Thursday, April 25, 2024

ముందస్తుకు వెళ్తే జగన్ ముందుగా ఇంటికి వెళ్లటమే – సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

మంగళగిరి మార్చి 31 ప్రభ న్యూస్- రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీలో ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని అలా ముందస్తుకు వెళ్తే ఘోర‌ ఓటమిపాలై ముందుగా ఇంటికి వెళ్లడం ఖాయమని భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జోస్యం చెప్పారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ రైతులు రైతు కూలీలు నిరసన దీక్షలు చేపట్టి శుక్రవారంతో 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా నగరంలోని వేములపల్లి శ్రీకృష్ణ భవన్ సిపిఐ కార్యాలయం నుండి మందడం గ్రామానికి రామకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు సంఘీభావం తెలిపేందుకు భారీగా తరలి వెళ్లారు.

ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, జగన్ ఓ మూర్ఖపు ముఖ్యమంత్రి అని అభివర్ణించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగిన ప్రజలు వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. హైకోర్టు అమరావతికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లగా అక్కడ కూడా ప్రభుత్వానికి ప్రతికూల తీర్పు వచ్చిందని వివ‌రించారు. భారతీయ జనతా పార్టీ నేతలు రాష్ట్రంలో జగన్ ను విమర్శిస్తూ ఢిల్లీలో మాత్రం వత్తాసు పలుకుతున్నారని అన్నారు.

మెడలు వంచుతానని… మోకాళ్ళ వద్ద కూర్చున్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు వంటి వాటిపై కేంద్రం మెడలు వంచుతానని డిమాండ్లు సాధించుకుంటారని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం మోకాళ్ల వద్ద కూర్చున్నారని రామకృష్ణ విమర్శించారు. జగన్ కోరుకున్న విశాఖలోనే ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిని విద్యావంతులు చిత్తుగా ఓడించారని అన్నారు.
కేసులు పెట్టి బెదిరించినా వెనుకడుగు వేయలేదు..
1,200 రోజులుగా రైతులు రైతు కూలీలు మహిళలు అమరావతి సాధన కోసం ఉద్యమిస్తున్నారని ప్రభుత్వం కేసులు పెట్టి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ ఏ మాత్రం వెనుకడుగు వేయలేదని ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని రామకృష్ణ పేర్కొన్నారు. విశాఖలో వైసీపీ నేతలు 40 వేల ఎకరాలను కబ్జా చేసినట్లు చెబుతున్నారని దీనిని బట్టి అక్కడ రాజధానిని ఏర్పాటు విషయమై అక్కడ ప్రజలు కూడా సానుకూలంగా లేరని అన్నారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి అక్కడి ప్రజలను కూడా మోసం చేశాడని ఆరోపించారు. ఇప్పటికైనా మూడు ముక్కలాట మానుకొని అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి జగన్ విజ్ఞతను చాటుకోవాలని రామకృష్ణ హితవు పలికారు.

175 లో ఒక అంకె ఎగరటం ఖాయం.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము 175 స్థానాల్లో గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి తరచూ ప్రకటిస్తున్నారని ఇదంతా ఓ మైండ్ గేమ్ అని రామకృష్ణ అన్నారు. 175 లో ఒక అంకె ఎగరటం మాత్రం కచ్చితంగా జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. జగన్ ఇంటికి వెళ్తే రాష్ట్రానికి విముక్తి కలుగుతుందని అప్పుడు అమరావతి అభివృద్ధి చెందుతుందని పోలవరం నిర్మాణం పూర్తి అవుతుందని ఆయన పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కలిసొచ్చే పార్టీలతో ముందుకు వెళ్లేందుకు సిద్ధం.
ప్రభుత్వ తీరు పట్ల అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని విద్యావంతులు వైసిపి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకోవటం లేదని రామకృష్ణ తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసిపిని సాగనంపుతామని కలిసి వచ్చే పార్టీలతో పొత్తుకు సిద్ధమని జనసేన కలిసి నడుస్తామని అన్నారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో జనసేన బిజెపికి మద్దతు ఇవ్వలేదని అయినప్పటికీ జనసేన తమతోనే ఉందని బిజెపి నేతలు ప్రకటించుకోవటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లోనూ బిజెపి జేఎస్పీలు కలిసి నడుస్తాయని తాము అనుకోవటం లేదని తెలిపారు. కేంద్రంలో బిజెపిని గద్దె దింపేందుకు 16 ప్రతిపక్ష పార్టీలు ఏకతాటి పైకి నడిచేందుకు సిద్ధమవుతున్నాయని అన్నారు. కర్ణాటకలో బిజెపి ఓడిపోవడం ఖాయమని అదే వ్యతిరేక పవనాలు దేశం మొత్తం వేస్తాయని తెలిపారు. కేంద్రంలో బిజెపిని రాష్ట్రంలో వైసిపిని ప్రజలు ఇంటికి సాగనంపుతారని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య నాయకులు జాలాది జాన్ బాబు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement