Saturday, October 12, 2024

Exclusive తప్పు జరిగింది స్వామీ … ఆనంద నిలయం అపవిత్రం!

భక్త జనుల్లో ఆగ్రహం
శ్రీవారి లడ్డూలో అన్య పదార్థాలు
తిరుపతి లడ్డూకు ఎంతో విశిష్టత
స్వామివారికి నైవేద్యంగా లడ్డూ ప్రసాదం
309 ఏండ్ల చరిత్ర ఉందంటున్న చరిత్రకారులు
ఇప్పటిదాకా నకలూ లేదు, నకిలీ అస్సలే లేదు
నెయ్యిలో కల్తీతో.. పొలిటికల్​ కాంట్రవర్సీ
పొలిటికల్​ లీడర్లలో రగిలిన చిచ్చు
యానిమల్​ ఫ్యాట్​ వినియోగించారన్న సీఎం చంద్రబాబు
కల్తీ వాస్తవమేనన్న టీటీడీ ఈవో.. ఆధారాల బహిర్గతం
సీబీఐ విచారణ కోరిన కాంగ్రెస్​ చీఫ్​ షర్మిల

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ :
తిరుమల తిరుపతి లడ్డూ ప్రసాదం రుచి, శుచి , పవిత్ర వర్ణనాతీతం. తిరుమల లడ్డూ ప్రసాదం అంటే స్వయంగా శ్రీవారే అనుగ్రహించే ప్రసాదమని భక్తుల విశ్వాసం. శ్రీవారి దర్శనమే కాదు.. శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని స్వీకరించాలని భక్త జన కోటి తిరుమలకు వ‌స్తుంటారు. శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డూకు అంతే ప్రాముఖ్యం, ప్రాధాన్యత ఉంది. ఇక్క‌డి లడ్డూ అంటే ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అలాంటి లడ్డూ ప్రసాదం వివాదాల్లో నిలిచింది. తిరుమల లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు , ఇత‌ర ప‌దార్థాలు ఉన్నాయ‌ని సీఎం చంద్రబాబు బ‌హిర్గ‌తం చేశారు. యావత్ హిందువులు, రాజకీయేతర పార్టీల నేతలు జగన్‌పై నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ నేతలు మాత్రం ఇవి కేవలం రాజకీయ వైరంతో అపవాదులని.. తిరుమల ప్రతిష్టను దిగజార్చేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయలేదని, దైవ సాక్షిగా ప్రమాణాలకు సిద్ధమని వాదిస్తున్నారు. ఈ వివాదంలో ఎవరి మాట నిజం అనేది తెలియాలి.

- Advertisement -

లడ్డూ కథ తెలుకుందాం..

లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుమలలో లడ్డూ ప్రసాదం ఎలా పుట్టింది? ఎప్పుడు ఆవర్భవించింది. .? ఎవరు ప్రారంభించారు..? పరిమాణం ఎంత? ధర ఎంత‌? ఎవరు తయారీదారులు.. ఇలా అనేక ప్రశ్నలతో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. 309 ఏళ్ల కిందటి నుంచే తిరుమల వేంకన్నకు ఈ లడ్డూల నైవేద్యం ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2న శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని తయారు చేసినట్లు చరిత్ర చెబుతోంది.. 1803లో బూందీగా పరిచయమైన ఈ ప్రసాదం 1940 నాటికి లడ్డూ ప్రసాదంగా స్ధిరపడింది. ఇదీ తిరుమల పండితుల కథనం. మొదట్లో ఈ లడ్డూ ప్రసాదాన్ని ఎనిమిది నాణేలకే ఇచ్చేవారు. త‌ర్వాత 2 రూపాయలకు ధర పెరిగింది. ₹5, ₹10, ₹15, ₹25 నుంచి ప్రస్తుతం ₹50 కి చేరింది. 1940లోని లడ్డూను ప్రామాణికంగా తీసుకుంటే ప్రస్తుతం లడ్డూ వయస్సు 84 ఏళ్లు. తిరుపతి లడ్డూకు పేటేంట్ హక్కు , ట్రేడ్ మార్క్ కూడా ఉన్నాయి. పల్లవుల కాలం నుంచే ఈ ప్రసాదాల చరిత్రకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.. విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయలు కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్టు పూర్వీకులు చెపుతున్నారు.

నకలు.. నకిలీకి నోచాన్స్..

శ్రీవారి లడ్డూను మరెక్కడా తయారు చేయటానికి వీల్లేదు. శ్రీవారి లడ్డూకి పేటెంట్ తిరుమలే. ట్రేడ్ మార్క్ తిరుమలదే. ఈ లడ్డూల తయారీకి వినియోగించే సరుకుల మోతాదును ‘దిట్టం’ అంటారు. దీనిని తొలిసారిగా టీటీడీ పాలక మండలి 1950 లో తీర్మానించింది. పెరుగుతున్న భక్తులకు అనుగుణంగా దామాషా ప్రకారం దిట్టాన్ని పెంచుతూ వచ్చారు. 5100 శ్రీవారి లడ్డూల తయారికి దిట్టంలో 803 కిలోల సరుకులు వినియోగిస్తారు.

చంద్రబాబు ఏమన్నారు?

ఎన్డీయే కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు ‘తిరుమల లడ్డూను కూడా నాసిరకంగా తయారు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పాం. కానీ, అక్కడ దుర్మార్గమైన ప్రయత్నాలు చేశారు. అన్నదానంలో కూడా క్వాలిటీ లేకుండా చేశారు. దేవుడి దగ్గర పెట్టే ప్రసాదాన్ని అపవిత్రం చేసే విధంగా వ్యవహరించారు. ఒక్కోసారి చాలా బాధేస్తోంది. నాసిరకమైన ఇన్‌గ్రీడియెంట్సే కాకుండా నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్‌ను వాడారు. మేం నాణ్యత పెంచుతాం. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడే బాధ్యత మనందరిపైనా ఉంది’ అన్నారు చంద్రబాబు.

కల్తీ నిజమే …ఈవో వివరణ …

రెండు నెలల కిందటే… జులై 23న ఓ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో నెయ్యిలో కల్తీపై టీటీడీ ఈవో మాట్లాడారు. టీటీడీకి సరఫరా చేస్తున్న నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్స్ కలిసి కల్తీ జరిగిందని తెలిపారు. నెయ్యి సరఫరా చేసే అయిదుగురు సప్లయర్లలో ఒకరి వల్ల ఈ తప్పు జరిగిందని చెప్పారు. చంద్రబాబు వ్యాఖ్యలు నిజమని, వైసీపీ హయాంలో జంతువుల నెయ్యితో లడ్డూ తయారుచేశారని టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రమణ కూడా ఆరోపించారు.

సీబీఐ విచారణ జరిపించాలి: షర్మిల

హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా టీడీపీ, వైసీపీలు రాజకీయాలు చేస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిలారెడ్డి ఆరోపించారు. లడ్డూ ప్రసాదంలో నెయ్యికి బదులు జంతువుల నూనెలు వాడారని సీఎం హోదాలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని.. తక్షణం ఉన్నత స్థాయి కమిటీ వేయాలని లేదా సీబీఐతో విచారణ జరిపించాలని షర్మిల డిమాండ్ చేశారు.

తనిఖీల తర్వాతే నెయ్యి వినియోగం: టీటీడీ ఉద్యోగులు

తిరుమల లడ్డూల తయారీలో జంతువుల కొవ్వును వినియోగిస్తున్నారని సీఎం వ్యాఖ్యానించడం తమను అవమానించడమేనని టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాల గౌరవాధ్యక్షులు కందారపు మురళి విమర్శించారు.
టీటీడీలో పారదర్శకమైన విధానాలు అనుసరిస్తారని, ఏ ప్రసాదం తయారీకైనా దానికి వినియోగించే ఆహార పదార్థాలను తనిఖీ చేయడానికి టీటీడీ పరిధిలో ల్యాబ్ ఉందని, తనిఖీలు చేసిన తర్వాతే వాటిని వినియోగిస్తారని గుర్తుచేశారు. ఇది కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో ఉంటుందన్నారు. టీటీడీ నుంచి రోజుకొక బృందం ప్రతిరోజూ సర్టిఫై చేసిన తర్వాతనే ప్రసాదాలకు వినియోగించే ఆహార పదార్థాలను స్వీకరిస్తారని తెలిపారు.

చర్యలు తీసుకోవాలి: బీజేపీ

తిరుమల లడ్డూలో యానిమల్ ఫ్యాట్స్ ఉపయోగించడం దురదృష్టకరమని బీజేపీ ఎంపీ, ఓబీసీ మోర్చా నేత లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. హిందూ సమాజం మొత్తం ఈ ఘటనను ఖండిస్తోందన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన అప్పటి అధికారులపై చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ల్యాబ్ పరీక్షల్లో.. నిజాలు చూడండి : ఆనం

టీటీడీ పంపిన శాంపిళ్లను టెస్టింగ్ కోసం గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు పంపారని టీడీపీ ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. ఈ ల్యాబ్‌లో పరిశీలించిన శాంపిల్స్‌లో జంతువుల కొవ్వు ఉన్నట్లు నివేదికల్లో ఉందన్నారు. ‘ఎస్’ వాల్యూ నిర్దేశించిన పరిధిలో లేకపోతే దాన్ని ఫారిన్ ఫాట్‌గా భావిస్తారు. ప్రామాణిక ‘ఎస్’ వాల్యూ దాదాపు 95.68 నుంచి 104.32 మధ్య ఉండాలి. సోయాబీన్, సన్ ఫ్లవర్, ఆలివ్, ఫిష్ ఆయిల్, పామాయిల్ వంటివాటి నుంచి తయారయ్యేవాటిని ఫారిన్ ఫాట్‌గా భావిస్తారు. సెంటర్‌ ఫర్‌ అనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్‌స్టాక్ అండ్ ఫుడ్‌ ల్యాబ్‌కు వచ్చే శాంపిళ్ల వివరాలు రహస్యంగా ఉంటాయని, ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి వచ్చాయనే వివరాలు తెలియవని లాబ్ ఉద్యోగులు చెబుతున్నారు. కానీ ఈ రిపోర్టు ,, నకిలీనా… వాస్తవమా? అర్థం కాని రీతిలో యావత్ ప్రపంచాలన్ని కలవర పెట్టిన మాట వాస్తవం.

Advertisement

తాజా వార్తలు

Advertisement