Friday, October 4, 2024

Exclusive – ఊరిని మింగేసిన ఉత్పాతం – కమ్మరితోటను మింగేసిన కొండ‌రాళ్లు..

మింగేసిన కొండ‌రాళ్లు.. క‌నిపించ‌ని
కమ్మరితోట! ఏపీలో ఇది మరో వయనాడ్​
భారీ వర్షాలతో ఊరును ముంచెత్తిన బండ‌రాళ్లు
ప్రాణాలు దక్కించుకున్న గిరిజనం
అటు కుంభవృష్టి.. ఇటు కొండరాళ్ల ధార
వాగులోనూ రాళ్ల పరవళ్లు..
ఇసుకతో నిండిపోయిన‌ పొలాలు
అధికారులు ఇలా వచ్చి.. అలా వెళ్లారు
కనీసం పరిశీలన కూడా చేయలేదు
ఇక్కడి నష్టం.. స‌ర్కారుకు అతి స్వల్పం
కమ్మరితోట వాసులకు మాత్రం తీరని కష్టం
అల్లూరి జిల్లాలో పకృతి విలయ తాండవం
80 ఏండ్ల ఆ ఊరి చరిత్రలో.. వారికి నిజంగా కాళరాత్రి
21 రోజుల తర్వాత వెలుగులోకి పకృతి విధ్వంసం
ఆంధ్ర‌ప్ర‌భ ప‌ల‌క‌రింపుతో.. క‌న్నీరుపెట్టిన‌ రైతులు

మాసినేని చంద్రశేఖర్ – ఆంధ్రప్రభ స్మార్ట్, చింతూరు

సెప్టెంబర్ 8వ తేదీ.. ఆదివారం అర్ధరాత్రి పకృతి విలయ తాండవం చేసింది. ఆ రోజు జోరు వాన కురిసింది. ఇంటి నుంచి జనం బయటకు రాలేదు. వానాకాలం ఇలాంటి జడివానకు అలవాటు పడిన జనం ఇంట్లోనే ముసుగుతన్నారు. అంత‌లోనే వారికి అకస్మాత్తుగా గుండెలదిరే శబ్ధం వినిపించింది. పిడుగు పడిందిలే అనుకున్నారు.. కానీ, అంత‌లోనే బ‌డ బ‌డ మంటూ బండ రాళ్లు దొర్లుతున్న శబ్దంలా తోచ‌డంతో ఉలిక్కిపడి లేచారు. సెల్ ఫోన్‌లో టైమ్ చూసుకుంటే అర్ధరాత్రి 12.30 చూపించింది. ఏం జరుగుతుందో బయటకు వచ్చి చూడలేని స్థితి. బతికితే బతుకుతాం.. చస్తే చస్తామని ఆ కాళరాత్రి కమ్మరితోట జనం భయం భయంగా నిద్దరోయారు. తెల్లారిన త‌ర్వాత‌ చూస్తే ఏముంది? వర్షం తగ్గలేదు. ఆ కుంభ వృష్టి మరింత బీతావహం సృష్టించింది.

ఒక్క‌రోజే 9 సెంటీమీట‌ర‌ల్ భారీ వ‌ర్షం..

ఆదివారం 24.20 మిల్లీమీటర్లు, సోమవారం 96.60 మిల్లీమీటర్ల వర్షం పడింది. మంగళవారం వర్షం తగ్గినా.. వరద ఆగలేదు. వరద అంటే నీరు కాదు.. కొండ రాళ్ల ప్రవాహం. జతగా ఇసుక పరవళ్లు తొక్కింది. ఇంకేముంది.. పచ్చని పంట‌పొలాల్లో ఇసుక‌మేట‌లు వేసింది. చేతికిరావాల్సిన పంట అంతా మ‌ట్టికొట్టుకుపోయింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మరో వయనాడ్ ఉపద్రవాన్ని సంత‌రించుకుంది.. కాకపోతే ఇక్కడ ప్రాణనష్టం జరగలేదు. జ‌నం బ‌తికారు కానీ, వారంతా ఇప్పుడు ఎందుకు బతికామా? అని గొల్లున ఏడుస్తున్నారు. కళ్లముందే సర్వం కోల్పోయారు. పునర్జీవనం కోసం అల్లాడుతున్నారు. ఎందుకంటే.. ఆ ఊళ్లో 115 కుటుంబాల్లో 600 మంది అడవి తల్లి ఒడిలో బతుకుతున్న వారే. ఇక కమ్మరితోట పరిస్థితిపై ఆ గ్రామ వీఆర్ఏ ఇచ్చిన సమాచారంతో.. అధికారులు వచ్చారు, పలకరించారు. వెళ్లారు.. మళ్లీ తిరిగి కూడా చూడలేదు. ఎందుకంటే ఆ ఊరికి కారులో చేరుకున్నా.. పొలాల్లో రాళ్ల మేటను చూడాలంటే నాలుగు కిలోమీటర్లు నడవాలి. ఎందుకు వచ్చిన ఆయాసం అనుకున్నారో, ఏమో ఈ గిరిజనం ఊసును అధికారులు మర్చిపోయారు.

- Advertisement -

ఇది మరో వయనాడ్..

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలోని ధారకొండ పంచాయతీ పరిధిలో ప్రకృతి ప్రళయం సృష్ఠించింది. ఈ ప్రళయం కేరళలోని వయనాడ్‌ తరహాలో విలాయతాండవం చేసింది. జనం ప్రాణాల జోలికి పోలేదు.. కానీ, కమ్మరితోటలో పంట పొలాలను ధ్వంసం చేసింది. ఇంత విపత్కకర విధ్వంసకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో తుపాన్‌ నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ ఆదివారం ఆర్ధరాత్రి సమయంలో భీకర శబ్ధంతో కమ్మరితోట గిరిజనం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో గ్రామస్తులు భయం భయంతో ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఆ రాత్రిని క్షణం ఒక యుగంలా గడిపారు. ఒక పక్క భారీ వర్షం.. మరో వైపు భారీ శబ్ధాలు, ఇంకోవైపు భీకర గాలి ఈ మూడు కలిసి పెద్ద విధ్వంసమే సృష్ఠించి ఆ ఊరి జనానికి తీరని శోకం మిగిల్చాయి. తెల్లారే సరికి వరి, జాఫర్‌ (పెయింటింగ్‌) పంటలు, ఎర్ర చందనం, టేకు చెట్లు నామ రూపాల్లేకుండా పోయాయి. సారవంతమైన భూములు ఇప్పుడు రాళ్ల గుట్టలుగా.. ఇసుక మేట‌లుగా మారిపోయాయి. ఈ నష్టం ఎవరూ పూడ్చలేనిది, ఈ కష్టం ఎవరూ తీర్చలేనిది, ఈ ఊరిజనం వ్యథ అంతా ఇంతా కాదు.

కొండ రాళ్ల పాతం

కమ్మరితోట ఎగువ ప్రాంతంలోని రాజుల గొంది, దొమల గొంది గుట్టల నుంచి భారీగా కొండ చరియలు విరిగిపడ్డాయి. భారీ వర్షం ధాటికి గుట్టలపై ఉన్న పెద్ద పెద్ద రాళ్లు, రప్పలు అన్నీ సుమారు రెండు కిలోమీటర్ల మేర 20 నుంచి 50 మీటర్ల వెడల్పులో పొలాలను మింగేశాయి. ఈ విధ్వంసానికి సుమారు 150 నుంచి 200 ఎకరాల వరి పంట పొలాలు సర్వనాశనం అయిపోయాయి. ఈ పొలాలు ధ్వంసం కావటంతో రూ. 50. నుంచి 60 ల‌క్ష‌ల‌కు పైగా పంట నష్టం వాటిళ్లింది. ఇది ప్రభుత్వం దృష్టిలో అతి తక్కువ నష్టం. కానీ, రెండు కిలో మీటర్ల మేర కనుచూపు మేరకు ఎక్కడా పచ్చని పంట పొలాలు కనిపించటం లేదు. పెద్ద పెద్ద రాళ్లు, రప్పలతో పాటు భారీ వర్షం ధాటికి ఎగువ నుంచి రాళ్ల ప్ర‌వాహం కొన‌సాగింది. పొలాల్లో పెద్ద పెద్ద ఇసుక మేటలు ఏర్పడ్డాయి. కమ్మరితోట ఊరు పుట్టిన 80 ఏళ్ల‌ చరిత్రలో ఇదే పెద్ద విధ్వంసం అని గ్రామస్తులు తెలిపారు. ఈ ఊళ్లో ఇంత భయానక పకృతి బీభత్సం జరిగినా అధికారులు ఏమాత్రం పట్టించుకోలేద‌ని జనం వాపోతున్నారు. ఈ విలయ విధ్వంసం సమాచారం తెలుసుకున్న అధికారులు.. గ్రామంలోకి వెళ్ల‌కుండానే చుట్టం చూపులా ప్రధాన రహదారి వరకు వచ్చి తిరిగి వెళ్లిపోయినట్లు ఆ గ్రామస్తులు ఆరోపించారు.

గిరిజన రైతులకు తేరుకొలేని కష్టం

కమ్మరితోట గ్రామంలో భారీ విలయ విధ్వంసానికి గిరిజన రైతులకు తెరుకొలేని కష్టం వచ్చింది. ఈ భారీ వర్షం ధాటికి కొండలపై నుంచి వరద గ్రామానికి రెండు వైపులా ప్రవహించి, సాగు చేసిన పొలాలను ధ్వంసం చేయడంతో పాటు.. ఆ గ్రామంలోని ప్రజలకు తీరని నష్టాన్ని తెచ్చి పెట్టింది. ఈ భారీ వర్షం ధాటికి కిలో భగత్‌రామ్‌ పెంకిటిల్లు నేలమట్టం అవ్వగా, కిమ్ముడు శర్మ పశువుల పాక మొత్తం కొట్టుకుపోయింది. రెడ్డి నాగమ్మ ఇంటి గోడ పడిపోగా, కిలో శ్రీనివాస్‌ రావు కిరాణా షాపు ఈ వరదలో పూర్తిగా మునిగిపోయి సామగ్రితో పాటు ఫ్రిజ్‌ మొత్తం దెబ్బ‌తింది.

భూములకు బదులు భూములివ్వండి..

ఈ నెల 8వ తేదీ ఆర్ధరాత్రి భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ వరదతో మా పంట పొలాలు మొత్తం కొండచరియలు, రాళ్లు, రప్పలతో నిండి ఇసుక మేటలు వేశాయి. ఈ భూములు సాగుకు పనిరావు. బీడు భూములుగా మారాయి. ప్రభుత్వం స్పందించి యథావిధిగా సాగు చేసుకునేలా మా భూములను బాగుచేసి ఇవ్వాలి.. లేదా ధ్వంసమైన భూములకు బదులు భూములివ్వాలి. తండ్రిని కొల్పోయిన కుటుంబం ఎలా దిక్కులేకుండా ఉంటుందో, భూములు కొల్పోయి మేము దిక్కులేనివారిగా మారాం.
= కిలో రాందాస్‌, కమ్మరితోట

ఇంకా అప్పుతీరలేదు.. కొత్త కష్టం వచ్చింది

ప్రకృతి ప్రళయంలో నేను ₹5 లక్షల వరకు నష్టపోయాను. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. నా కిరాణా షాపు మొత్తం వరదలో మునిగింది. ఆ షాపులోని కిరాణా సరుకులు మొత్తం దెబ్బతిన్నాయి.. షాపులో ఏ ఒక్క వస్తువు పనికిరాకుండా పోయింది. బ్యాంకులో 1 లక్షా 5 వేలు రుణం తీసుకున్నా ఇంకా ఆ అప్పు తీరలేదు. కొత్త కష్టం వచ్చి పడింది. ప్రస్తుతం పూటగడవడం కష్టంగా ఉంది. = కిలో శ్రీనివాసరావు , కుమ్మరి తోట

జీవనభృతి కల్పించాలి

తుపాన్ బీభత్సానికి తీవ్రంగా నష్టపోయాం. ఒక్కొక్క ఎకరానికి సుమారు ₹ 30 వేల వరకు ఖర్చు చేశాం. వరదల వలన మొత్తం నష్టపోయాం. నా మూడు ఎకరాల వరి పంట ధ్వంసమైంది. మా బాధలను అర్ధం చేసుకొని నష్ట పరిహారం ఇవ్వాలి. జీవనభృతి కల్పించాలి. = కిలో స్వర్ణలత, కమ్మరితోట

మేము ఎలా బతకాలి

రాజులగొంది బోదే వరద దాటికి నా మూడు ఎకరాల వరి పంట.. పొలం పూర్తిగా దెబ్బతింది. పశువుల పాక కొట్టుకుపోయింది. పొలంలో మొత్తం రాళ్లు, రప్పలు పడ్డాయి, సాగు చేయడానికి వీలు లేకుండా ఉంది. ఈ పొలాలు లేకపోతే ఎలా బతకాలి. వ్యవసాయం మీదే ఆధారపడ్డాం. ప్రభుత్వం తక్షణమే సహాయం చేయాలి. = కొర్రా జయరాం, కమ్మరితోట

Advertisement

తాజా వార్తలు

Advertisement