Thursday, May 19, 2022

అసనితో అలజ‌డి, జోరుగా వానలు.. సురక్షిత ప్రాంతాలకు లోతట్టు గ్రామాల ప్రజలు

అమరావతి, ఆంధ్రప్రభ: అసని తుపాను తీరంలో అలజడి సృష్టిస్తోంది.. వాయుగుండం కారణంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.. తుపాను కారణంగా కృష్ణపట్నం,బాపట్ల, వాడరేవు,కళింగపట్నం, భీమునిపట్నం, కాకినాడ, నర్సీపట్నం ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తీరంలో సముద్రవేటకు వెళ్లిన మత్స్యకారులను సురక్షితంగా తరలించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. తుపాను ప్రభావిత 18 జిల్లాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి నిర్వాసితులు ఒక్కొక్కరికీ రూ. 1000, కుటుంబానికి రూ. 2000 చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందించాలన్నారు. అధికార యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండి సహాయ, పునరావాస చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు.

ప్రధానంగా బాపట్ల, కృష్ణా, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని హెచ్చరించారు. ఇప్పటికే తుపాను సహాయక నిధులు మంజూరు చేశామని అవసరమైన మేర ఖర్చు చేయాలన్నారు. కోస్తా తీరంలో ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సూచించారు. నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణ, ఎన్టీఆర్‌, పశ్చిమ గోదావరి, ఏలూరు, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలపై తుపాను ప్రభావం చూపుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సిందిగా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 454 చోట్ల సహాయ, పునరావాస కేంద్రాలను గుర్తించామని అధికారులు వివరించారు. అవసరమైతే మరిన్ని కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. డీజిల్‌, జనరేటర్లు, జేసీబీల వంటి యంత్రాలను సిద్ధం చేసుకోవాలన్నారు. నిర్వాసితులకు, పునరావాస కేంద్రాలకు అవసరమైన బియ్యం, పప్పు దినుసులు, వంట నూనెల వంటి నిత్యావసరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. సహాయక చర్యలకు అవసరమైన సిబ్బందిని నియమించాలని శాఖల మధ్య సమన్వయంతో పరిస్థితిని అధిగమించాలన్నారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఏ ఒక్క మరణం సంభవించకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గంటకు 30 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నందున విద్యుత్‌ సరఫరాలో అంతరాయం లేకుండా అవసరమైన ప్రాంతాల్లో లైన్ల పునరుద్ధరణకు సత్వర చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్లు అప్రమత్తంగా వ్యవహరించి ముందు జాగ్రత్తగా సహాయ,పునరావాస చర్యలపై దృష్టి సారించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో సదుపాయాలను స్వయంగా పర్యవేక్షించాలని ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఖాళీ చేయించి సహాయ కేంద్రాలకు తరలించాలని సూచించారు. నిర్వాసితులకు భోజన, వసతి సౌకర్యాల కల్పనలో ఖర్చుకు వెనుకాడరాదన్నారు. బాధితుల పట్ల మానవతా దృక్పథంతో స్పందించి తగిన సాయం అందించాలని ఉద్ఘాటించారు. బాధితులు పునరావాస కేంద్రాల నుంచి ఇంటికి వెళ్లే సమయంలో ఆర్థిక సాయం అందించాలన్నారు. వరద ముంపు నుంచి తేరుకున్న తరువాత ఇళ్లను బాగుచేయించుకునేందుకు ఈ ఆర్థిక సాయం ఉపకరిస్తుందని చెప్పారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న 7 జిల్లాల్లో ఈ ఏర్పాట్లు చేయాలన్నారు. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్‌ జిల్లా, ఉభయగోదావరి, ఏలూరు, కాకినాడ ప్రాంతాలు, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలపై తుపాను కేంద్రీకృతమైనందున ఆ జిల్లాల అధికార యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉండాలని నిర్దేశించారు.

బాధితులకు హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలన్నారు. ఉప్పాడ రోడ్డుకు శాశ్వత పరిష్కారమార్గాలను అన్వేషించాలని సూచించారు. ఇందుకు సంబంధించి చెన్నై ఐఐటీ నిపుణులతో సంప్రతించి సమస్యకు శాశ్వత పరిష్కార దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్‌కు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు, హోం, ప్రకృతి విపత్తుల నిర్వహణ మంత్రి తానేటి వనిత, రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రామలింగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు పూనం మాలకొండయ్య, జీ సాయి ప్రసాద్‌, అజయ్‌ జైన్‌, రవాణా, వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, విపత్తుల నిర్వహణ విభాగం డైరెక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తదితరులు హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement