Thursday, April 25, 2024

AP | వరుస ఘటనలతో షార్​లో కలకలం.. రెండు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్య

సూళ్లూరుపేట, ప్రభన్యూస్‌: భారత అంతరిక్ష ప్రయోగం కేంద్రం షార్‌లో వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడడంతో షార్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మూడు రోజుల క్రితం సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ చింతామణి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డగా అదేరోజు రాత్రి షార్‌ మొదటి గేటు వద్ద విధులు నిర్వర్తించే సీఐఎస్‌ఎఫ్‌ ఎస్‌ఐ వికాస్‌సింగ్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వీరి మృతదేహాలను సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి శ్రీహరికోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ వికాస్‌సింగ్‌ భార్య ప్రియాసింగ్‌ భర్త మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు కుటుంబ సభ్యులతో సూళ్లూరుపేటకు చేరుకుంది.

అయితే ఏం జరిగిందో తెలియదుకాని మంగళవారం అర్ధరాత్రి కుటుంబ సభ్యులు నిద్రించిన తర్వాత నర్మద గెస్ట్‌ హౌస్‌లో ప్రియాసింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐఎస్‌ఎఫ్‌ జవాన్‌ చింతామణి, ఎస్‌ఐ వికాస్‌సింగ్‌తో పాటు ఎస్‌ఐ భార్య ప్రియాసింగ్‌ల మృతదేహాలను నాయుడుపేట డీఎస్పీ ఎం రాజగోపాల్‌రెడ్డి పరిశీలించారు. మృతుల కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

ఇదిలా ఉండగా షార్‌లో రెండు రోజుల్లో ముగ్గురు ఆత్మహత్యలకు పాల్పడడంతో తీవ్రచర్చకు దారితీస్తోంది. జవాన్‌, ఎస్‌ఐ ఆత్మహత్యకు పాల్పడితే భర్త మృతదేహాన్ని తీసుకువెళ్లేందుకు వచ్చిన ఎస్‌ఐ భార్య ప్రియాసింగ్‌ కూడా ఆత్మహత్యకు పాల్పడడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సమస్యలతో చనిపోయారా? మరేదైనా కారణం ఉందా? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement