Saturday, March 23, 2024

బీఅలర్ట్: ముంచుకొస్తున్న గులాబ్‌ తుఫాను..అప్రమత్తమైన అధికారులు

రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కొన్ని గంటల్లో తుఫానుగా మారబోతోంది. దీనికి గులాబ్‌ అని నామకరణం చేశారు. పశ్చిమ దిశగా పయనిస్తున్న ఈ తుఫాను ఈరోజు సాయంత్రం విశాఖపట్టణం-గోపాల్‌పూర్‌ల మధ్య కళింగపట్నం సమీపంలో తీరం దాటే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ తుఫాను పలు రాష్ట్రాలపై ప్రభావం చూపనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఒడిశాతోపాటు ఏపీ, తెలంగాణ, బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు అధికారులు. ముఖ్యంగా ఏపీ, ఒడిశాలోని పలు ప్రాంతాలకు తుపాను హెచ్చరికలు జారీ చేసింది IMD.

తుఫాను ప్రభావంతో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనావేసింది. ఆంధ్రతోపాటు ఒడిశాలో ఈ తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉంటుందని ప్రకటించింది. వీటితోపాటు తెలంగాణ, చత్తీస్‌గడ్‌లలోనూ అక్కడక్కడ వర్షాలు పడుతాయని వివరించింది.

ఇప్పటికే ఏపీ, ఒడిశాలకు తుఫాన్ హెచ్చరికలను జారీ చేసింది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించింది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. తుపాను తీరం దాటాక భారీ వర్షాలకు ఆస్కారం ఉన్నందున.. తీర ప్రాంతాల్లో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. తుపాను పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: వారంత బైడెన్ బంధువులు: ప్ర‌ధాని మోదీ..

Advertisement

తాజా వార్తలు

Advertisement