Sunday, December 1, 2024

Exclusive – పారిస్ ఒలింపిక్స్‌ లో అరకు కాఫీ అదుర్స్​!


మన కాఫీ రుచికి జనం ఫిదా
అతిథులను అలరిస్తున్న‌ మన్యం పంట
మైమ‌రిపింప‌జేస్తున్న కాఫీ సువాస‌న‌లు
ఇప్ప‌టికే అనేక అంత‌ర్జాతీయ అవ‌ర్డులు
ప్రేమనగరిలో మరో అవుట్​లెట్​
ఏపీ కాఫీ రుచిపై ప్రధాని అభినందనలు
ప్రమోట్​ చేస్తున్న సీఎం చంద్రబాబు
సంప్రదాయ పద్ధతిలో పండించే పంట
గిరిజన కుటుంబాలకు ఉపాధిమార్గం
కాఫీ గింజల సేకరణలో జీసీసీ కీలకం
పోడు వ్య‌వ‌సాయం వ‌ద‌లి కాఫీ సాగులోకి
మ‌న కాఫీకి ఇంత టేస్ట్ రావ‌డానికి కార‌ణాలివే..

మన్యం పేరు చెప్పగానే అందరికీ రెండు విషయాలు స్పురణకు వస్తాయి. ఒకటి అరకు అందాలు, ఇరుకైన ప్రయాణ మార్గాలు. అక్కడికి వెళ్లిన వారెవరైనా ఆ ప్రకృతికి ఫిదా అవ్వాల్సిందే. ప్రతి మది పులకరించాల్సిందే. అక్కడి అందాలు కనువిందు చేస్తూ అందరినీ కట్టిపడేస్తాయి. ఇక.. మరొకటి కమ్మని అరకు కాఫీ. ఘుమఘుమలాడే ఈ కాఫీ సువాసనకు మనసు మైమరచిపోతుంది. ఇప్పటికే మన అరకు కాఫీకు అనేక అంతర్జాతీయ అవార్డులు ద‌క్కాయి.

ప్రేమనగరి పారిస్​లోనూ..

- Advertisement -

ప్రేమ నగరిగా పేరొందిన పారిస్‌లో ప్రతిష్ఠాత్మకమైన ఒలింపిక్స్ కొన‌సాగుతున్నాయి. ఈ సందర్భంగా పారిస్​కు వచ్చే క్రీడాకారులు, అతిథులు అరకు కాఫీని రుచి చూసి ఆనందిస్తున్నారు. పారిస్‌లో 2017లో అరకు కాఫీ ఔట్​లెట్​ను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్​ నేపథ్యంలో మరో ఔట్​లెట్​ను తెరిచిన‌ట్టు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర తెలిపారు. 2018లో పారిస్‌లో జరిగిన ప్రిక్స్‌ ఎపిక్యూరస్‌- 2018 పోటీల్లో అరకు కాఫీకి బంగారు పతకం లభించింది.

ప్రమోట్​ చేసిన సీఎం చంద్రబాబు..

మరోవైపు అరకు కాఫీని సీఎం చంద్రబాబు బాగా ప్రమోట్‌ చేశారు. ఇటీవల మన్యం కాఫీ రుచిని ప్రధాని మోదీ మన్‌ కీ బాత్‌లో ప్రస్తావించారు. గతంలో సీఎం చంద్రబాబుతో కలసి జీ-20 సదస్సులో ప్రధాని మోదీ అరకు కాఫీని రుచిచూశానని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్​పై స్పందించిన చంద్రబాబు వీలైతే మరోకప్పు మీతో కలసి కాఫీ తాగాలని ఉందంటూ రీట్వీట్ చేశారు.

ఏపీ కాఫీకి మంచి ఆదరణ..

దేశం మొత్తంగా 12 రాష్ట్రాలు కాఫీని ఉత్పత్తి చేస్తున్నాయి. అందులో ఏపీ ఒకటి. ఆంధ్రప్రదేశ్​లోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో లక్షన్నర ఎకరాల్లో కాఫీ తోటలు సాగవుతున్నాయి. అత్యంత నాణ్యమైన కాఫీ గింజలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. అందుకే అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. సేంద్రియ పద్ధతుల్లో పండించడంతో ఇక్కడి కాఫీ పంటకు డిమాండ్‌ చాలా ఎక్కువ. సముద్ర మట్టానికి 3,600 ఎత్తులో గిరిజన కుటుంబాలు సంప్రదాయ పద్ధతిలో పండిస్తారు.

కాఫీ గింజల సేకరణలో జీసీసీ..

ఈ కాఫీ గింజలను ప్రైవేట్ వ్యాపారులతో పాటు గిరిజన సహకార సంస్థ (జీసీసీ) సేకరిస్తోంది. అందులో కొంత మొత్తాన్ని ఈ వేలం ద్వారా అమ్మకాలు చేస్తోంది. మరికొన్నింటిని అరకువ్యాలీ కాఫీ పేరుతో మార్కెటింగ్‌ చేస్తోంది.

చెట్ల మధ్య తోటల పెంపకం..

విశాఖ ఏజెన్సీకి అసలు కాఫీ ఏలా వచ్చిందనే విషయాన్ని ప‌రిశీలిస్తే ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. 1898లో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పాములేరు లోయలో బ్రిటిష్ వారు కాఫీ పంట వేశారు. అక్కడ్నించి కొద్ది కాలానికి విశాఖ జిల్లా గిరిజన ప్రాంతాల్లోకి ఈ పంట విస్తరించింది. 1920 నాటికి కాఫీ అరకు లోయలోని అనంతగిరి, చింతపల్లి ప్రాంతాలకు చేరుకుంది. అయితే.. అది ఎక్కువగా సాగవలేదు. ఆ తర్వాత ఏపీ అటవీశాఖ 1960లో విశాఖ జిల్లాలోని రిజర్వ్‌ అటవీ ప్రాంతంలో కాఫీ పంటను 10 వేల ఎకరాలలో అభివృద్ధి చేసింది. ఈ కాఫీ తోటల్ని 1985లో అటవీ అభివృద్ధి సంస్ధకు అప్పగించింది. 1975 నుంచి 1985 వరకు జీసీసీలో ఒక ప్రత్యేక కాఫీ తోటల అభివృద్ధి విభాగం ఏర్పాటైంది. సుమారు 4000 హెక్టార్లలో సేంద్రీయ పద్ధతుల్లో కాఫీ తోటల పెంపకం గిరిజన ప్రాంతాల్లో మొదలయ్యింది. సేంద్రీయ పద్ధతుల్లో గిరిజనుల చేత అరకులోయలో పండుతున్న కాఫీకి ‘అరకు కాఫీ’ అనే పేరు స్థిరపడింది.

పోడు వ్యవసాయం వదిలి కాఫీ తోటల్లోకి…

గిరిజన కుటుంబాల్లో ఎక్కువమంది రైతులు కాఫీ పంట ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. తాము సంప్రదాయ పద్ధతుల్లో చేసే పోడు వ్యవసాయాన్ని విడిచిపెట్టి పెద్ద ఎత్తున కాఫీ తోటల పెంపకాన్ని ఆశ్రయించారు. వందేళ్ల కిందట నుంచే విశాఖ ఏజెన్సీలోని అరకు, అనంతగిరి, జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, ఆర్వీనగర్, మినుమలూరు, సుంకరమెట్ట తదితర ప్రాంతాల్లో కాఫీ తోటలను ఆంగ్లేయులు పెంచడం ప్రారంభించారు. అయితే స్వాతంత్య్రం అనంతరం ఏర్పాటైన గిరిజన కోపరేటివ్ కార్పోరేషన్ ఆధ్వర్యంలో 1960 నుంచి ఇక్కడ వాణిజ్యపరమైన కాఫీ తోటల పెంపకం మొదలైంది. మొదట్లో పది వేల ఎకరాల్లో ప్రారంభమైన కాఫీ తోటలు క్రమక్రమంగా.. ఇప్పుడు 1.5 లక్షల ఎకరాల వరకు విస్తరించాయి. ఇంతలా విస్తరించడానికి ఇక్కడి వాతావరణమే ప్రధాన కారణం.

అరకు కాఫీ రుచికి కారణం అదే…
సముద్ర మట్టానికి 3600 అడుగుల ఎత్తులో ఉండే విశాఖ ఏజెన్సీ కాఫీ తోటల పెంపకానికి అనువైన ప్రదేశం. ఇక్కడి చల్లని వాతావరణం కాఫీ తోటల సాగుకి ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఏజెన్సీలోని కాఫీ తోటలన్నీ… పొడవాటి మిరియాలు, సిల్వర్ ఓక్ చెట్ల మధ్యలో సాగవుతాయి. ఈ చెట్ల మధ్య ఉండే కాఫీ మొక్కలపై సూర్యకిరణాలు నేరుగా పడవు. అంతేకాదు ఇక్కడ పొగమంచు కూడా నేరుగా నేలను తాకదు. దీని వలన చల్లదనం మరింత పెరిగి కాఫీ సాగుకు అనుకూలంగా ఉంటుంది. సముద్రమట్టానికి వందల అడుగుల ఎత్తులో ఉండే నేలల్లో క్షారగుణం తక్కువగా ఉండటం కూడా కాఫీకి ప్రత్యేక రుచిని తీసుకొస్తుంద‌ని ఆంధ్ర విశ్వ‌విద్యాల‌య ప‌రిశోధ‌కులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement