Thursday, April 25, 2024

సీఎం జగన్‌ ఆశయానికి తూట్లు.. సంపూర్ణ పోషణలో అక్ర‌మాలు

ప్ర‌భ‌న్యూస్ :రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గర్భవతులు, బాలింతలు, చిన్నారుల్లోపౌష్టికాహారలోపంవల్ల వచ్చే రక్తహీనత, తదితర ఆరోగ్య సమస్యలను తీర్చేందుకు 55 వేలకు పైగా అంగన్‌వాడీల పరిధిలో 70 లక్షలకు పైగా మహిళలకురూ.1800 కోట్లకు పైగా వ్యయంతో ప్రభుత్వం ఈ పథకాన్ని గత ఏడాది సెప్టెంబరు నుండి అమలు చేస్తోంది. ఈ కిట్లలో రాగి పిండి, జొన్న పిండి,అటు-కులు, చిక్కీలు, బెల్లం, ఖర్జూర పండ్లు ఉంటాయి. ఈ కిట్ల టెండర్‌ ప్రక్రియకు రాష్ట్రమంతా ఒకే విధానం లేకపోవడంతో నలుగురు సరఫరాదారులు చక్రం తిప్పి సగానికి పైగా జిల్లాలను హస్తగతం చేసుకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. గత ఏడాది ఆగస్టులో తొలుత ఈ పథకానికిజిల్లాల వారీగా టెండర్లు పిలవడం జరిగింది. ఆయా జిల్లాల కలెక్టర్లు చైర్మన్లుగా, జాయింట్‌ కలెక్టర్‌, మహిళా శిశుసంక్షేమ శాఖ, వైద్య ఆరోగ్య శాఖలకు చెందిన సభ్యులతో పర్చేజింగ్‌ కమిటీని ఏర్పాటు- చేశారు.

రాష్ట్రంలోని 13జిల్లాల్లో కడప, విజయ నగరం, శ్రీకాకుళం, కృష్ణా, విశాఖ జిల్లాల్లో పాత సరఫరాదారులకు అదే రేట్లతో పునరుద్ధరించడం జరిగింది. కర్నూలు, గుంటూరు, అనంతపురం, ప్రకాశం, తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాలకు తిరిగి టెండర్లు పిలవడం జరిగింది. అయితే, ఈ టెండర్లు దక్కించుకునేందుకు ప్రధానంగా నలుగురు సరఫరా దారులు చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో బాలా మృతం సరఫరా చేసినవారే తిరిగి తమ ప్రాబల్యంతో టెండర్లు దక్కించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెండర్ల ప్రక్రియలో తమకు అనుకూలంగా ఉండేట్లు కొన్ని నిబంధనలు పెట్టినట్లు సమాచారం. ఇందులో భాగంగా కొన్ని జిల్లాల్లో కిట్ల సరఫరాకు ఐదు సంవత్సరాల అనుభవంఅనే నిబంధన పెట్టారు. దీంతో గతంలో సరఫరా దారులు ఆందోళన వ్యక్తం చేయడంతో దానిని మూడు సంవత్సరాలకు కుదించారు.

దీంతో గత ఏడాది సరఫరా చేసినవారిలో కొందరికి ఈ సంవత్సరం టెండర్లో పాల్గొనే అర్హత దక్కలేదు. ఈ విధానం వలన కేవలం నలుగురు మాత్రమే అర్హత పొందనున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలో కిట్ల సరఫరాకు పలువురు టెండర్లుదాఖలు చేయడం జరిగింది. అయితే నిబంధనల ప్రకారం టెండర్ దారులు వేసిన ధరలకు నెగోషియేషన్‌చేసి తక్కువ ధరలకు సరఫరా చేసేవారికి కాంట్రాక్టు ఇవ్వాల్సివుంది. ఈ ప్రక్రియ జరగకుండానే కేంద్రీయ భాండర్‌, ఎన్‌సీసీఎఫ్‌ (నేషనల్‌ కోప రేటివ్‌కంజూమర్‌ ఫెడరేషన్‌) అనే సంస్థలకు కాంట్రాక్టు కట్టబెట్టారనే విమర్శలున్నాయి.

కర్నూలు, పశ్చిమ గోదావరి జిల్లాలకు ఇప్పటివరకూ టెండర్ ప్రక్రియ పూర్తి కాలేదు. కాగా, నెల్లూరు జిల్లాలో పాత ధరలకే కిట్లు-సరఫరా చేస్తామని సరఫరాదారుడు సంసిద్ధత వ్యక్తం చేసినా అక్కడ టెండర్లు పిలవడంలో ఆంతర్య మేమిటనేది అర్ధం కావడం లేదు. ఈజిల్లాలో కూడా ఇంకా టెండర్లు ప్రక్రియ పూర్తికాలేదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టెండర్ విధానాన్ని అమలు చేసి కొన్ని నిబంధనలు సడలిస్తే మరింత మంది టెండర్లలో పాల్గొనే అవకాశముంది. తద్వారా సరఫరాదారుల మధ్య పోటీ ఏర్పడి కిట్ల ధరలు తక్కువకు అందించే అవకాశం ఉంది. దీంతో పభుత్వానికి కోట్లాది రూపాయల ఆదాయం చేకూరనుంది. ఇప్పటివరకూ టెండర్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి రానున్నాయి.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement