Wednesday, February 1, 2023

Big Story: పడిపోతున్న పత్తి ధర.. సీసీఐ కేంద్రాల వైపు రైతుల చూపు

అమరావతి, ఆంధ్రప్రభ : పత్తి ధర పడిపోతోంది. క్వింటా పత్తి రూ.10 వేలకు పైగా పలికిన ధర ఇప్పుడు రూ.5,500 నుంచి రూ.8500 వద్ద తచ్ఛాడుతోంది. గడిచిన నెలరోజుల్లో ఆదోని పత్తి మార్కెట్లో సగటు ధర రూ.1800 వరకు పడిపోవటం రైతాంగాన్ని కలవర పెడుతోంది. గతనెల అక్టోబరు 1న రూ.9851గా ఉన్న సగటు ధర నెలరోజుల్లో రూ.8129కు పడిపోయింది. గరిష్ట ధర రూ.10653 నుంచి రూ.8549 కి తగ్గిపోయింది. క్వింటా పత్తి కనిష్ట ధర అక్టోబరు 1న రూ.5969గా ఉండగా, నెలాఖరుకు రూ.5369కి తగ్గిపోయింది. గడిచిన రెండు వారాల ధరల సరళీ, దేశీయ డిమాండ్‌, విదేశీ ఎగుమతుల ఆధారంగా పత్తి ధర మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వాతావరణం అనుకూలించటంతో ఈ ఏడాది (2022-23) ఖరీఫ్‌ సీజన్‌ లో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి మించి రైతులు పత్తి సాగు చేశారు.

ఖరీఫ్‌ విస్తీర్ణ లక్ష్యం 14.73 లక్షల ఎకరాలు కాగా, 2.3 లక్షలు ఎకరాలు అదనంగా సుమారు 17 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పండించినట్టు అంచనా. దిగుబడి కూడా రికార్డు స్థాయిలో 20 లక్షల టన్నులకు చేరువ కావచ్చని భావిస్తున్నారు. డిమాండ్‌-సప్లయ్‌ల మధ్య సారూప్యం కుదరకపోవటం పత్తి ధరలు తగ్గుముఖం పట్టటానికి మరో కారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బహిరంగ మార్కెట్లో విక్రయాలకే పరిమితమైన రైతులు కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) వైపు చూస్తున్నారు. ఈ నెల 1 మంగళవారం నుంచే రాష్ట్రంలో సిసీఐ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించే అవకాశం ఉంది.

- Advertisement -
   

ఈనెల 1 నుంచి ప్రారంభించి రానున్న రెండువారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా నిర్ణయించుకున్న మేరకు కొనుగోలు కేంద్రాలన్నిటిలో కార్యకలాపాలు కొనసాగించాలని సీసీఐ భావిస్తోంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సిసిఐ కొనుగోలు కేంద్రాల కోసం అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ మార్కెట్లో ధరల క్షీణతను అదుపు చేసేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రాలు దోహదపడతామయని అధికారులు చెబుతున్నారు. మార్కెట్లో పత్తి ధరలు భారీ స్థాయిలో తగ్గిపోయినా సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో మాత్రం కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రకటించిన మద్దతు ధరలకు పంటను కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

సీసీఐ మద్దతు ధర రూ.6380

కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరకు కాటన్‌ కొర్పారేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) పత్తిని కొనుగోలు చేయనుంది. బిన్ని, బ్రహ్మగా పిలిచే పొడుగు గింజ పత్తి కనీస మద్దతు ధరలను క్వింటా రూ.6380 గా, ఎంఈసీహెచ్‌ గా పిలిచే మధ్య రకం పత్తికి రూ.6,280గా నిర్ణయించింది. బహిరంగ మార్కెట్లో క్వింటా పత్తి కనిష్ట ధర రూ.5 వేల నుంచి రూ.5.5 వేల వద్ద నిలిచిపోయిన నేపథ్యంలో రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాలకు పంటను తీసుకొచ్చే అవకాశం ఉంది. గరిష్టంగా 8 శాతం తేమ ఉన్న పత్తికి ఎలాంటి తగ్గింపు లేకుండా పూర్తిస్థాయి మద్దతు ధర చెల్లించాలని సీసీఐ మార్గదర్శకాలు రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ 85 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది.

51 జిన్నింగ్‌ మిల్లులు, 32 అగ్రికల్చర్‌ మార్కెట్‌ కమిటీ- యార్డుల్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. డిమాండ్‌ ఆధారంగా మరికొన్ని కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో పత్తిని విక్రయించదలుచుకున్న రైతులకు ఈ-క్రాప్‌ తప్పనిసరి. తమ సమీపంలోని రైతు భరోసా కేంద్రాలను సందర్శించి ఈ-క్రాప్‌ చేసుకోవచ్చు. పంట విక్రయదారులు ముందుగా ఆర్బీకేల్లో పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ-క్రాప్‌ డేటాలో నమోదై ఉన్న పత్తి సాగుదారులు మాత్రమే పంటను సీసీఐ కేంద్రాలకు తీసుకెళ్ళాల్సి ఉంటు-ంది. పత్తి విక్రయాల్లో దళారుల ప్రమేయాన్ని పూర్తిస్థాయి తగ్గించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement