Monday, April 15, 2024

Big Story | బాల్యం బలహీనం, చిన్నారుల్లో ఎదుగుదల లోపం

అమరావతి, ఆంధ్రప్రభ : చిన్నారుల్లో ఎదుగుదల లోపాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలుచేస్తున్నా, ఆశించిన ఫలితం మాత్రం కాన రావటం లేదు. రాష్ట్రంలో అంగన్‌వాడీల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నప్పటికీ బాల్యం ఇంకా బలహీనంగానే ఉంటోంది. చిన్నారులు వయసుకు తగ్గ ఎత్తు, బరువు ఉండని పరిస్దితి స్పష్టంగా కనిపిస్తోంది. రాష్ట్రంలో అంగన్‌ వాడీ కేంద్రాల ద్వారా చిన్నారుల ఎదురుగదలపై ప్రభుత్వం ప్రతీ నెల గ్రోత్‌ మానిటరింగ్‌ డ్రైవ్‌ను నిర్వహిస్తోంది. దీనిద్వారా ఎప్పటికప్పుడు నివేదికలను రూపొందించి చిన్నారుల్లోని లోపాలను గుర్తిస్తోంది. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 25 లక్షల మందికిపైగా చిన్నారులకు ప్రభుత్వం పౌష్టికాహారాన్ని అందిస్తూ భారీగా ఖర్చు చేస్తోంది.

ఒక్కొక్కరికీ రూ.30 చొప్పున రోజూ ఖర్చు చేస్తూ పాలు, గుడ్లుతో పాటు మధ్యాహ్న భోజన పథకాన్ని అందిస్తోంది. అంటే దాదాపు ప్రతి నెలా 25 రోజులకు రూ.750 ఒక్కొక్కరికి ఖర్చుచేస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఒక వైపు పౌష్టీకాలతో పాటు మరొకవైపు అవసరమైన మందులను ఎదుగుదల లోపాలు ఉన్న చిన్నారులకు అందిస్తున్నప్పటికీ ఫలితం కనిపించటం లేదు. రాష్ట్రంలోని 55,608 అంగన్‌వాడీ కేంద్రాలలో 25 లక్షల మంది చిన్నారులకు గ్రోత్‌ మానిటింగ్‌ డ్రైవ్‌ నిర్వహించగా వారిలో 2.35 లక్షల మందికిపైగా చిన్నారులు ఇంకా ఎదుగుదల లోపాలను ఎదుర్కొంటున్నట్టుగా నివేదికలు వెల్లడిస్తున్నాయి.

దీనికి ప్ర ధాన కారణం అంగన్‌వాడీ సిబ్బంది క్షేత్రస్దాయిలో మొక్కుబడిగా విధులు నిర్వహించడమే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాగే చిన్నారుల తల్లులు బాల్య వివాహాలు చేసుకోవటం, ఇంకొకవైపు జన్యు సమస్యలు కూడా ఎదుగుదల లోపాలకు కారణమని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈక్రమంలో రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ఇంకా ఎదుగుదల లోపాలున్న చిన్నారుల సంఖ్య అధికంగానే ఉన్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

అందని అదనపు గుడ్డు

- Advertisement -

పౌష్టికాహార లోపాలతో పాటు ఎదుగుదల సమస్యను ఎదుర్కొంటున్న చిన్నారులకు అదనపు పౌష్టికాలను అందించాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఈఆదేశాలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా పూర్తి స్దాయిలో అమలు కాని పరిస్దితి ఉంది. వయసుకు తగినట్టుగా ఎత్తు, బరువు లేని చిన్నారులకు ప్రస్తుతం ఇస్తున్న గుడ్డుకు అదనంగా మరో గుడ్డు అందించాలని ఆదేశించినా అది అంద టం లేదు. ఇక మధ్యాహ్న భోజనంలో పూర్తి స్దాయి పౌష్టికాలు లేకపోవడంతోపాటు పాలు కూడా సక్రమంగా అంద డం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పోష్టికాలతో అందించాల్సిన భోజనం ఉండటం లేదు.

ఇదే సమయంలో ఎదుగుదల లోపాలు ఉన్న చిన్నారులకు సమీప ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యం అందించాల్సి ఉన్నా అదీ జరగటం లేదు. పౌష్టికాహార లోపం ఎదుగుదల సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉన్నా వాటిని కూడా పూర్తిగా పక్కన పెట్టెశారు. దీంతో ప్రభుత్వం ఎంతో మంచి ఆశయంతో చేపట్టిన పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం ఆశించిన ఫలితాలను ఇవ్వటం లేదు. ఇప్పటికైనా ఎదుగుదల లోపాలు రక్తహీనత, ఇతర సమస్యలు ఉన్న చిన్నారులకు సక్రమంగా పౌష్టీకాహారం అందేలా పటిష్టమైన చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement