Wednesday, April 24, 2024

వెల్దుర్తిలో గుప్త నిధుల తవ్వకాల కలకలం..

వెల్దుర్తి, (ప్రభన్యూస్‌): మండల కేంద్రమైన వెల్దుర్తిలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఎన్నో ఏళ్ళ నుండి ఉన్న ప్రాచీన కట్టడాలు తొలగించి గుప్తనిధుల తవ్వకాలు చేపట్టడంతో పట్టణ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వివెల్దుర్తి పట్టణ శివారు స్మశాన వాటిక పక్కన, వ్యవసాయ పొలాల్లో ఉన్న కాశన్న గోరిగా పిలువబడే చారిత్రక కట్టడం ఉంది. ఈ కట్టడం కాకతీయుల పాలనలో కట్టిన కట్టడంగా పట్టణ ప్రజలు చెప్పుకుంటారు. అలాంటి కట్టడాన్ని గుర్తు తెలియని వ్యక్తులు రెండు రోజుల క్రితం గుప్త నిధుల కోసం ప్రత్యేక పూజలు చేపట్టి పూర్తిగా తొలగించడంతో పాటు పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టడంతో పెద్దగా గొయ్యి ఏర్పడింది. కట్టడానికి ఉన్న పెద్ద పెద్ద రాతి కడ్డీలకు పూజలు చేసి కట్టిన తాళ్లు ఉండడం క్షుద్ర పూజలు లేదా గుప్త నిధుల కోసం చేసిన తవ్వకాలుగా ప్రజలు గుర్తించారు.

ఈ విషయం తెలుసుకున్న మాజీ జడ్పీటిసి ఆంజనేయులు, ఈవో బలరాంరెడ్డిలు ఘటన స్థలాన్ని పరిశీలించి తహశీల్దార్‌ సురేష్‌కుమార్‌, వెల్దుర్తి పోలీసులకు సమాచారం అందించారు. కట్టడం తొలగించడంపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement