసు సిబ్బంది రాజు, చిరంజీవి, రహీం, సుబ్రహ్మణ్యం, విష్ణు, సురేష్‌, శీను, బ్రహ్మంలను జిల్లా ఎస్పీ విజయ రావు, డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డిలు అభినందించి రివార్డులు అందించారు. ఈ సమావేశంలో గూడూరు డీఎస్పీ రాజగోపాల్‌ రెడ్డి, సీఐలు శ్రీనివాసులురెడ్డి , నాగేశ్వరమ్మ, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement