Wednesday, April 17, 2024

తిరుపతి జిల్లాలో రహదారుల అభివృద్ధికి సహకరించండి.. విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూల స్పందన

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి జిల్లాలో రహదారుల అభివృద్ధికి సహకరించవలసినదిగా వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు మద్దిల గురుమూర్తి చేసిన విజ్ఞప్టులపై కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించారు. గురువారం పార్లమెంట్‌లోని కేంద్రమంత్రి కార్యాలయంలో గురుమూర్తి ఆయనను కలిసి తిరుపతి జిల్లాలోని పలు కీలక రహదారులు, వాటిపై నిర్మించవలసిన హై లెవెల్ బ్రిడ్జిలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ప్రధానంగా వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి రైల్వేస్టేషన్ సమీపంలో గేటు దగ్గర జాతీయ రహదారి 565 పై రోడ్ ఓవర్ బ్రిడ్జి, అదే రహదారిపై వెంకటగిరి క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ అధికంగా ఉండటం వల్ల అక్కడ ఓ బ్రిడ్జి నిర్మించవలసినదిగా ఎంపీ అభ్యర్థించారు.

రేణిగుంట మండలం కొత్తపాలెం, కురుకాలువ గ్రామాల్లోని భూమిలో నిర్మాణమవుతున్న హైవేకి ఇరువైపులా ఉన్న స్విమ్స్ మెడికల్ యూనివర్సిటీ భూముల్లో మెడికల్ రీసెర్చ్, కార్డియాక్ సైన్స్, న్యూరో సైన్స్, నెఫ్రో సైన్స్ బ్లాక్స్, వరల్డ్ క్లాస్ రీహాబిలిటేషన్ అండ్ పాలియేటివ్ కేర్ సెంటర్, ఇతర నిర్మాణాలకు సంబంధించిన వివిధ భవనాలు సమీప భవిష్యత్‌లో ఏర్పాటు చేయనుండడం వల్ల రోగులు, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఆరు లేన్ల రహదారిపై అండర్ బ్రిడ్జి నిర్మించవలసినదిగా కేంద్రమంత్రిని కోరారు. సూళ్లూరుపేట నియోజకవర్గం గుర్రప్పతోట వద్ద జాతీయ రహదారి 71 గ్రామానికి దూరంగా అండర్ పాస్ నిర్మిస్తుండడం వల్ల అక్కడి ఆరు గ్రామాలకు అసౌకర్యంగా ఉందని, ఈ రోడ్డు మార్గం ద్వారా మేనకూరు పారిశ్రామిక వాడకి తక్కువ సమయంలో చేరుకోవచ్చని చెప్పారు.

- Advertisement -

తిరుపతి – తిరుత్తణి – చెన్నై జాతీయ రహదారిపై చాలాకాలంగా చేస్తున్న పనులను త్వరితగతి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని నితిన్ గడ్కరీకి విన్నవించారు. గూడూరు – చిల్లకూరు జంక్షన్‌లో నిత్యం ట్రాఫిక్ నిలిచిపోవడంతో పాటు ప్రమాదాలు జరుగుతుండడం వల్ల అండర్ పాస్ అవసరమని అభిప్రాయపడ్డారు. తడ, శ్రీకాళహస్తి, ఊతుకోట, సత్యవేడుకి సంబంధించిన రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చే అంశాన్ని మరోమారు గుర్తు చేశారు. మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటు కోసం వెంకటగిరీ నియోజకవర్గం పరిధిలో సీఆర్ఐఎఫ్ నిధులతో మరమత్తులు, రహదారి నిర్మాణాలకు త్వరితగతిన నిధులు మంజూరు చేయాలని కోరగా సాధ్యాసాధ్యాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకొంటామని చెప్పారని ఎంపీ గురుమూర్తి తెలిపారు.

బైపాస్‌పై ప్రాజెక్ట్ రిపోర్ట్..

విశాఖపట్నంలోని కంటైనర్ టర్మినల్ నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వద్ద నేషనల్ హైవే 16 వరకు 6 వరసల రహదారి కోసం డీపీఆర్ సిద్ధం చేస్తున్నామని నితిన్ గడ్కరీ తెలిపారు. లోక్‌సభలో ఎంపీ గురుమూర్తి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధామిచ్చారు. విజయవాడకు తూర్పు దిక్కున బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేయగా, ప్రతిపాదిత బైపాస్ రోడ్డు కి ఆనుకుని ప్రభుత్వ స్థలాన్ని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఏర్పాటు కోసం ఉచితంగా ఇవ్వాలని తాము కోరినట్టు వివరించారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని ఆయన జవాబులో పేర్కొన్నారు. కృష్ణానది మీద బ్రిడ్జి సహా మొత్తం 40 కిమీ పొడవైన ఈస్టర్న్ బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తున్నామని నితిన్ గడ్కరీ చెప్పారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement