Thursday, April 25, 2024

మోగిన ఎన్నికల నగారా.. YCP-TDP పట్టభద్ర అభ్యర్థులు రెడీ 

తిరుపతి, (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపు ఆరునెలల క్రితం మొదలైన శాసన మండలి ఎన్నికల సందడి ఎన్నిక సంఘం షెడ్యూల్ ని గురువారం ప్రకటించడంతో ఊపందుకుంది. ఇప్పటికే పట్టభద్రుల స్థానానికి పోటీ చేసే తమ అభ్యర్థులను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలు ఖరారు చేయగా ఇతర పోటీ దారులెవరో తేలాల్సి ఉంది. ఇక టీచర్ల స్థానానికి జరిగే పోటీకి వామపక్షాల మద్దతు ఉన్న ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ (పీ డీ ఎఫ్) అభ్యర్థిత్వం ఖరారు కాగా ప్రత్యర్థులెవతో తెలియాల్సి ఉంది. మరో వైపు తుది ఓటర్ల జాబితా విషయంలో కసరత్తు చేస్తూనే ఉన్న అధికార యంత్రాంగం పోలింగ్ సంబంధిత ఇతర ఏర్పాట్లపై దృష్టిని సారిస్తోంది. ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పరిధికి చెందిన పట్టభద్రుల స్థానానికి చెందిన శాసన మండలి సభ్యత్వానికి, ప్రకాశం – నెల్లూరు- చిత్తూరు టీచర్ల స్థానానికి చెందిన శాసన మండలి సభ్యత్వానికి 2017లో జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల పదవీకాలం వచ్చే నెలాఖరులోగా ముగియనుంది. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ నెలలోనే రాజకీయ పక్షాలలో సంబంధిత ఎన్నికల సందడి మొదలైంది. వ్యూహ ప్రతి వ్యూహాలకు ప్రధాన పార్టీలు సిద్దమైపోయాయి. ఒక వైపు తమదైన శైలిలో ఓటర్లను చేర్పించే పనిలో తలమునకలైపోయాయి. ఆ క్రమంలోనే ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు పరిధికి చెందిన పట్టభద్రుల స్థానానికి చెందిన శాసన మండలి సభ్యత్వానికి తమ పార్టీల తరపున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ , ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రకటించాయి .. ఆ మేరకు కొనసాగిన పోటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం పేర్నాటి శ్యాం ప్రసాద్ రెడ్డిని వరించగా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిత్వం కె.శ్రీకాంత్ కి దక్కింది.

మరో వైపు ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు టీచర్ల స్థానానికి చెందిన శాసన మండలి సభ్యత్వానికి వామపక్ష టీచర్ల సంఘాల మద్దతుతో ఎం.వెంకటేశ్వర రెడ్డి పీడీఎఫ్ అభ్యర్తి అయ్యారు. ఇతర అభ్యర్థిత్వాలు ఖరారు కావాల్సి ఉంది. ఇది ఇలావుండగా గతంలో ఓటు వేసినా వేయక పోయినా ఈ సారి ఎన్నికలకు ఓటర్లు కొత్తగా నమోదు చేసుకోక తప్పదని ఎన్నికల సంఘం ప్రకటించడంతో ఆయా పక్షాలు తమ తమ శక్తి యుక్తుల మేరకు ఓటర్లను చేర్పించే మహా యజ్ఞాన్ని నాలుగైదు నెలల క్రిందటే మొదలు పెట్టాయి. ఆ విషయంలో ఆరోపణలు ప్రత్యారోపణలు ఊపందుకోవడంతో ఇంకా సంబంధిత అధికారిక కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ను ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. ఆ మేరకు ఈనెల 16 వ తేదీన నోటిఫికేషన్ జారీ కానున్నది. 23వ తేదీ మొదలయ్యే నామినేషన్ల ప్రక్రియ 27వ తేదీతో ముగుస్తుంది. మార్చి 13వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. నోటిఫికేషన్ ప్రకటన సందర్భంగా ఎన్నికల సంఘం ప్రధాన అధికారి ఎం కె మీనా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికలు జరిగే జిల్లా కలెక్టర్ లు ఇప్పటి వరకు ఉన్న ఓటర్ల సంఖ్యలను వెల్లడించారు. తమ జిల్లాలలో ఉన్న పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల సిబ్బంది ఏర్పాట్ల గురించి వివరించి తమ సన్నద్ధతను తెలియజేశారు. మొత్తం మీద ఇప్పటికే ఖరారైన అభ్యర్థుల విజయం కోసం చేసే సన్నాహాలు, ప్రచారంలో తలమునకలువుంటున్నరాజకీయ పక్షాలలో కొనసాగే సందడి గురువారం వెలువడిన నోటిఫికేషన్ తో మరింత ఊపందుకోనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement