Friday, April 19, 2024

కాకినాడ ప్ర‌భుత్వాసుప‌త్రిలో తల్లి పాల నిధి యూనిట్

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో తొలిసారిగా ధాత్రి ‘కాంప్రెహెన్సివ్‌ ల్యాక్టేషన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్‌ (సీఎల్‌ఎంసీ) పేరిట తల్లి పాల నిధి (తల్లి పాల ని) యూనిట్‌ను కాకినాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఏర్పాటు- చేశారు. ఈయూనిట్‌లో తల్లుల పాలను నిల్వ చేసేందుకు ధాత్రి, సుషేనా హెల్త్‌ ఫౌండేషన్‌ మరియు ఎన్‌సిసితో జిజిహెచ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనిట్‌ ఏర్పాటకు రూ.50 లక్షలమేర ఖర్చయినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ ఆరోగ్యవంతమైన తల్లిపాలను నిల్వచేసి పుట్టిన బిడ్డలకు తల్లిపాలు లేకపోతే ఆచిన్నారులకు అందజేయనున్నారు.

ఈ వినూత్న ఆలోచన రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో ఏర్పాటుచేస్తే బాగుంటుందనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ విధంగా జీజీహెచ్‌లలో ఏర్పాటు చేసిన సీఎల్‌ఎంసీ యూనిట్‌లో మొదటి ఆరు నెలల పాటు- ప్రయోగాత్మకంగా శిశువులకు తల్లుల పాలు అందించనున్నారు. మిగిలిన పాలను యూనిట్‌లో నిల్వచేసేస్తున్నారు. అత్యవసర చికిత్స పొందుతున్న శిశువులకు వారి తల్లి పాలకు బదులుగా కృత్రిమ పాలు ఇస్తున్నారు. ఇప్పుడు, అటు-వంటి శిశువులు తల్లుల పాలు తీసుకునేలా ఏర్పాట్లు పూర్తి చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో యూనిట్‌ను ఏర్పాటు- చేశారు. ఆరోగ్యవంతమైన తల్లుల నుండి పాలను సేకరించి యూనిట్‌లో నిల్వ చేసి ప్రయోగశాలలలో పరీక్షల తర్వాత శిశువులకు ఇచ్చేలా చూస్తున్నారు. ఈ పాలు ఆరు నెలల నుంచి ఏడాది వరకు నిల్వ ఉండనున్నాయి. తల్లులకు తగినంత పాలు లేని శిశువులకు కూడా ఇది ఎంతగానో ఉపయోగపడనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement