Saturday, April 20, 2024

ఏపీలో ఫీవర్‌ టెన్షన్‌! ఒకవైపు హెచ్‌3ఎన్‌2.. మరోవైపు వైరల్‌ ఫీవర్లు

అమరావతి, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్‌ను ఫీవర్‌ టెన్షన్‌ వెన్నాడుతోంది. గ్రామాలు, పట్టణాల్లో రోజు రోజుకు జ్వర బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తుంది. ఒకవైపు కొత్త వైరస్‌ వ్యాప్తి చెందుతున్న తరుణంలో మరోవైపు సీజనల్‌ జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో జనం ఏ జ్వరం వచ్చిందో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆస్పత్రులన్నీ జ్వర బాధితులతో కిటకిటలాడుతున్నాయి. సూపర్‌ స్పెషాలిటీ వైద్యుల నుండి గ్రామీణ వైద్యుల వరకు అత్యంత బిజీగా ఉంటున్నారు. దేశవ్యాప్తంగా హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు గణనీయంగా పెరుగుతూ వస్తుండటంతోపాటు కొన్ని రాష్ట్రాల్లో మరణాలు కూడా నమోదైన పరిస్థితులున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో కూడా దాదాపుగా 41 మంది బాధితులు ఉన్నట్లుగా వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. రెండు రోజుల క్రితం 21 కేసులు గడచిన రెండు నెలల్లో ఉండగా ఇప్పుడు మరో 20 కేసులు కొత్తగా నమోదైనట్లు స్పష్టమౌతోంది.

ఈకొత్త వైరస్‌ కేసులు అత్యధికంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో నమోదవుతున్నాయి. ముఖ్యంగా విశాఖ నగరంలోనే అత్యధిక కేసులు ఉన్నట్లుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేనిపక్షంలో వ్యాప్తి తీవ్రత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇలాంటి పరిస్థితుల్లో కాలానుగుణంగా వచ్చే సీజనల్‌ జ్వరాలు విపరీతంగా ఉన్నాయి. కొత్త వైరస్‌ జ్వరాలకు, ఈ ఫ్లూ జ్వరాలకు దాదాపుగా ఒకే రకమైన సారూప్యత ఉండటంతో జనం టెన్షన్‌ పడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న వివరాల ప్రకారం హెచ్‌3ఎన్‌2 వైరస్‌ కేసులు తక్కువగా ఉన్నప్పటికీ అనధికారికంగా వందల సంఖ్యలో ఉన్నట్లుగా ప్రైవేటు వైద్యులు వెల్లడిస్తున్నారు. ఇన్‌ఫ్లూఎంజా సబ్‌ వేరియంట్‌ అయిన ఈ వైరస్‌ పట్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నప్పటికీ జనం మాత్రం టెన్షన్‌లోనే ఉన్నపరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది.

- Advertisement -

సాధారణంగా ఈవైరస్‌తో అధిక టెంపరేచర్‌తోపాటు విరేచనాలు, వాంతులు, దగ్గు, తలనొప్పి ప్రధాన లక్షణాలుగా కేంద్రం ప్రకటించింది. దాదాపు ఇవే లక్షణాలు సాధారణ ఫ్లూ జ్వరాల్లో కూడా కనిపిస్తాయి. ఏ జ్వరమైనా భయపడాల్సిన అవసరం లేదని అయితే కొత్త వైరస్‌కు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, జలుబు ఉన్నవారు తప్పనిసరిగా మాస్క్‌లు పెట్టుకోవాలని ఇష్టానుసారంగా యాంటీబయాటిక్‌లు వాడొద్దని హెచ్చరిస్తున్నారు. కేవలం జ్వర నివారణ మందులు వాడితే మూడు నుండి నాలుగు రోజుల్లో జ్వరం తగ్గుతుందని అయితే, దగ్గు రెండు నుండి మూడు వారాల్లో అదుపులోకి వస్తుందని ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని చెబుతున్నారు.

దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, వృద్ధులు జ్వర తీవ్రత, వైరస్‌ లక్షణాలు ఉంటే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా గతంలో కోవిడ్‌ బారిన పడినవారు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల్లో వచ్చే శ్వాసకోశ సమస్యలు ఈ బాధితులకు కూడా వచ్చే అవకాశాలున్నట్లుగా పేర్కొంటున్నారు. వైరస్‌ కేవలం మూడు నుండి నాలుగు రోజుల్లోనే శరీరంలో నుండి బయటకు వెళ్లిపోతుందని వైద్య నిపుణులు స్పష్టంచేస్తున్నారు. చాలా అరుదుగా న్యుమోనియా బారిన కొంతమంది బాధితులు పడే అవకాశాలున్నట్లుగా చెబుతున్నారు.

ఆర్టీపీసీఆర్‌లో నెగిటివ్‌

ఇదిలావుంటే, కోవిడ్‌ తరహాలోనే కొత్త వైరస్‌ లక్షణాలు ఉండటంతో అనేక మంది ఆర్టీపీసీఆర్‌ టెస్టుల కోసం పరుగులు పెడుతున్నారు. కొన్ని పట్టణాల్లో వైద్యులు ఆర్టీపీసీఆర్‌ టెస్టులకు ప్రాధాన్యతనిచ్చి రోగులను పరీక్షలకు పంపుతున్నారు. అయితే, రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తి చాలా స్వల్పంగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకూ టెస్టుల్లో కోవిడ్‌ కేసులు దాదాపుగా బయట పడలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే, తిరుపతి, విశాఖ నగరాల్లో రెండు నుండి మూడు కేసులు నమోదైనట్లుగా వెల్లడవుతోంది. ప్రస్తుతం జరుగుతున్న పరీక్షలను గమనిస్తే కోవిడ్‌ వ్యాప్తి దాదాపుగా లేదన్న అభిప్రాయాన్ని వైద్యులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలకు బలమైన ఆహారం, నీరు, ఓఆర్‌ఎస్‌ అధికంగా తీసుకోవాలని స్పష్టంచేస్తున్నారు. ముఖ్యంగా సోషల్‌ డిస్టెన్స్‌ గతంలో మాదిరిగా పాటిస్తే ఈవైరస్‌ బారిన పడే ప్రమాదం చాలా స్వల్పమని చెబుతున్నారు.

అప్రమత్తమైన ప్రభుత్వం

రాష్ట్రంలో జ్వర బాధతుల సంఖ్య భారీగా పెరుగుతున్న తరుణంలో ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వే ఆదేశాలిచ్చింది. దీంతో వైద్య ఆరోగ్య సిబ్బంది వాలంటీర్లు ఆశావర్కర్లు జ్వర పీడితులను గుర్తించే పనిలో ఉన్నారు. ఇంటింటికీ తిరుగుతూ జ్వర బాధితుల వివరాలు సేకరిస్తూ వాటిని ప్రభుత్వానికి నివేదిస్తున్నారు. ఇదే సమయంలో సమీప ఆరోగ్య కేంద్రాల ద్వారా బాధితులకు అవసరమైన మందులు వైద్యాన్ని అందించేందుకు కృషిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement