Thursday, April 25, 2024

ప‌ల్లెల్లో కోడి కేక‌

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరా న్నంటాయి. గడిచిన మూడు రోజులుగా ప్రధాన పార్టీలకు చెందిన నేతలంతా సొంత గ్రామాల్లోనే మకాం వేసి పండుగ సంబరాల్లో పాల్గొన్నారు. దీంతో పల్లెకు సంక్రాంతి పండుగతో పాటు రాజకీయ కళ కూడా సంతరించుకుంది. ముఖ్యంగా సంక్రాంతి సాంప్రదాయాలతో పాటు కోడి పందేలు, ఎడ్ల పందేలు జోరుగా హుషారు గా సాగాయి. గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కోడి పందేలు అంచనాలకు మించి నిర్వహించ డంతో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. మరికొన్ని గ్రామాల్లో అయితే కాయ్‌ రాజా కాయ్‌ అంటూ పేకాట కూడా హుషారుగా సాగింది. ఒక్క మాటలో చెప్పాలంటే పండుగ మూడు రోజుల్లో అత్యధిక శాతం కోడిపందేలకే ఎక్కువ సమయాన్ని కేటాయించారంటే .. రాష్ట్రంలో కోడి పందేలు ఏ స్థాయిలో సాగాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ప్రజా ప్రతినిధులంతా పట్టణాలను వదిలి సొంత గ్రామాలకు వచ్చి సంక్రాంతి జరుపుకున్నారు. ఈ నేపథ్యం లోనే గ్రామస్థాయి నేతలతో ఎక్కువ సమయం కేటా యించారు. దీంతో కొన్ని పల్లెల్లో అయితే అప్పుడే ఎన్నికలు జరగబోతున్నాయా .. అన్న వాతావరణం దర్శనమిచ్చింది. ముఖ్య నేతలు కూడా ఆ స్థాయిలోనే పల్లెల్లో హడావుడి చేశారు. మొత్తానికి సంక్రాంతి సంబరాలు ప్రశాంతంగా ముగి యడంతో పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన బంధు మిత్రులంతా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు.

గ్రామాల్లో రాజకీయ కాక
గత రెండు సంవత్సరాలతో పొలిస్తే ప్రస్తుతం రాష్ట్ర వ్యా ప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ సంక్రాంతి సంబరాలు అంచ నాలకు మించి జరిగాయి. 2021-22లో కొవిడ్‌ కారణంగా కొంతమంది సొంత గ్రామాలకు రాలేకపోయారు. ఆయా ప్రాంతాల్లోనే సంక్రాంతిని జరుపుకున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో కొవిడ్‌ ప్రభావం తగ్గడం , ఎన్నికల సమయం దగ్గరపడడంతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలు సంక్రాంతిని సొంత గ్రామాల్లోనే జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగానే రెండు రోజులు ముందుగానే సొం త గ్రామాలకు చేరుకునేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ప్రత్యేకించి ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజా ప్రతినిధులు కూడా సొంత గ్రామాల్లోనే సంక్రాంతిని నిర్వహించుకోవాలని నిర్ణయం తీసుకోవడం , ఆ దిశగా గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో పండుగ వాతావరణంతో పాటు రాజకీయ వాతావరణం కనిపించింది. మాజీ ముఖ్యమంత్రులు, మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు , ఐఏఎస్‌, ఐపీఎస్‌లు ఇలా రాజకీయ రంగంతో పాటు రాష్ట్రస్థాయిలో ఉన్నతాధికారులు సైతం సొంత గ్రామాల్లోనే సంక్రాంతిని జరుపుకున్నారు. దీంతో ప్రతి పల్లెల్లోనూ సంక్రాంతి సంబరాలు అత్యంత ఘనంగా , వైభవంగా జరిగాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement