Thursday, April 18, 2024

గంట‌కో రేటు – ఎపిఎస్ఆర్టీసీ రూటు స‌ప‌రేటు..

అమరావతి, ఆంధ్రప్రభ: రోజుకు..గంట గంటకు విమానా ల రేట్లు పెరగడం సహజం. రద్దీని బట్టి టిక్కెట్టు రేట్ల పెంచు కోవడం.. తగ్గించుకోవటం వంటి వెసులుబాటు విమాన యాన సంస్థలకు ఉంది. ఇదే తరహాలో ఆర్టీసీ కూడా ‘ఫ్లెక్సీ ఫేర్స్‌’ పేరిట ఏసీ బస్సుల్లో అమలు చేస్తోంది. బయటకు చెప్పకపోయినా ఒకే గమ్యస్థానానికి గంటకో రేటు వసూలు చేయడమే ఇందుకు నిదర్శనం. విజయవాడ నుంచి విశాఖపట్టణం వెళ్లే అమరావతి ఎక్స్‌ప్రెస్‌లో శుక్రవారం రాత్రి 10గంటల బస్సులో రూ.900 చార్జీ వసూలు చేస్తే..11 గంటల బస్సులో రూ.1090 వసూలు చేశారు. రోజులో గంట గంటకు వ్యత్యాసంతో బస్సు ఛార్జీలు వసూలు చేస్తూ ఆర్టీసీ ప్రయాణికులను గందరగోళానికి గురి చేస్తోంది. గమ్యస్థానం, కిలోమీటర్లలో వ్యత్యాసం లేనప్పటికీ గంట వ్యవధిలోనే రూ.190 పెరగడమేంటనేది ప్రయాణికుల్లో నెలకొన్న సందేహం. సూపర్‌ లగ్జరీ బస్సుల్లోనూ ఇదే తరహా సమస్య ఉన్నప్పటికీ ఏసీ బస్సుల్లో మరీ ఎక్కువగా ఉన్నట్లు చెపుతున్నారు. అదికూడా ప్రయాణికుల ఆదరణ చూరగొన్న అమరావతి సర్వీసుల్లో ఇంకెక్కువగా ఉంది.

విమర్శలొచ్చినా స్పందన నిల్‌..
రాష్ట్రంలో డిపోల వారీగా వేర్వేరు టిక్కెట్టు రేట్లు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. ఒకే ప్రాంతం మధ్య తిరిగే బస్సుల్లో చార్జీల వ్యత్యాసం ఉంటోంది. సూపర్‌ లగ్జరీ, ఏసీ బస్సుల్లో ఈ తరహా వ్యత్యాసాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో విజయవాడ డిపో నుంచి కాకినాడ, రాజమండ్రి వెళ్లే సూపర్‌ లగ్జరీ బస్సుల్లో అధిక చార్జీ వసూలు చేశారు. ఇదే అటువైపు నుంచి విజయవాడకు వచ్చే ఆయా డిపోల బస్సుల్లో చార్జీలు తక్కువగా ఉన్నాయి. ప్రయాణికులు రెండు వేర్వేరు బస్సులు ఎక్కినప్పుడు ఛార్జీల వ్యత్యాసంపై ఆరా తీస్తే తగిన సమాధానం ఉండటం లేదు. అదే దూరం, అదే సంస్థ అయినప్పుడు ఎందుకీ వ్యత్యాసం అనేది ప్రయాణికుల్లో నెలకొన్న సందేహం. అమరావతి ఏసీ సర్వీసులో తిరుపతి వెళ్లాలంటే విజయవాడ డిపో బస్సుల్లో చార్జీ, తిరుపతి మంగళం డిపో బస్సుల్లో చార్జీ రూ.200 వరకు వ్యత్యాసం ఉంటోంది. కొన్ని సర్వీసులకు బేసిక్‌ ఫేర్‌ వ్యత్యాసాలు కూడా ఉంటున్నాయి. ఒకే రోజు ఒకే డిపో నుంచి ఒకే ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులు గంట వ్యవధిలోనే అధికంగా ఛార్జీ చెల్లించాల్సి వస్తోంది. మధ్యాహ్నం 1గంటకు వెళ్లే బస్సులో చార్జీ రూ.900 వసూలు చేస్తే..తిరిగి మూడు గంటలకు వెళ్లే బస్సులో రూ.1090 వసూలు చేస్తున్నారు. రెండు గంటల తర్వాత తమ తాలూకు వ్యక్తులు వెళ్లినప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా ఎందుకు వసూలు చేస్తున్నారంటూ ఉద్యోగులపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. వీరికి సమాధానం చెప్పలేక కరెంట్‌ బుకింగ్‌ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగని అధికారులు వీరు చెప్పినా పట్టించుకునే పరిస్థితి ఉండదు.

రద్దీకి అనుగుణంగా..
ప్రయాణికులు తగ్గకుండా చూసే క్రమంలో భాగంగా రద్దీని బట్టి చార్జీలు నిర్ణయించుకోవాలంటూ గతంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆదేశాలు చారీ చేశారు. పీక్‌, నాన్‌ పీక్‌ రోజుల్లో డిపో మేనేజర్లు పరిస్థితులకు అనుగుణంగా టిక్కెట్‌ చార్జీలు నిర్ణయించుకోవచ్చు. నాన్‌ పీక్‌ రోజుల్లో 20శాతం వరకు తగ్గించే అవకాశం డిపో మేనేజర్లకు కలిపించారు. ప్రయాణికులను ప్రత్యమ్నాయాల వైపు వెళ్లకుండా చూసే క్రమంలో అధికారులు జారీ చేసిన ఆదేశాలు ఇప్పుడు డిపో మేనేజర్లు ఇష్టం వచ్చిన రీతిలో వాడుతున్నారనే విమర్శలు వినబడుతున్నాయి. డిపో ఓఆర్‌(ఆక్యుపెన్సీ రేషియో) తగ్గకుండా చూడాలనే ఉద్దేశంతో ఇతర డిపోల రేట్లతో నిమిత్తం లేకుండా ఇష్టారీతిన నిర్ణయిస్తున్నారు. దీంతో ఒకే ప్రాంతానికి వెళ్లే బస్సుల్లో వేర్వేరు చార్జీలు ఉంటున్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల దృష్టిలో ఆర్టీసీ ఒకటే తప్ప డిపోలతో వారికి ఏ విధమైన సంబంధం ఉండదు. కొందరు ఆర్టీసీ ఉద్యోగులు ఎక్కువ వసూలు చేస్తే, మరికొందరు తక్కువ తీసుకుంటున్నారని మాత్రమే ప్రయాణికులు భావిస్తుంటారు. సునిశితమైన ఇలాంటి అంశాల్లో ఉన్నతాధికారులు ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే ఆర్టీసీ అంటే దోపిడీ చేస్తుందనే భావన ప్రయాణికుల్లో నెలకొనే ప్రమాదం ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement