Wednesday, April 24, 2024

ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో దసరా సెలవులు.. ఎప్ప‌టి నుంచి అంటే..

తెలంగాణలో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి అక్టోబ‌ర్ 8వ తేదీ దాకా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ పంపించింది. వచ్చే నెల 5న దసరా పండుగ ఉంది. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగుతాయి. పాఠశాలలు తిరిగి అక్టోబరు 10న ప్రారంభమవుతాయి.

ఈ విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు ఉంటాయని విద్యాశాఖ‌ తెలిపింది. ఏప్రిల్‌ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజుగా పేర్కొంది. ఏప్రిల్ 25 నుండి జూన్ 11, 2023 వరకు వేసవి సెలవులు ఉంటాయి. సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 22 నుండి 28 వరకు మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ఉండగా.. నాన్ మిషనరీ పాఠశాలలకు జనవరి 13 నుండి 17, 2023 వరకు సంక్రాంతి సెలవులను షెడ్యూల్ చేశారు.

ఏపీలోనూ దసరా సెలవులు..

ఏపీలోనూ దసరా సెలవులు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ప్రకటించారు. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ సెలవులు ఇస్తారు. క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలల్లో దసరా సెలవులు అక్టోబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16వరకు ఉంటాయి. ఏటా జూన్‌లో మొదలయ్యే విద్యా సంవత్సరం ఈ ఏడాది రెండు వారాలు ఆలస్యంగా జులైకు మారింది. ఇతర కారణాల వల్ల దాదాపు 20రోజులు వెనక్కి వెళ్లింది. 2022-23 విద్యా సంవత్సరంలో 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న ముగుస్తాయి. ప్రతి వారం సగటున 48 పీరియడ్లు ఉండేలా ప్రణాళిక విడుదల చేశారు. హైస్కూళ్లలో సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 38-39 పీరియడ్లలో బోధించాల్సి ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement