Monday, October 7, 2024

Exclusive – అజ్ఞాత‌వాసిలో ఆగ్ర‌హ జ్వాల‌! శ్రీ‌వారికి అప‌చారంపై మండిపాటు

ల‌డ్డూ, ప్ర‌సాదాల్లో క‌ల్తీ నెయ్యి వాడ‌కం
పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకున్న వివాదం
అంతా కామ‌న్‌, లైట్ తీస్కోవాలంటున్న‌ వైసీపీ
మ‌త‌ప‌ర‌మైన వివాదాలొద్దన్న‌ ప్ర‌కాశ్‌రాజ్‌
విష‌యం తెలుసుకుని మాట్లాడాల‌న్న ప‌వ‌న్‌
మ‌తాలు వేరైనా.. మ‌నుషులంతా ఒక్క‌టే
ఎవ‌రు చేసినా త‌ప్పిద‌మే.. ప్రాయ‌శ్చిత్తం కోరాలి
11 రోజుల‌పాటు దీక్ష చేప‌ట్టిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌
శాంతికోస‌మే ఉప‌ముఖ్య‌మంత్రి ప్రాయ‌శ్చిత్త దీక్ష‌
రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేస్తున్న ప్ర‌త్య‌ర్థి పార్టీలు
సేనాని అజ్ఞా.. సైలెంట్ అయిన జ‌న‌సైన్యం

ఆంధ్రప్రభ స్మార్ట్, సెంట్రల్ డెస్క్ : డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ అవేశపరుడు. అతడొక చేగువేరా.. కమ్యూనిజానికి అభిమానే అయినా.. నాస్తికుడు కాదు, వాస్తవిక భావకుడు.. సర్వమానవ సమానత్వం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందుకే ప‌వ‌న్‌లో పోరాడే తత్వంతో పాటు ఆధ్యాత్మిక చింతనా ఎక్కువే. గత ఎన్నికల్లో వారాహి యాత్ర చేప‌ట్టారు. విజయం సాధించిన త‌ర్వాత‌ అమ్మవారి దీక్ష చేప‌ట్టి తన భక్తిభావాన్ని చాటుకున్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తులో భాగంగా ఏపీలో జనసేన పార్టీ 21 అసెంబ్లీ, 2 లోక్‌స‌భా స్థానాల్లో పోటీ చేసి, వంద‌కు వంద శాతం విజ‌యాల‌ను అందుకుంది. అఖండ విజయం సాధించిన నేపథ్యంలో జూన్ 25 నుంచి వారాహి అమ్మవారి దీక్షను 11 రోజుల పాటు చేశారు. దీక్షలోభాగంగా కేవలం ద్రవాహారం, పాలు, పండ్లు, మంచినీరు మాత్రమే తీసుకున్నారు.

- Advertisement -

తిరుపతి వేంకన్నకు ప్రాయశ్చిత దీక్ష..

ప్రస్తుతం తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం యావ‌త్ దేశాన్ని కుదిపేస్తోంది. హిందూ సమాజమంతా ఈ అపచారానికి ప్రాయశ్చితపడుతోంది. దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. భాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాడానికి ఏపీ స‌ర్కారు రెడీ అయ్యింది. విచార‌ణ‌కు సిట్ (స్పెష‌ల్ ఇన్వెస్టిగేష‌న్ టీమ్‌)ను కూడా ఏర్పాటు చేసింది. అంతేకాకుండా తిరుమల లడ్డూ కల్తీ ఘటనకు క‌దిలిపోయిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి దీక్ష ప్రారంభించారు.

దుర్గ‌మ్మ‌కు ప్ర‌త్యేక పూజ‌లు..

ప‌వ‌న్ క‌ళ్యాణ్ చేప‌ట్టిన ఈ దీక్ష 11 రోజుల పాటు కొన‌సాగుతుంది అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకుని దీక్ష విరమించ‌నున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్షలో .. భాగంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలో ప‌వ‌న్‌ శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. దుర్గమ్మ సన్నిధిలో మెట్లను శుభ్రం చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య మెట్ల పూజ చేశారు. అనంతరం దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయన స్ఫూర్తితో జనసైన్యం పెద్ద ఎత్తున‌ కదిలింది. తమ ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రాయశ్చిత్త పూజలు చేప‌ట్టారు. జనసేనాని ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో నిమగ్నమై.. యావత్ హిందువుల్లో మమేకమవుతుంటే దీన్నీ కొంత‌మంది పొలిటికల్ స్టంట్‌గా చిత్రీక‌రించే య‌త్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మౌనాన్ని పరీక్షిస్తున్నారు. ఫలితంగా ఆయనలో ఉగ్ర రూపం మెల్ల మెల్ల‌గా బయటకు వస్తోంది.

పొలిటికల్ ట‌ర్న్‌..

తిరుమల వెంకన్న ప్రసాదం వ్యవహారంలో వైఎస్సార్సీపీ నేతల తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన సహజ ఆవేశాన్ని వెళ్లగక్కారు. ఇందుకు కారణాలు కూడా ఉన్నాయి. లడ్డూ అపచారానికి సంబంధించి కల్తీ నెయ్యి వాడారని వైసీపీ పెద్దలపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రసాదాల్లో వాడింది స్వచ్చమైన నెయ్యి కాదని రిపోర్టులు కూడా స్పష్టం చేస్తున్నాయి. సీఎం చంద్రబాబు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. అప్పట్లో నెయ్యికి బదులు జంతువుల నూనెలతో ప్రసాదం తయారు చేయించార‌ని చంద్రబాబు ఆధారాల‌ను బ‌య‌ట‌పెట్టారు. కాగా, ఈ వ్యాఖ్యలపై టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.

మ‌త‌ప‌ర‌మైన విభేదాలు..

కూటమి ప్రభుత్వం శ్రీవారి ప్రసాదం పవిత్రతను దెబ్బ తీస్తోందని.. ఏదైనా త‌ప్పు జరిగి ఉంటే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలి టీటీడీ మాజీ చైర్మ‌న్ భూమ‌న అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా ప్రచారాలు చేయొద్ద‌ని హిత‌వుప‌లికారు. చేయ‌ని త‌ప్పుల‌కు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని రివ‌ర్స్ అటాక్ చేయ‌డం ప్రారంభించారు. ఈ పొలిటికల్ వార్‌లోకి తాను సైతం అంటూ పార్ట్ టైమ్‌ పొలిటీషియన్, నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఎంటర్ అయ్యారు. ఎక్స్‌ వేదికగా పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి పోస్టు పెట్టారు. మీరు ఉపముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో జరిగిన ఘటన కాబట్టి.. విచారించి నేరస్థులపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. అనవసర భయాలు కల్పించి.. జాతీయస్థాయిలో చర్చించుకునేలా చేస్తున్నారని.. దేశంలో మతపరమైన ఉద్రిక్తలు రేకెత్తించొద్ద‌ని ట్వీట్ చేశారు.

తెలుసుకుని మాట్లాడాలి.. రెచ్చ‌గొట్టొద్దు

హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వ్య‌వ‌హ‌రించిన వారిపై ఎందుకు మాట్లాడకూడదని ఉప ముఖ్య‌మంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఇంకో మతానికి సంబంధించి అంత అపరాదం జరిగితే ఊరుకునే వారా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్‌ని పొలిటిక‌ల్‌గా టార్గెట్ చేసి మాట్లాడిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి, భూమన‌ కరుణాకర్ రెడ్డి, సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌పై డిప్యూటీ సీఎం ఫైర్ అయ్యారు. తగురీతిలోనే వారికి మాట‌ల‌తో సమాధానం ఇచ్చారు. ఆధ్యాత్మిక చింతనతో ప్రాయశ్చిత్త దీక్షలోని నాయకుడ్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు రెచ్చగొడుతున్న వైఖరిపై జనసైనికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుంది. కానీ, తమ సేనాని ఆజ్ఞానుసారం ప్రశాంత పరిస్థితికి కట్టుబడి ఉన్నారని.. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు చెల‌రేగేవ‌ని ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement