Friday, June 9, 2023

న‌’యానం’ యువ‌త‌…

గెలుపోటముల్లో కీలక పాత్ర
గతంలో యానాంలోనే పనులు
ప్రస్తుతం ఉపాధి కరవు
మూతపడిన పలు పరిశ్రమలు
ఇతర ప్రాంతాలకు తప్పని వలస
యువతలో మొదలైన పునరాలోచన
ఎన్డీయే అభ్యర్థి, మాజీ సీఎం రంగసామి పోటీతో ఆసక్తికరం

పుదుచ్చేరి నుంచి ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి – కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి రాష్ట్ర అంతర్భాగమైన యానాం అసెంబ్లీ నియోజకవర్గం భౌగోళికంగా ఆంధ్రప్రదేశ్‌ లోని తూర్పుగోదావరి జిల్లానానుకునుంటుంది. ఈ రాష్ట్ర ముఖ్యపట్టణం పుదుచ్చేరి నుంచి యానాం అసెంబ్లీ నియోకవర్గ కేంద్రం సుమారు 730 కిలోమీటర్ల దూరముంటుంది. పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో యానాం ఒకటి. ఇక్కడి ఓటర్ల సంఖ్య 37,747. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఎన్‌డీఎ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పరిగణిస్తు న్న ఆలిండియా ఎన్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు, మాజీ సీఎం రంగసామి యానాం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన్ను గెలిపించే బాధ్యతను మాజీమంత్రి మల్లాడి కృష్ణా రావు భుజానేసుకున్నారు. 1996నుంచి మల్లాడి కృష్ణారావు యానాం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1996, 2001, 2006, 2011, 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా మల్లాడి ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తొలి రెండు దఫాలు స్వతంత్ర అభ్యర్థిగా బరిలోదిగిన ఆయన తర్వాత మూడుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీర్ఘకాలం మంత్రిగా ఉన్నారు. ఆ రాష్ట్ర రాజకీయాల్ని పరోక్షంగా శాసించా రు. సాక్షాత్తు ముఖ్యమంత్రి అభ్యర్థి బరిలో దిగడం, ఆయన గెలుపు బాధ్యతను మల్లాడి భుజానేసుకోవడంతో ఇప్పుడు యానాం నియోజకవర్గం పుదుచ్చేరి ఎన్నికల్లో కీలకంగా మారింది. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైంది.
వాస్తవానికి పక్కనున్న తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ, రాజమండ్రి వంటి నగరపాలక సంస్థల్లో పెద్ద డివిజన్‌లతో సరిసమానమైన విస్తీర్ణం, జనాభా మాత్రమే యానాంకు సొంతం. అయితే కేంద్రపాలిత ప్రాంతం కావడంతో రాష్ట్ర ఆదాయానికే పరిమితం కాకుండా కేంద్రం నుంచి ఇక్కడికి నేరుగా నిధులొస్తాయి. దీంతో ఇక్కడ పెద్దెత్తున సంక్షేమం అమలౌతోంది. ఇక్కడి ఎమ్మెల్యేకు ఇతర అసెంబ్లీ నియోజకవర్గాల ఎమ్మెల్యేల్తో సరిసమానమైన హక్కులే ఉంటాయి. కానీ పరిధి తక్కువ. అయినా నిధులపై పెత్తనమెక్కువ. ఈ కారణంగా యానాం ఎన్నికలెప్పుడూ అత్యంత వ్యయభరితంగా రూపుదిద్దుకుంటున్నాయి.
ఇప్పటికే యానాంలో ప్రచారం జోరందుకుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిని మరో స్వతంత్ర అభ్యర్థి బలంగా ఢీ కొంటున్నాడు. వీరిద్దరూ కాక మరో 13మంది బరిలో ఉన్నారు. అయితే వారిచ్చే పోటీ నామమాత్రమే. ప్రధానంగా రంగసామి, స్వతంత్ర అభ్యర్థి గొల్లపల్లి శ్రీనివాస అశోక్‌ల మధ్యే సాగుతోంది. ఇక్కడ నామినేషన్‌ వేయడం వరకే రంగసామి పరిమితమయ్యారు. ప్రచార బాధ్యత మొత్తం కృష్ణారావే చూస్తున్నారు. కాగా ఈసారి ఇక్కడ ఓటు ధర అధికంగా పలుకుతుందన్న ప్రచారం సాగుతోంది. మొత్తం ఓటర్లు 37వేలు కాగా గరిష్ఠంగా 80శాతం పోలౌతాయి. ఇందులో 15వేల ఓట్లు సాధిస్తే విజయం తమదేనన్న ధీమా ఓ వర్గంలో ఉంది. 15వేల ఓట్లు కొనుగోలు వీరికి పెద్ద కష్టం కాదు. ఈ మాత్రం ఓట్లు ఏదో రూపంలో కైవసం చేసుకుంటే ఐదేళ్ళ పాటు వేలకోట్ల విలువైన నిధులపై పెత్తనం చేయెచ్చు. దీంతో ఇప్పటికే వివిధ మార్గాల్లో యానాంకు భారీగా నగదు నిల్వలు చేరాయన్న వార్తలు గుప్పుమంటున్నాయి. తాజాగా విశాఖ నుంచి పెద్దమొత్తంలో తరలిస్తున్న బంగారం, నగదును జాతీయ రహదారిపై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా కూడా యానాం ఎన్నికల కోసం తరలిస్తున్నదేనన్న అనుమానాలున్నాయి. ఈ సారి యానాం ఓటర్లు నగదు కంటే కూడా తమకు బంగారం ఇమ్మని డిమాండ్‌ చేస్తున్న పరిస్థితులున్నాయి. బంగారం వ్యాపారంలో అనుభవమున్న వ్యక్తులు ఈ సారి ఎన్నికల్లోకీలక పాత్ర పోషిస్తున్నారు. వెనుకుండి ఆర్థిక వ్యవహారాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈ సందేహాలు మరింత బలపడుతున్నాయి.
గతంలో యానాం అతిపెద్ద పారిశ్రామికవాడగా ఉండేది. కేంద్ర పాలిత ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలో పారిశ్రా మికీకరణకు పెద్దెత్తున ప్రభుత్వాలు ప్రోత్సాహకాల్నందించేవి. యూనిట్‌ 40పైసలకే విద్యుత్‌ను సరఫరా చేసేవి. 19ఏళ్ళ పాటు అమ్మకపు పన్ను రాయితినిచ్చేవి. పెట్టుబడిలో ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఆర్థిక సహకారమందించేది. రాయితీ ధరపై స్థలాలు కేటాయించేది. ఆదాయపన్నుపై కూడా 20ఏళ్ళ పాటు మినహాయింపులిచ్చేది. దీంతో ఓ దశలో పలు పరిశ్రమలు ఇక్కడ ఏర్పడ్డాయి. అయితే రాన్రాను రాజకీయ పెత్తనం పెరిగింది. స్థానిక రాజకీయ వేత్తలు, పాలకుల ఒత్తిళ్ళు, డిమాండ్లకు పారిశ్రామికవేత్తలు తట్టుకోలేకపోయారు. దీంతో అంచెలంచెలుగా ఇక్కడి పరిశ్రమలు మూతబడ్డాయి. కానీ యానాంలో పెద్దసంఖ్యలో రైస్‌మిల్లులు ఉన్నాయి.
వాస్తవానికి యానాం పరిధిలో సాగుభూములు పెద్దగా లేవు. కానీ ఏటా వేల టన్నుల రైస్‌మిల్లింగ్‌ ఇక్కడ జరుగుతోంది. అలాగే కాకినాడ పోర్టు ద్వారా విదేశాల్నుంచి దిగుమతి చేసుకున్న పామాయిల్‌ రీఫిల్లింగ్‌ కేంద్రాన్ని యానాంలో నిర్వహిస్తున్నారు. వీటన్నింటికి కారణం ఇక్కడ భారీగా ప్రభుత్వ రాయితీలుండడమే. కేవలం రాజకీయ అండదండలు, కలిగిన వ్యక్తులు మాత్రమే ఇక్కడ వ్యాపారాలు నిర్వహించగలుగుతున్నారు. రైస్‌మిల్లుల్లో అత్యధికంగా వైశ్య సామాజిక వర్గీయులకు చెందినవే. గతంలో ఆ కులానికి చెందిన ఓ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రికి ఆర్థిక అనుచరుడిగా పేరొందిన వ్యక్తి వీరి తరపున యానాంలో చక్రం తిప్పుతున్నారు. వీరికి, పాలకులకు మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు యానాంలో చర్చకు దారితీస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement