Saturday, November 9, 2024

Exclusive – ప‌ల్నాడు జిల్లాల్లో భూ పందేరం – కాగితాల్లోనే స‌ర‌స్వ‌తి ప్రాజెక్టు

తెరమీదకు సిమెంట్ ఫ్యాక్టరీ
సున్నపు రాయి కొల్ల‌గొట్టే ప్లాన్‌
ఇంతకీ ఈ సరస్వతి క‌నిపించ‌దేమీ
రైతులనుంచి భూముల సేక‌ర‌ణ‌
పెద్ద ఎత్తున సర్కారు జాగాల‌ క‌మాయింపు
విచార‌ణ‌కు ఆదేశించిన ఉప‌ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌
1515 ఎక‌రాల‌కు చెందిన భూముల‌పై రీ స‌ర్వే
భూ స‌ర్వేల్లో అనేక అక్ర‌మాలు వెలుగులోకి
ఇదీ జ‌గ‌న్ చేతిలోని ఓ సూట్ కేస్ కంపెనీ కథ‌
లీజు ర‌ద్దుపై పిట‌ష‌న్‌.. కోర్టునూ త‌ప్పుదోవ ప‌ట్టించారు
వెలుగులోకి వ‌స్తున్న విస్తుపోయే వాస్త‌వాలు

ఆంధ్రప్రభ స్మార్ట్​, సెంట్రల్​ డెస్క్​: వైఎస్​ జగన్‌కు చెందిన సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు పల్నాడు జిల్లాలో వందల ఎకరాల భూములున్నాయి. సున్నపురాయి నిల్వలను కట్టబెట్టడంలో వైఎస్సార్​ హయాంలో నిబంధనలకు పాతరేసినట్టు తెలుస్తోంది. జగన్ సీఎం అయ్యాక మరింత ముందుకు వెళ్లి సొంత కంపెనీకి మరిన్ని ‘మేళ్లు’ చేసుకున్నారనే వాదనలు తెరమీదకు వచ్చాయి. పర్యావరణ శాఖను తప్పుదోవ పట్టించి ఎప్పటికప్పుడు అనుమతులు పునరుద్ధరించుకుంటున్న విషయం అధికారుల పరిశీలనలో బయటపడింది. జగన్ కంపెనీ ఆధీనంలోని భూముల్లో ప్రభుత్వ భూములూ ఉన్నట్టు అధికారుల స్పష్టం చేశారు. తండ్రి, కుమారుడు ముఖ్యమంత్రులుగా అధికార దుర్వినియోగానికి పాల్పడి సరస్వతీ పవర్‌కు అడ్డగోలుగా చేసుకున్న తీరుపై లోతైన విచారణ జరిపితే మరిన్ని విషయాలు బయటకు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

కోర్టుకు వెళ్ల‌డంతో అస‌లు విష‌యం వెలుగులోకి..

- Advertisement -

15 ఏళ్లు తమ భూమిని కోల్పోయి కష్టనష్టాలు అనుభవించిన జనంలో తమ హక్కు కోసం ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం దక్కింది. అదే సరస్వతీ పవర్ ఇండస్ర్టీస్. ఈ కంపెనీలో తనకు 51 శాతం షేర్లు ఉన్నాయని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్సీఎల్టీలో తన సోదరి షర్మిల, తల్లి విజయమ్మపై వాజ్యం దాఖలు చేయటంతో ఈ కంపెనీ అసలు రంగు బయటపడింది. కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ భూముల్లో అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నజర్ పడింది. సరస్వతీ పవర్ కంపెనీ అసలు సంగతేంటో ? తేల్చాలని ఆదేశించారు. ఇక ఇప్పటి వరకూ చేతులు కట్టుకున్న అధికారులు కళ్లు తెరిచారు. భూముల సర్వేలు జరిపారు. అనేక అక్రమాలు.. ఒక్కొక్కటి బయట పడుతోంది.

సున్న‌పురాయి నిల్వ‌ల‌పై క‌న్ను..

పల్నాడు జిల్లాలోని మాచవరం, దాచేపల్లి మండలాల్లోని భూమిలో అంతులేని సున్నపురాయి నిల్వలు ఉన్నాయి. ఈ సున్నపు రాయి గనులపై అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్గం దృష్టి పడింది. విద్యుదుత్పుత్తి కంపెనీ సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ వ్యాపార తరహాపై బైలాస్‌లో మార్పులు చేయకుండానే అప్పటి ప్రభుత్వం అడ్డగోలుగా గనులు లీజుకు ఇచ్చేసింది. సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్ పేరుమీద సిమెంట్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని నిర్ణయించిన జగన్ బైలాస్‌లో మార్పులు చేయాలని అనుకున్నారు. 2008 జులై 15న జగన్ అధ్యక్షతన కంపెనీ అత్యవసర సర్వసభ్య సమావేశం నిర్వహించారు. కంపెనీ సిమెంట్ వ్యాపారంలో ప్రవేశించేలా బైలాస్‌లో మార్పులు చేస్తూ జగన్ భార్య భారతి తీర్మానం ప్రవేశపెట్టారు. జగన్ తల్లి విజయలక్ష్మి బలపరిచారు.

కానీ దానికి నెల ముందే నాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2008 జూన్ 12న గనులశాఖ డైరెక్టర్ జారీచేసిన మెమో ఆధారంగా సరస్వతీ పవర్ అండ్ ఇండస్ట్రీస్‌కు మైనింగ్ లీజు కేటాయించింది. 2009 మే18న జీవో 107 జారీ చేసింది. కంపెనీ బైలాస్ మార్చకముందే లీజుకు ఆమోదం తెలుపుతూ మైనింగ్ శాఖ మెమో జారీ చేసింది. ఇది చట్టవిరుద్ధం, అధికార దుర్వినియోగమని అధికారులు చెబుతున్నారు.

అన్నీ సొంత జీవోలే..

సరస్వతీ పవర్‌కు తొలుత 2012 మార్చి 29న కొన్ని నిబంధనలకు లోబడి పర్యావరణ అనుమతులు జారీ అయ్యాయి. దాని ప్రకారం ఏడాదికి 0.0368 టీఎంసీల నీళ్లు సరస్వతీ పవర్‌కు కేటాయించాలి. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక ఆ నిబంధనను తుంగలో తొక్కుతూ సొంత కంపెనీకి 0.068 టీఎంసీలు కేటాయించేసుకున్నారు. ఇది పర్యావరణశాఖ అనుమతి ఇచ్చిన దాని కంటే రెట్టింపు. 2019 డిసెంబరు 3న జీవో81 జారీచేశారు. తర్వాత 2020 మే 15న (15.. -05..-2020) జీవో16 ద్వారా ఐదేళ్ల నీటి కేటాయింపును జీవిత కాలానికి మార్చేసుకున్నారు.

రాజధాని అమరావతి పేరిట

తన కంపెనీకి పర్యావరణ అనుమతులు పొందేందుకు మాత్రం అదే అమరావతిని జగన్ అడ్డుపెట్టుకున్నారని జనం ఆరోపిస్తున్నారు. సరస్వతీ పవర్ 2012లో జారీచేసిన పర్యావరణ అనుమతుల కాల పరిమితి 2018తో ముగుస్తుండటంతో అనుమతులు కొనసాగించాలని కోరుతూ పర్యావరణ మంత్రిత్వశాఖకు 2018 ఫిబ్రవరి 18న దరఖాస్తు చేశారు. రాజధాని అమరావతిలో చేపట్టే ప్రాజెక్టులకు సిమెంట్ అవసరం ఉంటుందని మంత్రికి తెలియజేశారు. అందువల్ల తమ పరిశ్రమకు అనుమతులు కొనసాగించాలని కోరారు. సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్ని సవాలును సరస్వతీ పవర్ కంపెనీ వేసిన పిటిషన్ అప్పటికే కోర్టు విచారణలో ఉందని అధికారుల పరిశీలనలో తేలింది. వ్యాజ్యాలేమీ లేవనడం ద్వారా పర్యావరణ మంత్రిత్వశాఖను తప్పుదోవ పట్టించడం వారి దృష్టికి వచ్చింది.

కోర్టునూ త‌ప్పుదోవ ప‌ట్టించారు..

సరస్వతీ కంపెనీ భూములపై జీవోలు ఏమైనా జారీ అయ్యాయా? అన్న ప్రశ్నకు ఏమీ లేవని బదులిచ్చింది. 2014 అక్టోబరులో మైనింగ్ లీజు రద్దు చేస్తూ జారీ చేసిన జీవో 98 అప్పటికే అమల్లో ఉన్న విషయాన్ని తొక్కిపెట్టిందని అధికారులు చెబుతున్నారు. ఇలాంటి తప్పుడు సమాచారంతో పర్యావరణ శాఖ నుంచి 2019 జులై 3న మూడేళ్ల కాల పరిమితితో 2022 మార్చి వరకు అనుమతులు పొందినట్టు పరిశీలనలో వెల్లడైంది. పర్యావరణ అనుమతి కోసం చేసిన దరఖాస్తులో దాదాపు 25 ఎకరాల ప్రభుత్వ భూమి తమ ఆధీనంలో ఉందని సరస్వతీ పవర్ అంగీకరించిందని, కానీ లీజు రద్దును సవాలుచేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా 25 ఎకరాల ప్రభుత్వభూమి ఉందన్న విషయాన్ని దాచిపెట్టి సరస్వతీ పవర్ తరపు న్యాయవాది కోర్టును తప్పుదోవ పట్టించారని అధికారుల పరిశీలనలో వెల్లడైంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement