Saturday, October 5, 2024

Exclusive – ల‌డ్డూ వివాదం – పొలిటిక‌ల్‌ వార్‌!

శ్రీ‌వారికి అప‌చారం
మాట‌లతో తూటాలు పేలుస్తున్న‌ లీడ‌ర్లు
పొలిట‌క‌ల్ ట‌ర్న్ తీసుకున్న తిరుమ‌ల వ్య‌వ‌హారం
మంత్రులు, మాజీ మంత్రుల మ‌ధ్య విమ‌ర్శ‌లు
నిజాలు నిగ్గు తేలుస్తామ‌న్న సీఎం చంద్ర‌బాబు
ప్ర‌ధానికి లేఖ రాసిన మాజీ సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి
పూర్తిస్థాయి విచార‌ణ‌కు సిట్ ఏర్పాటు
ఐపీఎస్ ఆఫీస‌ర్ స‌ర్వ‌శ్రేష్ట్ త్రిపాఠీకి బాధ్య‌త‌లు
వైసీపీ లీడ‌ర్ల మాట‌ల‌పై ఉప‌ముఖ్య‌మంత్రి ఫైర్‌
దేవుడి మాన్యాలు, ఆస్తుల‌ను అమ్మేశార‌ని ప‌వ‌న్ ఆగ్ర‌హం
సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేసిన వైవీ సుబ్బారెడ్డి
సుబ్బారెడ్డి త‌ర‌పున వాద‌న‌లు వినిపించిన పొన్న‌వోలు
యానిమల్ ఫ్యాట్‌కే ధ‌ర ఎక్కువ‌.. ఎలా క‌లుపుతార‌ని వ్య‌ఖ్య‌లు
100 రోజుల హామీలు త‌ప్పించుకోవ‌డానికేన‌న్న కాకాణి
అప్పుడు ఎందుకు ఆరోప‌ణ‌లు చేయ‌లేద‌న్న రోజా
జ‌గ‌న్ ముమ్మాటికీ అప‌చారం చేశార‌న్న సీఎం చంద్ర‌బాబు
అబ్దుల్ క‌లాం, సోనియా కంటే గొప్ప‌వారా అని విసుర్లు
శ్రీ‌వారి స‌న్నిధిలో ప్రాయ‌శ్చిత్త కార్య‌క్ర‌మాలు
సంప్రోక్ష‌ణ‌లు, శాంతిహోమం చేప‌ట్టిన అర్చ‌కులు

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్‌, హైద‌రాబాద్‌: శ్రీవారి లడ్డూ వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తుంది. వైసీపీ, టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పాలిటిక్స్‌లో హీట్ పెంచుతున్నారు. మంత్రులు, మాజీ మంత్రులే కాకుండా.. ఈ ఇష్యూలోకి సీఎం, మాజీ సీఎం కూడా ఎంట్రీ ఇచ్చి వివాదాన్ని కాస్త నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు. ఇక‌.. మాట‌ల‌తో కాదు.. చేత‌ల్లో చూపిస్తామంటూ సీఎం చంద్ర‌బాబు సిట్ (స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌)ని నియమించారు. దీనికి ఐపీఎస్ ఆఫీస‌ర్ అయిన స‌ర్వ శ్రేష్ట్ త్రిపాఠిని ఇన్‌చార్జి చేశారు. అయితే.. సీఎం వ్యాఖ్య‌ల‌కు కౌంటర్‌గా ఏ విచారణకైనా సిద్ధమంటున్నారు వైసీపీ నేతలు. మొత్తంగా ఈ వ్యవహారం అంతా రాజ‌కీయ దుమారం రేపుతూ.. లీడ‌ర్ల‌ను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

- Advertisement -

ఉప‌ముఖ్య‌మంత్రిలో ఆగ్ర‌హ‌జ్వాల..

గత ప్రభుత్వ హయంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన వ్యవహారాలపై ఉప ముఖ్య‌మంత్రి పవన్‌కల్యాణ్ కీలక సూచనలు చేశారు. టీటీడీ ఆస్తులు, భగవంతుడి ఆభరణాలకు గత ప్రభుత్వం రక్షణ కల్పించిందా? లేదా! అనే కోణంలో కూడా విచారణ అవసరమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులనే తనఖా పెట్టిన గత పాలకులు.. దేవుడి మాన్యాలు, ఆస్తుల జోలికి వెళ్లకుండా ఉంటారా? అనే సందేహం ప్రజల్లో ఉందని సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలో ప్రస్తావించారు. టీటీడీలోని గత పాలకమండలి స్వామి వారి నిరర్థక ఆస్తులని అమ్మే ప్రయత్నం చేసిందని, తమిళనాడులో 23 ఆస్తులు, గుంటూరు, రంగారెడ్డి, హైదరాబాద్‌లో ఉన్న పలు ఆస్తులను అమ్మకానికి పెట్టారని పవన్ ఆరోపించారు. దీనికంత‌టికీ పూర్తిస్థాయిలో ఆధారాలున్నాయ‌న్న ప‌వ‌న్ మండిప‌డ్డారు.

సుప్రీంకోర్టుకు చేరిన ల‌డ్డూ వివాదం..

తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ దుమారం కొనసాగుతుండ‌గానే.. నెయ్యి కల్తీలో తమ పాత్ర లేదని ప్రమాణం చేయడానికి టీటీడీ మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి తిరుమలకు వెళ్లారు. భూమన ప్రమాణం చేస్తుండగానే పోలీసులు అక్కడి నుంచి ఆయ‌న‌ను తీసుకెళ్లిపోయారు. ఇక.. తిరుమల లడ్డూ కల్తీపై వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మ‌న్‌ వైవీ సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. లడ్డూ వివాదంపై విచారణ జరపాలని ఆ పిటిషన్‌లో కోరారు. స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలని కోర్టును ఆశ్రయించారు.

యానిమ‌ల్ ఫ్యాట్‌కే ఖ‌రీదెక్కువ‌న్న పొన్న‌వోలు..

తిరుప‌తి లడ్డూ వివాదంలో కూటమి సర్కారు చేస్తున్న ప్రచారాన్ని మాజీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్‌, న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తప్పుబట్టారు. కోట్లాదిమంది శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా సర్కారు ప్రవర్తించిందని.. దీనిపై విశ్రాంత న్యాయమూర్తి లేదా సిట్టింగ్ జడ్జ్‌ ద్వారా నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జ‌రుగుతున్న ప్రచారంలో నిజాలు నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టులో వైవీ సుబ్బారెడ్డి పిల్ దాఖలు చేయగా.. ఆయన తరుపును పొన్నవోలు వాదనలు వినిపించారు. వేల రూపాయల ఖరీదైన యానిమల్ ఫ్యాట్‌ను తక్కువ ధరకు వచ్చే నెయ్యిలో కలిపారని అనటం హాస్యాస్పదమన్నారు.

త‌ప్పు క‌ప్పిపుచ్చుకునేందుకే అన్న‌ కాకాణి..

100 రోజుల తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే లడ్డు గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కామెంట్స్ చేశారు. లడ్డూలో నెయ్యి క‌ల్తీ గురించి విచారణ జరపాలని ప్రధాని మోదీకి మాజీ సీఎం జగన్ లేఖ రాశారని అన్నారు. టీటీడీ ఈఓ శ్యామలరావుని కీలు బొమ్మలా మార్చి సీఎం చంద్రబాబు ఆడిస్తున్నాడని మండిపడ్డారు. జూన్‌లో ఎవరి ప్రభుత్వం ఉంది ? ఒకవేళ ఆ నెయ్యిని జూన్, జులై నెల‌ల్లో వాడి ఉంటే తప్పు ఎవరిది అని ప్రశ్నించారు. భక్తుల మనోభావాలతో ఆడుకుంది చంద్రబాబు కాదా అని దుయ్యబట్టారు.

అప్పుడెందుకు ఆరోప‌ణ‌లు చేయ‌లేదన్న రోజా

ఇప్పటికే మాజీ మంత్రి రోజా టీడీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ హయంలో కేంద్రమంత్రులు, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అప్పటి ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా పలు సార్లు శ్రీవారిని దర్శించుకున్నారని గుర్తు చేశారు. లడ్డూ ప్రసాదంలో టేస్ట్ మారి ఉంటే.. అప్పుడెందుకు ప్రశ్నించ లేదని నిలదీశారు. సీఎం చంద్రబాబు డైవెర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే ఈ వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చారని రోజా ఆరోపించారు.

సోనియా, అబ్దుల్ క‌లాం కంటే జ‌గ‌న్ గొప్ప‌వారా?

ప్ర‌ధానికి జగన్ లేఖ రాయడంపై చంద్రబాబు గట్టిగా రియాక్ట్ అయ్యారు. తప్పులు చేసి తప్పించుకోవడం, ఎదురు దాడి చేయడం వైసీపీ స్టైల్ అన్నారు. తిరుమల క్షేత్రంలోని సాంప్రదాయాలను వైసీపీ తుంగలో తొక్కిందని మండిపడ్డారు. టీటీడీ మాజీ ఈఓ ధర్మారెడ్డి తీరును తీవ్రంగా తప్పుపట్టారు. బోర్డు మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భార్య బైబిల్ పట్టుకొని తిరుగుతారని విమర్శించారు. భూమన కుమార్తెకు క్రిస్టియన్ సంప్రదాయాల ప్రకారం వివాహం చేశారని గుర్తుచేశారు. అబ్దుల్ కలాం, సోనియా కంటే జగన్, వైసీపీ నేతలు గొప్పవారా?.. తిరుమ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆ ప్రొటోకాల్ ఎందుకు పాటించ‌లేద‌ని సీఎం చంద్ర‌బాబు ప్రశ్నించారు.

తిరుమ‌ల‌లో ప్రాయ‌శ్చిత్త కార్య‌క్ర‌మాలు..

తిరుమలలో ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేప‌ట్టారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి కలవడంతో టీటీడీ అధికారులు సంప్రోక్షణతో పాటు శాంతి హోమం నిర్వహించారు. పూర్ణాహుతి తర్వాత పంచగవ్వ ద్రవ్యాలతో ఆలయంలోని అన్ని పోట్లలో సంప్రోక్షణ చేశారు. అన్నప్రసాద పోటు, లడ్డు పోటు, ఉగ్రాణము, లడ్డు కౌంటర్లు, బూందీ పోర్టు, వరాహ స్వామి వ‌ద్ద‌ సంప్రోక్షణ నిర్వహించారు. ఇక‌.. దేవుడి ప్ర‌సాదం విషయంలో కల్తీ ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఈ వివాదం రానున్న రోజుల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement