Wednesday, September 18, 2024

Exclusive – మన్యంలో విలయం …. అల్లూరి జిల్లా అతలాకుతలం

జీకే వీధి మండలంలో విరిగిపడిన కొండ చరియలు
ఒకరు మృతి – ముగ్గురికి గాయాలు
కొట్టుకుపోయిన రహదారులు

  • రాకపోకలకు తీవ్ర అంతరాయం
  • ఉరకలేస్తున్న శబరి నది – ఉధృతం
    వాగులు వంకలు పరవళ్లు
  • సీలేరు, డొంకరాయి జలశాయాలకు వరద పోటు
    ముంపులో మోతుగూడెం, మదుగూరు, కొత్తపల్లి గ్రామాలు
  • అనుక్షణం భయంతో మన్యం గజగజ

( ఆంధ్రప్రభ స్మార్ట్, చింతూరు)
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రకృతి ప్రళయం సృష్టించింది. . ఈ విలయానికి అల్లూరి జిల్లా అతలాకుతలమై జనజీవనం కుదేలైంది. ఆదివారం రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, ఈదురు గాలులతో అల్లూరి జిల్లా వణుకుతోంది. ఈ క్రమంలోనే చింతపల్లి రెవిన్యూ డివిజన్‌ పరిధిలోని జీకే వీధి మండలంలో ఈ వర్ష భీభత్సానికి కొండ చరియలు విరిగిపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో రహదారులకు గండ్లు పడటం, రహదారులు కొట్టుకుపోవడం, వాగులు వంకలు ఉధృతంగా ప్రవహించడంతో ఎక్కడక్కడ జనజీవనం స్థంభించిపోయింది.

- Advertisement -


కొండ చరియలు పడి – ఒకరు మృతి – ముగ్గురికి గాయాల

ఏజేన్సీలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎన్నడూ లేని విదంగా జీకే వీధి మండలంలో కొండ చరియలు విరిగిపడి ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. గాలికొండ గ్రామ పంచాయతీ పరిధిలోని చట్రపల్లి గ్రామంలో భారీ వర్షానికి కొండ చర్యలు విరిగిపడి నివాస గృహాలపై పడటంతో కొర్రా కుమారి (25) మృతి చెందగా, కొర్రా పండన్న పరిస్థితి విషమంగా మరో ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు పేర్కోన్నారు. ఈ కొండ చరియలు విరిగిపడటంతో చట్రపల్లి గ్రామంలో 6 ఇల్లులు ధ్వంసమయ్యాయి. ఇదే మండలంలో పదహారు పంచాయతీలలోని గ్రామాల్లో పరిస్థితి దారుణంగా ఉంది గ్రామాలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇది ఇలా ఉంటే మొండిగడ్డకు చెందిన కందుల శాంతికి ఉదయం పురిటినోప్పులు రావడంతో చింతపల్ల్లి ఆసుపత్రికి తరలించేందకు కుటుంబ సభ్యులు పెద్ద సాహసం చేశారు. జెర్రల వంతెన వద్ద వాగు రహదారిపై ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఒక పక్క అంబులెన్స్‌కి మరో పక్క జీపుకి తాడు కట్టి ఆ తాడు సహాయం వరద నీటిలో ఆమెను అతికష్టం మీద దాటించి ఆసుపత్రికి తరలించారు.

-రాకపోకలకు తీవ్ర అంతరాయం

అల్లూరి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లా వ్యాప్తంగా రహదారులు వరదల దాటికి కొట్టుకుపోయాయి దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సీలేరు -ధారకొండ గ్రామాల మధ్య కొండచరియలు విరిగిపడ్డాయి. మొత్తం 12 చోట్ల రోడ్లపైన కొడరాళ్లు, బురద రహదారులపై ఉన్నాయి. సీలేరు – డొంకరాయి గ్రామాల మధ్య వలసగడ్డ వద్ద అప్రోచ్‌ కొట్టుకుపోయింది. ఇవే కాకుండా జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ రహదారులు, జాతీయ రహదారులు ఈ వరద ఉధృతికి గండ్లు పడి కొట్టుకుపోయాయి. ఈ రహదారులు కొట్టుకుపోవడంతో విశాఖపట్నం- భద్రాచలంకి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.


శబరి సీలేరు ఉధృతం
చింతూరు మన్యంలోని శబరి, సీలేరు నదులు వరద నీటితో ఉరకలేస్తున్నాయి. చింతూరు శబరి నది ప్రస్తుతం 33 అడుగులకు చేరుకొగా శబరికి అనుసంధానమైన కుయుగూరు, సోకిలేరు, చీకటీవాగు, చంద్రవంక వాగులు ఉధృతంగా ప్రవహిస్తూ రహదారులపై చేరాయి. ఈ వాగుల వరద నీరు రహదారులపై చేరడంతో ఆంధ్రా- ఒడిస్సా రాష్ట్రాలతో పాటు చింతూరు- విఆర్‌ పురం మండలాలకు, ఆదివాసీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

భారీగా నీరు విడుదల

చింతూరు ఏజెన్సీ ఎగువ ప్రాంతంలో ఉన్నటువంటి సీలేరు, డొంకరాయి జలశయాల నుండి జేన్కో అధికారులు భారీగా వరద నీటిని దిగువ ప్రాంతాల్లోకి విడుదల చేశారు. ఆదివారం రాత్రి డొంకరాయి నుండి 22500 క్యూసెక్కుల నీటిని, ఉదయం 1 లక్షా 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేయడంతో ఆ వరద నీరు శబరి, సీలేరు నదుల్లో కలసి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ వరద నీటి దాటికి మోతుగూడెం, మదుగూరు, కొత్తపల్లి గ్రామాల్లో కొన్ని ప్రాంతాల్లోతో పాటు పలు గ్రామాల్లో వరద నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది ఇలా ఉంటే వర్షం దాటికి చింతూరు మండలంలోని తూలుగొండ, చట్టి గ్రామాల్లో రెండిళ్ళు కుప్ప కూలాయి. ఈ ప్రకృతి ప్రళయంతో మన్యం ఒక పక్క వణుకుతుండగా మన్యం వాసులు భయంతో అనుక్షణం ఒక యుగంలా గడుపుతూ కాలం వెల్లబుచ్చుతున్నారు. ఏది ఏమైనప్పటకీ అల్లూరి జిల్లా ప్రకృతి ప్రళయంతో విలయ తాండవం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement