Wednesday, March 27, 2024

AP: ఇథనాల్ ప్లాంట్ తో రైతులకు ఆర్థిక లబ్ధి.. 270 కోట్లతో ప్రాజెక్టు, సీఎం జగన్ శంకుస్థాపన

వర్షాలు, వాతావరణ పరిస్థితుల కారణంగా బియ్యం విరిగిపోయినా, చెడిపోయినా ఆ దిగుబ‌డుల‌కు సరైన ధర అందించాలనే గొప్ప లక్ష్యంతో ఏపీలో ఇథనాల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామ‌ని సీఎం జగన్ అన్నారు. ఇథనాల్ ప్లాంట్ రైతులకు మరింత లబ్ధి చేకూరనుందని ప్రకటించారు. పంట పండించిన ఏ ఒక్క రైతు నష్టపోకుండా చూడటమే ప్రభుత్వ అంతిమ ధ్యేయమన్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మళ్ళదొడ్డి వద్ద రూ.270 కోట్లతో టెక్ మహీంద్ర గ్రూప్ కు చెందిన అసాగో ఇండస్ట్రీస్‌ ఏర్పాటు చేస్తున్న బయో ఇథనాల్‌ యూనిట్‌ నిర్మాణ పనులకు ఇవ్వాల (శుక్ర‌వారం) సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు.

భూమి పూజ త‌ర్వాత‌ టెక్‌ మహీంద్ర సీఈఓ సీపీ గుర్నానీతో కలిసి బహిరంగ సభలో సీఎం జ‌గ‌న్‌ మాట్లాడారు. ‘దేవుడి దయతో ఈ రోజు రైతులు, పర్యావరణ సమతుల్యత సాధించే ఓ మంచి క్యాక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. రూ.270 కోట్లతో టెక్‌ మహీంద్రా గ్రూప్‌ ఇథనాల్‌ను ప్లాంట్‌ తో రైతులు, నిరుద్యోగులకు లబ్ధి చేకూరుతుందన్నారు. 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ఏర్పాలయ్యే ఈ ప్లాంట్‌ లో బ్రోకెన్‌ రైస్‌ (విరిగిపోయిన బియ్యం) తో ఇథనాల్‌ తయారీ చేస్తారని తెలిపారు. పాడైపోయిన ఆహారధాన్యాలు, నూకలు, వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు వినియోగించి ఇథనాల్‌ను తయారు చేయడంతో రైతులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూరుతుందని సీఎం పేర్కొన్నారు.

ఇథనాల్ తో పాటు పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్‌ ఫీడ్‌ ను బై ప్రోడక్ట్స్ కింద ఉత్పత్తి చేస్తారని పేర్కొన్నారు. దీంతో వర్షాల కారణంగా రంగు మారిన ధాన్యానికి కూడా మంచి ధర లభిస్తుందని సీఎం జగన్ తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు విజ్ణప్తి మేరకు ఏలూరు కుడి కాలువ నిర్మాణం కోసం రూ.50 కోట్లు ఖర్చవుతుందని కోరడంతో సీఎం జగన్ వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఏలూరు కుడి కాలువ పనులతో 15 వేల ఎకరాల ఆయుకట్టుకు నీళ్లంది రైతులకు మంచి జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమర్ నాథ్,తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, ఎంపీలు భరత్ రామ్, అనురాధ, వంగా గీతా, ఎమ్మెల్యేలు జ్యోతుల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement