Sunday, December 8, 2024

Escapists – యూనియ‌న్ల ముసుగులో బ‌దిలీల‌కు మ‌స్కాలు…

అమరావతి, ఆంధ్రప్రభ: ఐదేళ్ళుగా వాళ్ళు ఒకే స్థానంలో పనిచేస్తున్నారు. క్యాడర్‌కు 30 శాతం చొప్పున ఐదేళ్ళు నిండిన ఉద్యోగుల్ని బదిలీ చేయాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో బదిలీల నుంచి తప్పించుకొనేం దుకు పలువురు ఉద్యోగులు యూనియన్‌ నాయకుల అవతారం ఎత్తి మస్కా కొడుతున్నా రనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యశాఖలో బది’లీలల’పై సాధారణ ఉద్యోగులు మండిపడు తున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూని యన్ల లో పనిచేసే ఐదు కేటగిరిలకు చెందిన ప్రెసిడెంట్‌, వైస్‌ ప్రెసిడెంట్‌, సెక్రటరీ, -టె-జరర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ లకు మాత్రం 9 సంవత్సరాల పాటు- బదిలీల నుండి ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. దీన్ని ఆసరాగా తీసుకొని ఐదేళ్ళు సర్వీస్‌ పూర్తయిన ఉద్యోగులు యూనియన్‌ నాయకులు గా సర్టిఫికెట్లు- తెచ్చుకొని బదిలీ నుండి మినహా యింపు పొందు తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అంటే ఐదు సంవత్సరాల సాధారణ సర్వీసు ప్లస్ తొమ్మిదేళ్ళు యూనియన్‌ వెరసి పద్నాలుగు ఏళ్ల పాటు బదిలీల నుండి మినహాయింపు పొందుతూ ఒకే ప్రాంతంలో తిష్ట వేసుకు కూర్చుంటున్నారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 25 సంవత్సరాలు పైబడి యూనియన్‌ పేరుతో కొనసాగుతున్న ఉద్యోగులు ఉన్నారు. యూనియన్‌ పేరుతో ఒకే స్థానంలో ఉండిపోవడంతో ఏళ్ల తరబడి తాము వెళ్లవలసిన స్థానానికి ఇబ్బందిగా మారుతోందని సాధారణ ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

లీడర్‌ రాజాలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనియన్‌ లో పనిచేసే వారికి బదిలీల నుండి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీనిని జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 9 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలకు కుదించడం జరిగింది. మరలా యూనియన్‌ నాయకుల అభ్యర్థన మేర ఆరు సంవత్సరాల నుండి 9 సంవత్సరాలకు బదిలీల నుండి మినహాయింపు ఇవ్వడం జరిగింది. కాసులు వచ్చే పలు హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్మెంట్లలో కొందరు యూనియన్‌ నాయకులు, పనులు లేని స్థానాలలో మరికొందరు యూనియన్‌ నాయకులు తమ సొంత వ్యాపారాల కొరకు కొనసాగుతున్నారని ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఏళ్ళ తరబడి పాతుకుపోయిన లీడర్‌ రాజాలపై ఫిర్యాదులు అందినప్పటికీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకొనే సాహసం చేయడం లేదంటే లీడర్‌ రాజాలు ఎంత పవర్‌ఫుల్లో అర్థం అవుతోంది. భార్యాభర్తలు, అనారోగ్య కారణాలతో ఉన్న కూడా మినహాయింపు ఇవ్వకుండా బదిలీలు చేస్తున్న ప్రభుత్వం ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనియన్‌ నాయకులను బదిలీలు చేయకపోవడంపై తమకు అన్యాయం జరుగుతోందని పలువురు సాధారణ ఉద్యోగులు వాపోతున్నారు. ఒక యూనియన్‌ నాయకుడిగా ఉన్న ఉద్యోగి మరో ప్రాంతానికి బదిలీ అయితే ఆ ప్రాంతంలో ఉద్యోగ నాయకుడిగా విధులు నిర్వహించవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఉద్యోగ నాయకులను ఒకే ప్రాంతంలో 9 సంవత్సరాలు అది కూడా పాత సర్వీసు కలిపి మొత్తం 14 ఏళ్ళు ఒకే చోటు కొనసాగించడంపై అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

భలే గిరాకీ
బదిలీల నేపథ్యంలో యూనియన్‌ నాయకుడి సర్టిఫికెట్‌కు మంచి గిరాకీ పెరిగింది. ఉద్యోగుల అవసరాలన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేలు ధర పలుకుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బదిలీల్లో తమ పేర్లు ఉండటంతో పలువురు ఉద్యోగులు యూనియన్‌ నాయకులను ఆశ్రయించి ఏదో ఒక పోస్ట్‌లో తమ పేరు పెట్టించుకొని ధృవీకరణ పత్రాలు తెచ్చుకుంటున్నారనే విమర్శలు బలంగా ఉన్నాయి. నిబంధనల ప్రకారంగుర్తింపు పొందిన యూనియన్‌ ప్యానల్‌ ఎన్నికను ఎన్నికల అధికారి ధృవీకరిస్తారు. ఏ కారణం చేతనైన పోస్టు ఖాళీ అయితే దానికి కో ఆప్ట్‌ చేసుకుంటారు. తాజా పరిణామాల నేపథ్యంలో యూనియన్‌ నాయకుల పోస్టులన్నింటికీ కో ఆప్ట్‌ లెటర్లే ఇస్తున్నట్లు సమాచారం. యూనియన్‌ సర్టిఫికెట్ల పేరుతో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయనే అభియోగాలు ఉన్నాయి. యూనియన్‌ లీడర్‌ అవతారం ఎత్తిన ఉద్యోగి ఎన్నాళ్ళ నుంచి ఆ యూనియన్‌లో పనిచేస్తున్నాడు. పదవి ఎప్పుడు వచ్చిందని ఆరా తీస్తే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉంది. వైద్యశాఖ బదిలీల్లో చోటు చేసుకుంటున్న అక్రమాలపై విజిలెన్స్‌ విచారణ నిర్వహిస్తే వాస్తవాలు నిగ్గుతేలుతాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

సి’ఫార్సు’లకు డిమాండ్‌
మ్యూచువల్‌, రిక్వెస్ట్‌ బదిలీలకు సంబంధించి ప్రజాప్రతినిధుల లేఖలకు డిమాండ్‌ పెరిగింది. సి’ఫార్స్‌’ లేఖల కోసం పలువురు ఉద్యోగులు ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. దీంతో ప్రజాప్రతినిధుల లేఖలకు మంచి డిమాండ్‌ పెరిగింది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరుగుతున్న బదిలీలు జాతర చందంగా మారాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement