Thursday, December 5, 2024

కాఫీ సాగు భలే బాగు.. అరకు కాఫీకి అంతర్జాతీయ డిమాండ్‌..

అమరావతి, ప్రభన్యూస్ : రాష్ట్రంలో కాఫీ తోటల విస్తరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం యాక్షన్‌ప్లాన్‌ రూపొందించింది. 2015 నుంచి 2025 వరకు కాఫీ తోటల్ని సమగ్రంగా అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం రూ.526.16 కోట్ల సమగ్ర ప్రణాళికను ఆమోదించింది. కాఫీ తోటల విస్తరణ, పునరుద్దీపన, సేంద్రీయ పద్ధతి సాగు ధృవీకరణ, బేబి పల్పర్ల సరఫరా ద్వారా వెట్‌ పల్పింగ్‌ ప్రోత్సాహంతో పంచతంత్ర ప్రణాళికనుగిరిజన సహకార సంస్థ (జిసిసి) అమలుచేస్తోంది. 2024-25 నాటికి కాఫీ తోటల సాగు విస్తీర్ణం లక్ష ఎకరాలకు పెంచాలని గిరిజన సహకార సంస్థలక్ష్యంగా నిర్ణయించింది. ప్రస్తుతం ఎకరాకు 100 నుంచి 125 కిలోల కాఫీ గింజల దిగుబడి వస్తోంది. ఈతోటల్లో మిర్చి, మిరియాలు వంటి అంతర్‌ పంటల్ని సాగు చేస్తున్నారు. కాఫీ తోటల్లో నీడనిచ్చే సిల్వర్‌ ఓక్‌ చెట్లపై మిరియాల మొక్కల్ని పెంచుతున్నారు. ఎకరా కాఫీ తోటలో సుమారు 100 మిరియాల మొక్కల్ని నాటుతున్నారు. రైతాంగం అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తోంది.

అరకు కాఫీ ఓ బ్రాండ్‌..

సేంద్రీయ పద్ధతుల్లో సాగుచేసిన కాఫీ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో సేంద్రీయ పద్ధుతుల్లోనే గిరిజనులు కాఫీ పంట సాగుచేస్తున్నారు. గిరిజన సంక్షేమ సంస్థ ద్వారా ప్రభుత్వం సేంద్రీయ ధృవీకరణ పత్రాలను అందిస్తోంది. సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే అరకు కాఫీకి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. దీంతో గిరిజన రైతాంగానికి మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభిస్తోంది. అరకు కాఫీ స్టాల్స్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. పంటను నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు, డిజిటల్‌ వేయింగ్‌ మిషన్లు, మార్కెటింగ్‌కు మెరుగైన రవాణా సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తోంది. కాఫీ మొక్కలకు కాసే పండ్లపై ఉండే పొట్టును తొలగించి గింజను శుద్ధి చేసేందుకు బేబి పల్పర్స్‌ (చిన్న తరహా యంత్రాలు)ను రైతులకు అందిస్తోంది.

దెబ్బతిన్న తోటల్లో సాగు..

గడిచిన ఐదేళ్ళుగా సంభవించిన తుఫానులు, ప్రకృతి విపత్తుల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో కాఫీ తోటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయి. పెట్టుబడులు ఎక్కువై ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో రైతాంగం కొద్ది ప్రాంతాల్లో కాఫీ తోటల సాగును తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ భూముల్లో సైతం తిరిగి కాఫీ సాగు మొదలయ్యేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. విశాఖ ఏజెన్సీలో కాఫీ తోటల సాగుకు ప్రభుత్వం ఇతోధికంగా ప్రోత్సాహం అందిస్తోంది. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలోని 11 మండలాల్లో 93,521 మంది గిరిజనులు 96,377 ఎకరాల్లో కాఫీ పంటను సాగు చేస్తున్నారు. దీన్ని లక్ష ఎకరాలకు పైగా పెంచాలన్నది జీసీసీ లక్ష్యం. పొట్టుతీసిన కాఫీ రకం 3 వేల మెట్రిక్‌ టన్నులు, చెర్రీ రకం 6 వేల మెట్రిక్‌ టన్నులు దిగుబడి వస్తోంది. మార్కెట్‌లో మంచి ధరలు లభిస్తుండటంతో రైతులు కాఫీ సాగువైపు ఉత్సాహంగా అడుగులు వేస్తున్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement