Friday, April 19, 2024

Delhi | బాబుతో షేక్ హ్యాండ్‌ వద్దనుకున్నారు.. అందుకే మోదీ చేతులు వెనక్కి పెట్టుకున్నారు: ఎంపీ మార్గాని భరత్

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కరచాలనం వద్దనుకున్నారని, అందుకే ఆయన చేతులు వెనక్కు పెట్టుకున్నారని వైఎస్సార్సీపీ చీఫ్ విప్, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్ అన్నారు. మంగళవారం ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి పార్టీ తరపున హాజరైన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడుతూ జీ-20 సన్నాహక సదస్సులో ప్రధానితో పలువురు నేతల భేటీల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ నేత జగన్మోహన్ రెడ్డితో కరచాలనం చేసి మాట్లాడిన ప్రధాని, చంద్రబాబుతో మాత్రం దూరంగా ఉన్నారని, దీన్ని బట్టే ఆయన ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థమవుతుందని అన్నారు.

తాము కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటూనే రాష్ట్రానికి రావాల్సినవి సాధిస్తామని భరత్ తెలిపారు. గతంలో పోరాటం, ధర్మపోరాటం అన్న చంద్రబాబు నాయుడు ఏం సాధించారో రాష్ట్ర ప్రజలందరూ చూశారని ఎద్దేవా చేశారు. చివరి అవకాశం ఇవ్వండంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను కోరుతున్న అంశంపై ప్రశ్నించగా.. బాబు తన తర్వాత ఎవరికి అవకాశం ఇస్తారో చెప్పాలని అన్నారు. మిడిమిడి జ్ఞానం ఉన్న లోకేశ్‌కు ఇస్తారా? లేదంటే ఏమాత్రం స్థిరత్వం లేని దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌కి ఇస్తారా అంటూ ప్రశ్నించారు. ఈ ఇద్దరిలో ఎవరికి అప్పగించడానికి ప్రజలు సిద్ధంగా లేరని, తమకు మంచి చేస్తున్న జగన్‌తోనే తాము ఉంటామని చెబుతున్నారని మార్గాని భరత్ అన్నారు.

అఖిలపక్ష సమావేశం గురించి మాట్లాడుతూ.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో సమయం వృధా చేయకుండా బిల్లులు, ప్రజా సమస్యలపై చర్చ జరపాలని కోరినట్టు తెలిపారు. అలాగే జీ-20 సదస్సులో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తగిన భాగస్వామ్యం కల్పించాలని విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు తగ్గుతున్నందున పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, తద్వారా ప్రజలపై ధరాభారం తగ్గి ద్రవ్యోల్బణం అదుపులో ఉంటుందని సూచించినట్టు వెల్లడించారు. మహిళలపై జరుగుతున్న దాడులను నిలువరించేందుకు తాము తీసుకొచ్చిన కఠినమైన దిశ చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం తెలిపేందుకు కేంద్ర హోంశాఖ నుంచి ఇంకా అనుమతి ఇవ్వలేదని, ఆ అంశాన్ని సమావేశాల్లో ప్రస్తావిస్తామని మార్గాని భరత్ అన్నారు.

- Advertisement -

రైతులు పండించే ప్రతి పంటకు కనీస మద్ధతు ధర ఉండాలని సూచించినట్టు తెలిపారు. దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఉన్న ఓబీసీలకు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందని, ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న ఓబీసీ జనాభా సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ ఎందుకు ఏర్పాటు చేయలేదని కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాగే త్వరలో చేపట్టనున్న జనాభా లెక్కల సేకరణలో కుల గణన జరిపించాలని కోరారు. రాష్ట్రంలో తమ పార్టీ బీసీలకు పెద్ద సంఖ్యలో పదవులు ఇచ్చిందని గుర్తుచేశారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజమండ్రి లోక్‌సభ సీటును ఇంతవరకు ఏ పార్టీ బీసీలకు టికెట్ ఇవ్వలేదని, వైఎస్ జగన్ తనకు అవకాశం కల్పించారని చెప్పుకొచ్చారు.

విభజన చట్టం సవరణకు ప్రైవేట్ బిల్

యూపీఏ సర్కారు అశాస్త్రీయంగా రాష్ట్రాన్ని విభజించిన నేపథ్యంలో విభజన చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తూ తానొక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడుతున్నానని భరత్ అన్నారు. అయితే ప్రైవేట్ మెంబర్ బిల్ కంటే కేంద్ర ప్రభుత్వమే విభజన చట్టంలో సవరణ తీసుకొస్తే బావుంటుందని, అలాగే అందులో ప్రత్యేక హోదాను కూడా చేర్చాలని అఖిలపక్ష సమావేశంలో సూచించినట్టు తెలిపారు. అలాగే పోలవరం ప్రాజెక్టుకు సమయానుకూలంగా నిధులు విడుదల చేయాలని కోరుతున్నామన్నారు. ఎందుకు కాలయాపన జరుగుతుందో కేంద్రం చెప్పాలని డిమాండ్ చేశారు.

ఏపీ జెన్కోకు తెలంగాణ నుంచి రావాల్సిన రూ. 6,800 కోట్ల బకాయిలను కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఇప్పించాలని కోరినట్టు చెప్పారు. ప్రత్యేక హోదా వెనక్కి వెళ్లడానికి కారణం చంద్రబాబు నాయుడేనని ఆరోపించారు. ఒకసారి హోదా కావాలని, మరోసారి వద్దని, ఇంకోసారి ధర్మపోరాట దీక్ష, పోరాటం అంటు గొడవలు పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీయేనని, చివరికి ఏదీ సాధించలేదని గుర్తుచేశారు. విశాఖపట్నం రైల్వే జోన్ ఒక్కటే కాదు, జోన్‌తో పాటు వాల్తేరు డివిజన్ పూర్తిగా రావాలని భరత్ వ్యాఖ్యానించారు. తమ ఎజెండా ప్రకారం రైల్వే జోన్, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ నగరానికి తీసుకొస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement