Saturday, April 20, 2024

బ్రహ్మంగారిమఠం పీఠాధిపతి ఎవరు ?.. కొలిక్కిరాని వివాదం!

ప్రసిద్ధి చెందిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ పీఠాధిపతి నియామకంలో  వివాదం కొలిక్కిరావటం లేదు. బ్రహ్మంగారిమఠం పీఠాధిపత్యం కోసం రెండు కుటుంబాల మధ్య పోటీ కొనసాగుతోంది. గతవారం ఇరువర్గాలతో మఠాధిపతుల బృందం చర్చలు జరిపింది. ధర్మబద్ధంగా అన్ని అర్హతలు ఉన్న వారినే ఎంపిక చేస్తామని ప్రకటించింది. మఠాధిపతుల బృందం ఇప్పటికే దేవాదాయశాఖ మంత్రికి నివేదిక ఇచ్చింది. వ్యవహారం కొలిక్కిరాకపోవడంతో మరోసారి చర్చలు జరపనుంది.

బ్రహ్మంగారి మఠంలో పీఠాధిపతుల బృందం పర్యటన నేపథ్యంలో ఉత్కంఠ నెలకొంది. అక్కడ చర్చలకు అనుమతి లేదంటున్నారు పోలీసులు. ఆలయ పరిసర ప్రాంతాల్లో గ్రామస్థులకు కూడా ఎలాంటి అనుమతి లేదని పోలీసులు హెచ్చరిక జారీ చేసారు. మరోవైపు పీఠాధిపతుల రాకను వ్యతిరేకిస్తున్నారు రెండో భార్య మహాలక్ష్మమ్మ.

గత నెల 8వ తేదీన మఠం పీఠాధిపతి శ్రీవీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్వామి సంతానం మధ్య మఠం పీఠాధిపత్యంపై వివాదం నెలకొంది. మఠాధిపతి పీఠం కోసం మొదటి భార్య చంద్రావతమ్మ సంతానంలో మొదటి కుమారుడు నొస్సం వెంకటాద్రిస్వామి, రెండో కుమారుడు నొస్సం వీరభద్రస్వామి, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ మొదటి కుమారుడు నొస్సం గోవిందస్వామి పోటీ పడుతున్నారు.  ఈ నేపథ్యంలో వివిధ మఠాలకు చెందిన అధిపతులు శివస్వామి ఆధ్వర్యంలో బ్రహ్మంగారిమఠానికి తరలివచ్చారు. వారు విడివిడిగా కుటుంబసభ్యులతో చర్చించి వారందరినీ ఒక తాటిపైకి తెచ్చేందుకు సాగించిన ప్రయత్నాలు చేస్తున్నారు.

పూర్వపు మఠాధిపతి వీరభోగ వసంత వేంకటేశ్వరస్వామి మొదటి భార్య చంద్రావతమ్మ ప్రథమ కుమారుడు వేంకటాద్రిస్వామి మఠాధిపతిగా, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ ప్రథమ కుమారుడు గోవిందస్వామిని ఉత్తరాధికారిగా నియమించేందుకు ప్రతిపాదించినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement