Thursday, April 25, 2024

Big Story: డేంజర్‌లో కాటన్‌ బ్యారేజీ.. సమీపంలోనే ఇసుక మాఫియా తవ్వకాలు..

ఉబయ గోదావరి జిల్లాలను నిత్యం పచ్చదనంగా ఉండేలా చేసిన కాటన్​ బ్యారేజీ ఇప్పుడు డేంజర్​లో ఉంది. ఒకప్పుడు తాగు, సాగునీరే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ బ్యారేజీకి ఇసుక మాఫియా ముప్పు తెస్తోంది. దీన్ని అడ్డుకోకుంటే మున్ముందు ఇబ్బందులు తప్పవంటున్నారు పరిశీలకులు.. దీనికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలంటున్నారు స్థానికులు..

కాకినాడ, ఆంధ్రప్రభ: రాజమండ్రి నాలుగో వంతెనతో పాటు శతాబ్ధాల చరిత్రకలిగిన కాటన్‌ బ్యారేజ్‌కు కూడా ఇసుక మాఫియా ముప్పు తెస్తోంది. నిబంధనలు అతిక్రమించి వీటి పరిసరాల్లో అక్రమంగా ఇసుకను తవ్వేస్తోంది. ప్రస్తుతం ఇసుక సేకరణ, విక్రయ బాధ్యతను జెపి సంస్థకు ప్రభుత్వం కట్టబెట్టింది. తవ్వకాలకు సంబంధించిన విధి విధానాల్ని పటిష్టంగా ప్రభుత్వం రూపొందిం చింది. జెపి సంస్థ ప్రతినిధులు నేరుగా ఇసుక తవ్వకాలు జరిపినా.. జరుపుతున్న ప్రాంతాన్ని, తీరును, వినియోగిస్తున్న యంత్రాల్ని పరిశీలించాల్సిన బాధ్యత సంబంధిత శాఖల అధికారులదే. కానీ ఓ వైపు కాటన్‌ బ్యారేజ్‌కి, మరోవైపు నాలుగోవంతెనకు ముప్పుతెచ్చే రీతిలో అక్రమంగా ఇసుకను తవ్వేస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం అధికార పార్టీకి చెందిన ఇన్‌చార్జ్‌ ఒత్తిళ్ళు వీరిపై గట్టిగా పని చేయడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక సేకరణ బాధ్యతను జెపి సంస్థకు అప్పగించినా ఆ సంస్థ తిరిగి రీచ్‌ల వారీగా కొందరు వ్యాపారులకు అనధికారికంగా ఈ బాధ్యతల్ని కట్టబెట్టేసింది. ఎక్కువగా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఇసుక వ్యాపారంలో అనుభవమున్నవారితో కలసి బృందాలుగా ఏర్పడి ఈ రీచ్‌ల నిర్వహణాబాధ్యతను తీసుకున్నారు. గోదావరి వెంబడి పలు రీచ్‌ల్లో అక్రమంగా, నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు జరుపుతున్నా రాజమండ్రి రూరల్‌ పరిధిలో మాఫియా రెచ్చిపోతోంది.

గతంలో తెలుగుదేశంలో ఉన్న ఓ వ్యక్తి కొన్నాళ్ళ క్రితమే రాజమండ్రి ఎమ్‌పి సహకారంతో అధికార వైకాపాలో చేరడంతో పాటు రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు దక్కించుకున్నారు. ఆయనే ఇక్కడ ఇసుక మాఫియాకు వెన్నుదన్నుగా నిలబడ్డారు. ఆయన అండదండల్తో మాఫియా రెచ్చిపోతోంది. అడ్డూ అదుపులేకుండా గోదావరిని తవ్వేస్తోంది. నిబంధనల్ని తుంగలో తొక్కి వంతెన, బ్యారేజ్‌ల సమీపంలో కూడా ఇసుక తవ్వితీస్తోంది. వేమగిరి, ధవళేశ్వరం, రాజమండ్రి, కాతేరు, వెంకటనగరం, రీచ్‌ల్లో ఎక్కడా నిబంధనలు అమలుకావు. అసలిక్కడ రీచ్‌ల్లో సిసి కెమెరాలు కనిపించవు. ప్రతి రోజు ఎన్నిలారీల ద్వారా ఎంత పరిమాణంలో ఇసుకను తరలిస్తున్నారో లెక్కలు గట్టాలి. ఇందుకోసం రీచ్‌ల్లో వేయింగ్‌బ్రిడ్జిలు ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడెక్కడా వేయింగ్‌బ్రి డ్జిలు కానరావు. అలాగే రీచ్‌ల్లోకొచ్చే ప్రతి లారీకి జిపిఎస్‌ ట్రాక్‌ సిస్టమ్‌ అనుసంధానం చేయాలి. అయితే పేరుకి ఈ పరికరాలున్నా వాటికి రీచార్జ్‌ చేయరు. అలాగే కొన్ని ఓపెన్‌రీచ్‌లు, బోట్స్‌మెన్‌ రీచ్‌లున్నాయి. ఈ రీచ్‌ల నుంచి కొన్ని ఎంపిక చేసిన వర్గాలు మాత్రమే ఇసుకను సేకరించాలి. కానీ ఇక్కడ కూడా అధికార పార్టీ ఇన్‌చార్జ్‌ పెత్తనమే సాగుతోంది. ధవళేశ్వరంలోని ఆరు రీచ్‌లు కూడా కాటన్‌ బ్యారేజ్‌కు సమీపంలో ఉన్నాయి. ఇక్కడ నిబంధనల్ని చాలా పకడ్బందీగాఅమలు చేయాలి. ఇవేవీ ప్రస్తుతం అమలుకావడంలేదు.
ఒడ్డున నిర్ణీత పరిధి మేరకే ఇసుక సేకరించాలి.

కానీ గోదావరి గర్భంలోకి అనధికారికంగా బాటలు నిర్మించారు. పారుతున్న గోదావరికి అడ్డుకట్టేశారు. అక్కడ్నుంచి ఇసుకను తవ్వితీసి తరలిస్తున్నారు. అలాగే వర్షాకాలంలో వినియోగం కోసమంటూ పదిలక్షల మెట్రిక్‌ టన్నుల స్టాక్‌పాయింట్‌ను ఏర్పాటుచేయాలని అధికారులు చేసిన నిర్ణయం అక్రమార్కులకు వరంగా మారింది. స్టాక్‌పాయింట్‌కంటూ బయలుదేరుతున్నలారీలు ఎక్కడికెళ్తున్నది ఆరాలేదు. కొన్ని సందర్భాల్లో అవి జిల్లాలకు జిల్లాలు దాటిపోతున్నాయి. మరికొన్ని సందర్భాల్లో జిల్లా చెక్‌పోస్టుల వద్ద పట్టుబడుతున్నాయి. అయినా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ప్రతిరోజు వేమగిరి రీచ్‌ నుంచి 400కు పైగా లారీల ఇసుక అక్రమంగా తరలిపోతున్నట్లు అధికారులే బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇక ధవళేశ్వరం రీచ్‌ నుంచి రోజూ 300లకు పైగా లారీల ఇసుక వివిధ ప్రాంతాలకు తరలిపోతోంది. నిబంధనల్ని పక్కనపెట్టి సాగిస్తున్న ఇసుక మాఫియా దందా భవి ష్యత్‌లో గోదావరి జిల్లాల పేరిట పెనుప్రమాదంగా మారనుంది.

బ్యారేజ్‌కు, వంతెనకు సమీపంలో జరుగుతున్న తవ్వకాలు వీటి పటిష్టతను దెబ్బతీస్తాయి. ఏదొకరోజున ఇవి కుప్పకూలుతాయి. దీంతో ప్రాణనష్టంతో పాటు తీవ్ర ఆర్ధిక నష్టం కూడా చేకూరుతుంది. ఇసుకకు సంబంధించి ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టమైన ఆలోచనలో ఉన్నారు. అవసరమైన వారికి నిబంధనల ప్రకారం ఇసుక సరఫరా కావాలంటూ ఆయన అధికారులకు ఆదేశాలిచ్చారు. ఇసుక వ్యవహారంలో పార్టీ నాయకులెవరూ తలదూర్చొద్దంటూ పలు సందర్భాల్లో చెప్పారు. కానీ తెలుగుదేశం నుంచి కొన్నాళ్ళ క్రితమే వైకాపాలోచేరిన వ్యక్తులు సాగిస్తున్న ఇసుక దందాపై మాత్రం దృష్టిసారించలేక పోతున్నారని పరిసర గ్రామాల ప్రజలు మండిపడుతున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement