Friday, April 19, 2024

Big Story : ఆక్వా రైతుల క్రాప్‌ హాలిడే..!?.. మరో వారం రోజుల్లో కీలక నిర్ణయం

అమరావతి, ఆంధ్రప్రభ: ఆక్వా కంపెనీలు మార్కెట్లో మీసాలు మెలేస్తుంటే రొయ్యలు పండించే రైతులు మాత్రం దిగాలుగా నేలచూపులు చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆక్వా సాధికారిక కమిటీ నిర్ణయాలేవీ క్షేత్రస్థాయిలో అమలు కావటం లేదు. ఈ నేపథ్యంలో ఆక్వా రైతులు క్రాప్‌ హాలిడేను ప్రకటించి తమ నిరసన తెలియచేసేందుకు సిద్ధమవుతున్నారు. మరో వారం రోజుల పాటు మార్కెట్లో ఇవే సంక్షౌభ పరిస్థితులుంటే విజయవాడలో ప్రత్యేక సమావేశం నిర్వహించి క్రాప్‌ హాలిడేను ప్రకటించేందుకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. గతనెల 17 నుంచి 100 కౌంట్‌ ధరను రూ.240గా నిర్ణయించినా ఆక్వా కంపెనీలేవీ పట్టించుకున్న దాఖలాలు కనబడలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు.

తాజాగా సాధికార కమిటీ మరోసారి సమావేశమై రూ.240 ధరను రూ.210కి తగ్గించినా ఆ ధరకు కూడా రొయ్యలను కొనుగోలు చేయటం లేదని సాగుదారులు చెబుతున్నారు. 100 కౌంట్‌ ధర రూ.190కి మించి కొనుగోలు చేస్తు దాఖలాలు లేవని రైతులు చెబుతున్నారు. అంతకుమించి కొనుగోలు చేయలేమని కంపెనీలు తెగేసి చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని రైతులు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ స్టేట్‌ ఆక్వాకల్చర్‌ డెవలప్‌ మెంట్‌ యాక్ట్‌లు, విశేషాధికారాలున్న సాధికార కమిటీలు ఏం చేస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ఆక్వా కంపెనీలకు చెందిన కొందరు సిండికేట్‌గా ఏర్పడి ధరలను అమాంతం తగ్గిస్తున్నాయనీ, దాని వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కలిసి రొయ్యల సాగుదారులు తమ బాధలు చెప్పుకున్నారు.

ఈ నేపథ్యంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో కూడిన సాధికార కమిటీ ఏర్పడింది. ఒక వైపు రైతు ప్రతినిధులతో, మరో వైపు కంపెనీ యాజమాన్యాలతో చర్చించి కొనుగోలు ధరలను నిర్ణయిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం అమలుకు నోచుకోవటం లేదు. రాష్ట్రంలో సుమారు 250 ఆక్వా సంస్థలుండగా..ఎగుమతి, ప్రాసెసింగ్‌, ఫీడ్‌ ప్రొడ్యూస్‌ కార్యకలాపాలన్నిటినీ దాదాపు అవే సంస్థలు నిర్వహిస్తున్నాయి. మార్కెట్‌ లో కిలో సోయాబీన్‌ ధర రూ.50 నుంచి సుమారు రూ.100 వరకు పెరగటంతో టన్ను ఫీడ్‌ ధర రూ.65,000 నుంచి రూ.85000 కు పెంచారు. ప్రస్తుతం మార్కెట్లో సోయాబీన్‌ ధర కేవలం రూ.45 నుంచి 50 వరకు ఉంది. అంటే సగానికి సగం ధర తగ్గిపోయింది. అయినా.. తగ్గుముఖం పట్టిన ధరల స్థాయిలో రొయ్యల ఫీడ్‌ ధరను తగ్గించలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

- Advertisement -

దీనిపై ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం రాజకీయ విమర్శలు కూడా చేస్తోంది. ఆక్వా కంపెనీలు ప్రభుత్వ పెద్దలకు భారీ మొత్తంలో కమిషన్లు ముట్టచెప్పాల్సి రావటం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందనీ, ఫీడ్‌ పరిశ్రమల నుంచి కేజీకి రూ.5 చొప్పున టన్నుకు రూ.5 వేలు వసూలు చేస్తున్నారని టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. ఫలితంగా ఆక్వా సాగుదారులు ధరలు లేక నిండా మునుగుతున్నారని అంటోంది. టీడీపీ ఆరోపణలను ప్రభుత్వం తిప్పికొడుతున్నా సాధికార కమిటీ నిర్ణయాలు ఎందుకు అమలు కావటం లేదన్న ప్రశ్నకు సమాధానం లభించటం లేదని ఆక్వా రైతులు ప్రశ్నిస్తున్నారు.

విద్యుత్‌ సబ్సిడీ అందరికీ ఇవ్వాలి

ఆక్వా ధరలను కంపెనీలు భారీగా తగ్గించిన నేపథ్యంలో ఆక్వా రైతులందరికీ విద్యుత్‌ సబ్సిడీ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కేజీకి కనీసం రూ.10 పెట్టుబడి తగ్గిపోతుందని రైతులు కోరుతున్నారు. సొంత చెరువుల్లో సాగు చేసిన రైతులకు రొయ్యల ఉత్పత్తి వ్యయం ఒక కేజీకి రూ.270 గా ఉంటే కౌలు సాగుదారులకు రూ.310 అవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్‌ సబ్సిడీ అందరికీ కల్పిస్తే పెట్టుబడి కొంత తగ్గుముఖం పడుతుందని అంటున్నారు. ఆక్వా కంపెనీలు ఎగుమతి రాయితీలు కోల్పోవాల్సి వస్తుందని దేశీయ మార్కెట్లో ఎక్కడా రొయ్యలను విక్రయించటం లేదు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని ఎగుమతులతో పాటు డొమెస్టిక్‌ మార్కెట్‌ కూడా ఉండేలా చూస్తే ఉపయోగముంటుందని రైతులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement