Thursday, April 25, 2024

కేంద్ర విధానాలతో ప్రమాదంలో విద్యారంగం.. ఎన్‌ఈపీ, సీపీఎస్‌ రద్దు కోసం జాతీయ స్థాయి ఉద్యమం

అమరావతి, ఆంధ్రప్రభ: ఉమ్మడి జాబితాలోని విద్యను పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంటున్న కేంద్ర బీజేపీ ప్రభుత్వ నిర్ణయాలను పోరాడి తిప్పి కొట్టకపోతే ప్రజాస్వామ్యానికే ప్రమాదమని విజయవాడలో నిర్వహించిన ఎస్టీఎఫ్‌ఐ జాతీయ సభల్లో రెండో రోజు సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐద్వా ప్రధాన కార్యదర్శి మారియం దాన్లే వ్యాఖ్యానించారు. కోవిడ్‌ మహమ్మారి ప్రత్యక్షంగా, పరోక్షంగా విద్యపై ప్రభావం చూపిందని, అనేక పేద విద్యార్థులకు ఆ్లనన్‌ తరగతులు చేరలేదని, ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నూతన జాతీయ విద్యావిధానాన్ని తీసుకురావడం జరిగిందని, ఇది పూర్తిగా విద్యా ప్రైవేటీ-కరణకి అనుకూలంగా ఉందని అభిప్రాయపడ్డారు. కరికులం ఫ్రేమ్‌ వర్క్‌ మాత్రమే నిర్దేశించాల్సిన కేంద్రం.. సిలబసును కూడా నిర్ధారించి, పాలకులు తమ లక్ష్యాలకు అనుకూలంగా పాఠ్యాంశాలను రూపొందిస్తున్నారని, సామాజిక స్పృహ కలిగిన ఉపాధ్యాయులు ఈ పాఠ్యాంశాలు ఏ విధంగా బోధించగలరు అని ప్రశ్నించారు.

విద్యావ్యవస్థను తిరోగమనంలో నడిపిస్తున్నారని, డిజిటలైజేషన్‌ ఆ్లనన్‌ క్లాసెస్‌ పేరుతో విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య దూరం పెరుగుతోందని, దీంతో విద్యార్థులు ప్రశ్నించేతత్వం కోల్పోయి మానసికంగా, శారీరకంగా బలహీనులవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాతంత్ర హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలు: ఎస్టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి సీఎన్‌ భారతి
ఉద్యోగ, ఉపాధ్యాయులతోపాటు- ప్రజల ప్రజాతంత్ర హక్కులను, ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలను హరించి వేస్తున్నాయని ఎస్టీఎఫ్‌ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీఎన్‌ భారతి విమర్శించారు. కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలని, ఖాళీలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని అన్నారు. .

Advertisement

తాజా వార్తలు

Advertisement