Friday, April 19, 2024

Tirupati: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత: జేసీ

తిరుపతి సిటీ, జూన్5 : పర్యావరణ పరిరక్షణపై మనందరం మేల్కోవలసిన బాధ్యత ఉందని, రానున్న భావితరాలకు మంచి వాతావరణాన్ని అందించాలనే ఉద్దేశంతో పర్యావరణాన్ని కాపాడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. ఈరోజు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం -2023ను పురస్కరించుకొని జాయింట్ కలెక్టర్ అవగాహన ర్యాలీని ప్రారంభించి, సమావేశంలో ప్రసంగించి, ప్రతిజ్ఞ చేయించి, వ్యాసరచన పోటీల్లో ప్రతిభ క‌నబ‌రిచిన పలు పాఠశాలల విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందించారు. జూన్ 5 ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరిదని కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో ఎన్. సి. సి, పరిశ్రమలు, వైద్య ఆరోగ్యశాఖ, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్, అడిషనల్ ఎస్పీ కులశేఖర్ స్థానిక ఎస్ వి ఆర్ట్స్ కళాశాల నుండి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఈ ర్యాలీ బాలాజీ కాలనీ, టౌన్ క్లబ్ మీదుగా రామచంద్ర పుష్కరిణి చేరుకొని అక్కడ కళావేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఈసంద‌ర్భంగా జేసీ మాట్లాడుతూ… పర్యావరణంపై మనం ఇప్పుడు మేల్కోకపోతే రానున్న భావితరాలకు అన్యాయం చేసిన వారమ‌వుతామని, బాధ్యతగా చిన్న చిన్న పరిష్కారాలతో ప్లాస్టిక్ వాడకుండా క్లాత్ బ్యాగులు వాడడం, పొల్యూషన్ కలిగించే వాహనాలు వాడకుండా ప్రజా రవాణా వాహనాలు వాడడం, బ్యాటరీ వాహనాలపై మొగ్గు చూపడం వంటి వాటిపై దృష్టి పెట్టాలన్నారు. ఉదాహరణకు రెండు మూడు నెలల కోవిడ్ సమయంలో వాహనాలు తిరగకపోవడం వల్ల కాలుష్యం వల్ల కనపడని పెద్ద పెద్ద పర్వతాలు దూర ప్రాంత ప్రజలకు కనబడడం, సకాలంలో వర్షాలు కురిసి త్రాగునీటికి, సాగునీటికి ఇబ్బందులు కలగకుండా ఉండడం వంటివి మనం చూశామన్నారు. దశాబ్దాల తరబడి మనం వాతావరణాన్ని కాలుష్యం చేస్తే కేవలం రెండు మూడు నెలల్లో కోవిడ్ సమయంలో వాతావరణం మార్పులు జరిగి కాలుష్యం నియంత్రించ బడిందని మనం గుర్తించాలన్నారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ… పర్యావరణం అన్నది మన చుట్టుపక్కల మనతోపాటు ఉన్న గాలి, నీరు, భూమి వంటివి కాలుష్యం కాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్. సి. సి, వివిధ పరిశ్రమలు, వైద్య ఆరోగ్యశాఖ, కళాశాలల యువత పాల్గొనడం సంతోషంగా ఉందని, పర్యావరణ హిత కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరముంద‌న్నారు. సమావేశం అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందించి పర్యావరణాన్ని కాపాడుదాం అనే ప్రతిజ్ఞను చేపట్టారు. ఈ కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ఈఈ నరేంద్ర, ఎన్. సి. సి 29 ఆంధ్ర బెటాలియన్ కల్నల్ శివరాజ్, వీరభద్రం, రీజనల్ సైన్స్ సెంటర్ కోఆర్డినేటర్ శ్రీనివాస నెహ్రూ, ప్రొఫెసర్ దామోదరం, విశ్వం విద్యాసంస్థల డైరెక్టర్ విశ్వ చందన్ రెడ్డి, వాకర్స్ అసోసియేషన్ రామారావు, జిల్లా అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement