Friday, March 29, 2024

ప్రైవేటు ఆసుపత్రులకు వ్యాక్సిన్ లా? : మోదీకి జగన్ లేఖ

ప్రధాని మోదీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు. కోవిడ్-19పై చేస్తోన్న యుద్ధంలో సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ స్ట్రాటజీని మరింత సరళతరం చేయటాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా నేరుగా 50 శాతం వ్యాక్సిన్లను ఉత్పత్తిదారుల నుంచి కొనుగోలు చేసే అవకాశం ఇచ్చిన నిర్ణయంపై పునరాలోచించాలి అని విజ్ఞప్తి చేశారు. 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయస్సు వారికి ఉచితంగా వ్యాక్సినేషన్ వేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అయితే అటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి గాని, ఇటు ప్రైవేట్ ఆస్పత్రుల నుంచి గాని వ్యాక్సినేషన్ సరిపడా అందుబాటులో ఉండటంలేదన్నారు. ఏపీకి సరిపడా వ్యాక్సిన్లు పంపాలని కోరారు. 18-44 వయసు వారికి వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు సరిపడా డోసులను కేంద్రం సరఫరా చేయాలని లేఖలో కోరారు. ప్రస్తుతం 45 ఏళ్ల పైబడిన వారికి మాత్రమే వ్యాక్సిన్లు వేస్లున్నామని సీఎం జగన్ తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ నేరుగా వ్యాక్సినేషన్ కొనుగోలు చేసే ఛాన్స్ కల్పిస్తే అది ప్రజలకు తప్పుడు సంకేతం ఇస్తుందన్నారు.

ప్రైవేట్ ఆస్పత్రులలో వ్యాక్సినేషన్ కు రూ.2 వేల నుంచి రూ.2,500ల వరకు ప్రజల నుంచి వసూలు చేసే అవకాశం లభిస్తుందన్నారు. ఆ విధంగా జరిగితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వ్యాక్సిన్ వేయించుకోవాల్సిన పరిస్థితి భారత పౌరులకు ఏర్పడుతుందన్నారు. వ్యాక్సిన్ ను ఉచితంగానే ఇవ్వాలని లేదా కనీసం నామమాత్రపు రేట్లకు అందించాలని తాము కోరుతున్నామని చెప్పారు. 45 ఏళ్ల పైబడిన వారికి కూడా పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్ వేసేందుకు సరిపడా సరఫరా లేదన్నారు. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సున్న వారికి ఉచిత వ్యాక్సిన్ వేయటానికి నెలల సమయం పడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్ కొనుగోలు చేసి పంపిణీ చేసే అవకాశం కల్పించటం అసంబద్ధంగా ఉంటుందని సీఎం వ్యాఖ్యానించారు. సమాజంలో పేదవారికి వ్యాక్సినేషన్ అందడం చాలా కష్టంగా మారుతుందన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ వ్యాక్సిన్ ను కొనుగోలు చేసే అవకాశం కల్పిస్తే బ్లాక్ మార్కెటింగ్ ను ప్రోత్సహించినట్టే అని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కేంద్రం తీసుకున్న నిర్ణయం వ్యాక్సిన్ పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే సత్ఫలితాలనిస్తుందన్నారు. కాబట్టి తక్షణం ప్రైవేట్ హాస్పిటల్స్ కు వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశాన్ని నిలుపుదల చేయాలని ప్రధానికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులకు వ్యాక్సిన్ ఉత్పత్తిదారుల నుంచి సరఫరా చేసే నిర్ణయాన్ని పునరాలోచించాలని, బ్లాక్ మార్కెటింగ్ ను నిరోధించాలని లేఖలో ప్రధానికి సీఎం జగన్ కోరారు.

ఇదీ చదవండి: ‘కరోనా దేవి’ ఆలయం.. ప్రత్యేక ఏంటో తెలుసా?

Advertisement

తాజా వార్తలు

Advertisement