Wednesday, March 27, 2024

Delhi | వారు అడగాల్సినవి మేమే అడిగాం.. అఖిలపక్ష భేటీలో విభజన సమస్యలు ప్ర‌స్తావించాం: ఎంపీ కనకమేడల

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష భేటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల గురించి రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ లేవనెత్తాల్సిన అనేకాంశాలను తామే లేవనెత్తాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు అన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఆ పార్టీ తరఫున పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్, రాజ్యసభ ఫ్లోర్ లీడర్ కనకమేడల రవీంద్ర కుమార్ హాజరయ్యారు. అనంతరం గల్లా జయదేవ్ నివాసంలో కనకమేడల రవీంద్ర కుమార్, మరో ఎంపీ కే.రామ్మోహన్ నాయుడు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా కనకమేడల మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం-2014లో పొందుపర్చిన హామీలను అమలుచేయడానికి ఇంకా ఏడాది సమయమే మిగిలి ఉందని గుర్తుచేశారు. కేంద్రం నుంచి రాబట్టాల్సినవి చాలా ఉన్నాయని, వైఎస్సార్సీపీ వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కేంద్రం వద్ద మెడలు వంచే వైఎస్సార్సీపీ నేతలు రాష్ట్ర సమస్యలు గాలికొదిలేశారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తుంటే ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ విధించాల్సినట్టుగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని అన్నారు. విశాఖపట్నంను పాలనా రాజధానిగా మార్చుతామంటున్న వైఎస్సార్సీపీ నేతలు అక్కడ ఏర్పాటు చేయాల్సిన రైల్వే జోన్ గురించి కేంద్రాన్ని అడగలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. వీటన్నింటి గురించి తాము అఖిలపక్ష సమావేశంలో తామే మాట్లాడాల్సి వచ్చిందని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.

మరోవైపు అమరావతిని రాజధానిగా కొనసాగించాలని ఈ సమావేశంలో కేంద్రాన్ని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వక అనేక పథకాలు ఏపీలో అమలుకావడం లేదని ఆరోపించారు. కొన్ని కేంద్ర పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటూ సుమారు రూ. 9 వేల కోట్ల నిధులను దారి మళ్ళించారని విమర్శించారు. గ్రామపంచాయతీ నిధులను కూడా దారి మళ్లించడంతో సర్పంచులు లబోదిబోమంటున్నారని, అందుకే ఆందోళన చేస్తున్నారని చెప్పారు. ఈ అన్యాయాలన్నింటి గురించి పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇంతమంది ఎంపీలున్న వైఎస్సార్సీపి ఏనాడూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా పూర్తిగా తలొంచిందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement