Thursday, May 26, 2022

మళ్లీ తెరమీదకు అమరావతిలో అవినీతి.. ఏ-1గా చంద్రబాబుపై ఎఫ్‌ఐఆర్‌..

అమరావతి, ఆంధ్రప్రభ : అమరావతిలో అవినీతి అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. రాజధాని భూముల వ్యవహారం ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ డిజైన్‌ రూపకల్పన, చుట్టుప్రక్కల ప్రాంతాల ను కలుపుతూ నిర్మించిన ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు ప్రాధమికంగా నిర్ధారించిన ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. ఏపీ రాజధాని మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పన, ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, అనుసంధాన మార్గాల అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సిఐడికి ఫిర్యాదు చేశారు. దీంతో సిఐడి అధికారులు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుపై కేసు నమోదు చేసి నిందితుల జాబితాలో ఏ1 గా చేర్చింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో అరెస్టయిన నారాయణను ఈ కేసులో ఏ2గా నిందితుల జాబితాలో చేర్చింది. వీరిద్దరితో కలిపి మొత్తం 14 మంది పేర్లు జాబితాలో చేర్చిన సిఐడి అధికారులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

2014 నుంచి 2019 మధ్యకాలంలో ప్రభుత్వంలో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తులు అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం కలిగిన సదరు వ్యక్తులు దాని ద్వారా తీవ్ర ప్రయోజనాలు పొందారని ఆరోపించారు. దీనిలో వల్ల సామాన్యులకు అన్యాయం జరగడంతోపాటు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం వాటిల్లి ందని, మొత్తం ఈ వ్యవహారంలో తిరుగులేని మోసం చోటు చేసుకున్నందున చట్టపరంగా చర్యలు తీసుకోవాలని ఆళ్ళ సిఐడికి ఇచ్చిన తన ఫిర్యాదులో కోరారు. గత నెల ఏప్రిల్‌ 27న ఆయన ఇచ్చిన ఫిర్యాదుపై ప్రాధమిక దర్యాప్తు నిర్వహించిన సిఐడి అధికారులు మే 9 వ తేదీన ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మంగళగిరిలోని సిఐడి పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నెంబర్‌ 16/2022 లో సెక్షన్‌ 120బి, 420, 34, 35, 36, 37, 166, 167 అండ్‌ 217 ఐపిసి, సెక్షన్‌ 13(2), రెడ్‌విత్‌ 13(1)(ఎ) ఆఫ్‌ ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్‌ యాక్టు-1988 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో చంద్రబాబునాయుడుని ఏ1గా, మాజీ మంత్రి నారాయణను ఏ2గా చేర్చి, చంద్రబాబుకు చెందిన హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ను ఏ6గా చేర్చారు.

అదేవిధంగా లింగమనేని రమేష్‌, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రౖౖౖెవేటు లిమిటెడ్‌ డైరెక్ట ర్‌ కెపివి అంజని కుమార్‌ అలియాస్‌ బాబి, హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌, ఎల్‌ఇపిఎల్‌ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌, ఎల్‌ఇపిఎల్‌ ఇన్ఫోసిటీ ప్రైవేటు లిమిటెడ్‌, ఎల్‌ఇపిఎల్‌ స్మార్ట్‌ సిటీ ప్రైవేటు లిమిటెడ్‌, లింగమనేని అగ్రికల్చర్‌ డెవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, లింగమనేని ఆగ్రో డవలపర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, జయని ఎస్టే ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, రామకృష్ణ హౌసింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌,లతోపాటు ప్రభుత్వం అధికారులు, కొందరు ప్రైవేటు వ్యక్తులు కూడా ఉన్నారని సిఐడి అధికారులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ కాపీని, ఫిర్యాదు పత్రాన్ని అధికారులు విజయవాడలోని ఏసిబి ప్రత్యేక కోర్టులో సమర్పించారు. సిఐడి అదనపు డీజీ పర్యవేక్షణలో ఆర్థిక‌ నేరాల విభాగం అడిషనల్‌ ఎస్పీ జయరామరాజు కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్నారు.

గతంలో కేసుకు బ్రేక్‌.. తాజా ఎఫ్‌ఐఆర్‌లో అరెస్టులకు రంగం సిద్ధం..?

కాగా మాజీ మంత్రి నారాయణపై గతంలో ఇదే అంశంపై నమోదైన కేసు దర్యాప్తునకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినా.. తాజాగా మంగళగిరి ఎమ్మెల్యే ఫిర్యాదుతో నమోదైన సిఐడి కేసులో ప్రధాన నిందితుల అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నారాయణ విద్యాసంస్ధల పేరుతో గడిచిన కొన్ని దశాబ్ధాలుగా దేశవ్యాప్తంగా పొంగూరు నారాయణ గుర్తింపు పొందారు. ఆంద్రప్రదేశ్‌లో 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందాక నారాయణకు ఎమ్మెల్సీగా అవకాశం దక్కింది. ఆ తర్వాత ఆయన చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రిగా చేరారు. ఐదేళ్ల పాటు రాష్ట్ర పట్టణాభివృద్ధి మున్సిపల్‌ శాఖ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికల్లో నెల్లూరు నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాని రాష్ట్రంలో జగన్‌ సర్కార్‌ వచ్చాక అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి వెల్లువెత్తిన ఆరోపణల నేపధ్యంలో నారాయణ పేరు మలుమార్లు తెరమీదకు వచ్చింది. ఈనేపధ్యంలో రాజధానిలో నారాయణ నేతృత్వంలో అనేక అవకతవకలు జరిగాయని గతంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సిఐడి నారాయణపై కేసులు నమోదు చేసింది.

కాని కోర్టు ఆదేశాలతో విచారణకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. అయితే ఆ కేసులకు సంబంధించి విచారణ కొనసాగుతూనే ఉందని, కేసులేమీ తీసేయాలేదని, మరికొంత సమయం పట్టినా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందంటూ నారాయణ అరెస్ట్‌ వ్యవహారంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఈమేరకు వ్యాఖ్యానించారు. ఈ నేపధ్యంలో చంద్రబాబును అరెస్టు చేస్తారా లేక నోటీసు ఇచ్చి వదులుతారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా నారాయణను మాత్రం కోర్టు అనుమతి తీసుకుని పిటి వారెంట్‌ మీద ఈ కేసులో అరెస్టు చేసేందుకు సిఐడి సిద్ధంగా ఉంది. అదేవిధంగా ఈ కేసులో నిందితుల జాబితాలో ఉన్నవారిని కూడా కొిద్దిరోజుల్లోనే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement