Tuesday, April 16, 2024

ఆలయాల్లో అవినీతిపై సీఎంవో సీరియస్‌.. విజిలెన్స్‌ విచారణకు ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలోని ఆలయాల్లో అవినీతిపై ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో) సీరియస్‌గా ఉంది. ఆలయ నిర్వహణలో అవకతవకలు..భక్తుల కానుకలు స్వాహా..భూముల అన్యాక్రాంతం..ఆడిట్‌ అభ్యంతరాలు.. ఇలా పలు అవకతవకలకు అలవాలంగా మారిన ఆలయాలపై విజిలెన్స్‌ దాడులకు సీఎంవో అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఆలయాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిని ఉపేక్షించొద్దంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఆదేశాల నేపధ్యంలో సీఎంవో అధికారులు సీరియస్‌గానే స్పందిస్తున్నారు. గతంలో వివిధ ఆలయాలకు సంబంధించి సీఎంవోకు వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి విజిలెన్స్‌ విచారణకు ఆదేశిస్తున్నారు. అవసరమైతే అవినీతి నిరోధక శాఖను కూడా రంగంలోకి దించేందుకు సీఎంవో అధికారులు నిర్ణయించుకున్నట్లు తెలిసింది. గతంలో అన్నవరం దేవస్థానంలో చోటు చేసుకున్న ఘటనలపై ఓ ట్రస్టు బోర్డు సభ్యుడు ఇచ్చిన ఫిర్యాదుపై మరోసారి విచారణకు సీఎంవో నుంచి ఆదేశాలు వెళ్లినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే సోమవారం విజిలెన్స్‌ అధికారులు అన్నవరం దేవస్థానంలో తనిఖీలు నిర్వహించిన అధికారుల నుంచి వివరాలు సేకరించారు. మరోసారి కూడా విచారణ చేపట్టనున్నట్లు అధికారులు చెపుతున్నారు.

ఇప్పుడు అన్నవరం..
గతంలో పలు అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపిస్తూ అన్నవరం దేవస్థానం ట్రస్టుబోర్డు సభ్యులు రాజశేఖర రెడ్డి పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అప్పట్లోనే వివిధ ఆరోపణలను విజిలెన్స్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా విచారణ జరిపారు. ఆ తర్వాత విచారణ ఏమైందనేది వెలుగులోకి రాలేదు. పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తగిన విచారణ జరగడం లేదంటూ ముఖ్యమంత్రి కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్‌ అధికారులు అధికారుల నుంచి పలు వివరాలు సేకరించారు. మరోసారి కూడా అధికారుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు విజిలెన్స్‌ అధికారులు చెపుతున్నారు.

మరికొన్ని ఆలయాల్లో కూడా..
తొందరోలనే మరికొన్ని ప్రధాన ఆలయాల్లో కూడా విజిలెన్స్‌ అధికారులు విచారణ జరపనున్నట్లు తెలిసింది. ఇప్పటికే పలు ఆలయాల్లో చోటు చేసుకుంటున్న అవినీతిపై సీఎంవో కార్యాలయానికి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. ఆలయాల ఆస్తులు మొదలు వివిధ ఆరోపణలపై సీఎంవోకు వస్తున్న పిర్యాదులపై ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఇటీవల ఇదే తరహాలో రెవిన్యూ అధికారులపై వచ్చిన ఆరోపణలపై ఏసీబీ విచారణకు సీఎంవో అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఆరోపణలు వస్తున్న క్రమంలో ఆయా శాఖల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం, లేదంటే అవినీతికి అండగా ఉంటుండటంతో ఇప్పుడు పలువురు సీఎంవో వైపు దృష్టిసారించారు.

సీఎం జగన్మోహన రెడ్డి కూడా ఈ తరహా ఆరోపణలపై సమగ్ర విచారణ చేయాలంటూ అధికారులకు స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. ఆరోపణలు నిజమైన పక్షంలో కఠిన చర్యలకు కూడా వెనుకాడ వద్దంటూ సీఎం ఆదేశాల నేపధ్యంలో దేవదాయశాఖపై వచ్చే ఆరోపణలను సీఎంవో అధికారులు ప్రత్యేకంగా దృష్టిసారించారు. ఆరోపణల స్థాయిని బట్టి విచారణకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. శాఖాపరంగా సరిదిద్దే అవకాశం ఉన్న పక్షంలో సంబంధిత అధికారులకు పంపుతున్నట్లు తెలిసింది. ఆలయ ఆస్తులు, భక్తుల నమ్మకానికి ముడిపడి ఉన్న అంశాలపై మాత్రం విజిలెన్స్‌, ఏసీబీకి ఇవ్వనున్నారు. రానున్న రోజుల్లో మరికొన్ని ఆలయాలపై కూడా విజిలెన్స్‌ విచారణ జరగొచ్చంటూ సమాచారం వస్తున్న నేపధ్యంలో దేవదాయశాఖలో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement