Saturday, April 20, 2024

మోగిన ఎన్నికల నగారా.. 15 రాష్ట్రాల్లో 57 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ :  ఈ ఏడాది జూన్, జులై, ఆగస్టు మాసాల్లో ఆరేళ్ల పదవీకాలం ముగుస్తున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 15 రాష్ట్రాల్లో 57 స్థానాలకు ఎన్నికల తేదీలను ప్రకటించింది. 57 స్థానాల్లో అత్యధికంగా ఉత్తర్‌ప్రదేశ్ నుంచి 11, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి చెరొక 6 స్థానాలు ఉండగా, బిహార్‌లో 5, రాజస్థాన్, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చెరో 4 స్థానాలున్నాయి. ఒడిశాలో 3 స్థానాలకు తెలంగాణ, చత్తీస్‌గఢ్, పంజాబ్, జార్ఖండ్, హరియాణా రాష్ట్రాల్లో చెరో రెండు, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు మే 24న నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు చివరి తేదీగా మే 31, నామినేషన్ల పరిశీలన జూన్ 1 తేదీలను ఖరారు చేసింది. నామినేషన్లు ఉపసంహరణకు చివరి తేదీగా జూన్ 3ను నిర్ణయించింది. ఇక మే 10న ఉదయం గం. 9.00 నుంచి సాయంత్రం గం. 4.00 వరకు పోలింగ్, అదే రోజు సాయంత్రం గం. 5.00 నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించనున్న కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. పదవీకాలం పూర్తవుతున్నవారిలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కపిల్ సిబల్, అంబికా సోని, జైరాం రమేశ్, పి. చిదంబరం ఉన్నారు. అలాగే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్ రాజ్యసభ సభ్యత్వాల పదవీకాలం కూడా ముగియనుంది.

ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరా నలుగురు?

అసెంబ్లీలో సంఖ్యాబలాన్ని అనుసరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అవుతున్న 4 స్థానాలూ ఈసారి వైఎస్సార్సీపీకే దక్కనున్నాయి. పదవీకాలం పూర్తిచేసుకుంటున్నవారిలో వైస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డి ఉన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత కీలకస్థానంలో ఉన్న ఆయన మరో దఫా రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మిగతా 3 స్థానాలు గతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు గెలుపొందినవే. అప్పట్లో ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ, ఒక స్థానాన్ని మిత్రపక్షం బీజేపీకి (సురేశ్ ప్రభు) ఇవ్వగా, మిగతా రెండు స్థానాల్లో నాటి కేంద్ర మంత్రి వై.ఎస్ చౌదరి (సుజనా చౌదరి), టీజీ వెంకటేశ్ ఉన్నారు. 2019లో వైఎస్ చౌదరి, టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఈ మూడు స్థానాలు ఈసారి వైఎస్సార్సీపీయే దక్కించుకోనున్న నేపథ్యంలో వారి స్థానాల్లో ఎవరికి పంపిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో రిలయన్స్ గ్రూపు అధినేత ముకేశ్ అంబానీ సిఫార్సు మేరకు ఆ సంస్థకు చెందిన పరిమళ్ నత్వానీని వైఎస్సార్సీపీ తరఫున రాజ్యసభకు పంపిన విషయం తెలిసిందే. ఈసారి అదానీ గ్రూపు అధినేత గౌతమ్ అదానీని లేదా ఆయన సూచించిన వ్యక్తిని రాజ్యసభకు పంపే అవకాశముందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మదిలో ఏముందన్నది ఉత్కంఠగా మారింది.

రాజ్యసభకు కవిత?

తెలంగాణ నుంచి పదవీకాలం పూర్తిచేసుకుంటున్న రాజ్యసభ సభ్యుల్లో టీఆర్ఎస్ ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంత రావు, ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) ఉన్నారు. వీరిలో డీఎస్ టీఆర్ఎస్‌తో విబేధించి పార్టీకి దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సంఖ్యాబలాన్ని బట్టి చూస్తే రెండింటికి రెండూ టీఆర్ఎస్ దక్కించుకోనుంది. కెప్టెన్ లక్ష్మీకాంత రావుకు మరోసారి అవకాశం కల్పిస్తారా లేక వయస్సు, అనారోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆయనకు విశ్రాంతి ఇస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఇక డీఎస్ స్థానంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పంపించవచ్చని తెలుస్తోంది. జాతీయస్థాయిలో టీఆర్ఎస్ కార్యాకలాపాలను పెంచి, బీజేపీని ఢీకొట్టేందుకు సమాయత్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జాతీయస్థాయి కార్యాకలాపాల బాధ్యతలను కేసీఆర్ కవితకు అప్పగించారు. ఇప్పుడు రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా ఇస్తే ఇటు సభలో, అటు సభ వెలుపల అధికార బీజేపీ వైఫల్యాలపై బలమైన స్వరాన్ని వినిపించే అవకాశం ఉంటుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement