Friday, December 6, 2024

Exclusive | ప్రాణాలు పోతేగానీ పట్టించుకోరా..?

  • అంతరాష్ట్ర రహదారిలో పెద్ద గొయ్యి
  • ప్రమాదాలకు నిలయంగా మారిన దుస్థితి
  • దుమ్ము లేస్తూ ఇళ్లల్లోకి పోతున్న వైనం


చింతూరు, ఏఎస్ఆర్ జిల్లా, (ఆంధ్రప్రభ) : చింతూరు అనగానే గుర్తుకు వచ్చేది నాలుగు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమని, అలాంటి నాలుగు రాష్ట్రాల నుండి నిత్యం వందల సంఖ్యలో వాహనాలు, వేల సంఖ్యలో ప్రయాణికులు, పర్యాటకులు ప్రయాణిస్తూ ఉంటారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేసే రహదారులు అత్యంత అధ్వాన్నంగా తయారయ్యాయి. చింతూరు మండల కేంద్రంలోని ఎర్రంపేట గ్రామంలో ఆంధ్రా నుండి ఒడిస్సా రాష్ట్రానికి వెళ్లే జాతీయ రహదారి 326కి అనుసంధానంగా ఉన్న అంతరాష్ట్ర రహదారిపై పెద్ద గొయ్యి పడింది.

ప్రస్తుతం ఈ గొయ్యి ప్రమాదాలకు నిలయంగా మారింది. ఈ మధ్య కాలంలో ఆ గోతిలో ద్విచక్ర వాహనాలు పడి ప‌లువురు గాయ‌ప‌డ్డ‌ ఘటనలు కూడా ఉన్నాయి. కార్లు, ఇతర వాహనాలు సైతం ఈ గోతిలో పడి ప్రమాదాలకు గురవుతున్నాయి. ఎర్రంపేట గ్రామ శివారు ప్రాంతంలోని ప్రభుత్వ కలప అడతి సమీపంలో పడ్డ ఈ గొయ్యి ఆంధ్రా, ఛత్తీస్ ఘ‌డ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలతో పాటు చింతూరు మన్యం వాసుల వాహన చోదకుల, ప్రయాణికుల, ప్రజల పాలిట శాపంగా మారింది. రహదారి మధ్యలో పెద్ద గొయ్యి ఉండటం అది కూడా దగ్గరగా వచ్చే వరకు కనిపించకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకొని గాయాలపాలవుతున్నారు.

దుమ్ము దూళితో అవస్థలు…
ఎర్రంపేట గ్రామంలో అంతర్రాష్ట్ర రహదారి జాతీయ రహదారికి అనుసంధానంగా ఉన్న రోడ్డుపై పెద్ద గొయ్యి పడడంతో ఆ గోతిలో ఉన్న దుమ్ము దూళి వాహనాలు వెళ్ళినప్పుడల్లా లేచి చుట్టు ప్రక్కల ఇళ్లల్లోకి వెళుతుంది. ఈ దుమ్ము దూళి భారీగా వస్తుండ‌డంతో ప్రజలు, చుట్టు ప్రక్కల గృహ యజమానులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

- Advertisement -

ఈ రహదారిపై నిత్యం క్షణం ఖాళీ లేకుండా వాహనాలు తిరుగుతుండడంతో ఆ వాహనాల దాటికి వస్తున్న దుమ్ము దూళి వలన శ్వాసకోస సంబంధిత వ్యాధుల బారిన పడే అవకాశాలు ఉన్నాయని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రహదారిపై పడ్డ గోతిని పూడ్చి ఇటు ప్రమాదాలను అటు ప్రజలు దుమ్ము దూళితో పడుతున్న అవస్థలను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement