Friday, April 19, 2024

ఎయిడెడ్‌ విద్యాసంస్థలపై బలవంతం లేదు: సీఎం జగన్

ఎయిడెడ్‌ విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. ప్రభుత్వానికి అప్పగించడం అనేది పూర్తి స్వచ్ఛందమని స్పష్టం చేశారు. చాలా విద్యాసంస్థల్లో సమస్యలు ఉన్నాయని, ప్రభుత్వానికి అప్పగిస్తే ప్రభుత్వమే నిర్వహిస్తుందని చెప్పు. తామే నిర్వహించుకుంటామంటే నడుపుకోవచ్చునని,దీనిపై ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు. సోమవారం ఉన్నత విద్యపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీలో ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. జాబ్‌ఓరియెంటెడ్‌గా మన కోర్సులను తీర్చిదిద్దాలని ఆదేశించారు. నాణ్యమైన విద్యతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. మైక్రోసాఫ్ట్‌ లాంటి సంస్థలతో శిక్షణ అన్నది నిరంతరం కొనసాగాలన్నారు.

కోర్సుల్లో శిక్షణను ఇంటిగ్రేట్‌ చేయాలన్న సీఎం… అప్పుడు ఉద్యోగావకాశాలు మరింతగా మెరుగుపడతాయని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉన్నత విద్యలో, కోర్సుల్లో కూడా చాలా మార్పులు తీసుకువచ్చామన్నారు. చదువులున్నా.. ఇంటర్వ్యూల దగ్గరకు వచ్చేసరికి విఫలం అవుతున్న పరిస్థితులు చూస్తున్నామని తెలిపారు. తెలుగు మీడియం నుంచి ఇంగ్లిషు మాద్యమంలోకి విద్యార్థులు మారేటప్పుడు వారికి సౌలభ్యంగా ఉండటానికి రెండు భాషల్లో కూడా పాఠ్యపుస్తకాలు రూపొందించాలన్న సీఎం.. వచ్చే నాలుగేళ్లపాటు రెండు భాషల్లో టెక్ట్స్‌బుక్స్ అందించాలని తెలిపారు.

వర్సిటీల్లో బోధన సిబ్బంది నియామకానికి ఇప్పటికే పచ్చజెండా ఊపమన్న సీఎం..నియామకాల్లో పక్షపాతాలకు తావుండకూడదన్నారు. నియామకాలు పారదర్శకంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి వారం ఒక్కో వీసీతో మాట్లాడాలని ఉన్నత విద్యామండలికి సీఎం ఆదేశించారు. వర్శిటీల్లో సమస్యలు, ప్రభుత్వ తోడ్పాటుపై వీసీలతో చర్చించాలన్నారు. సమావేశంలో గుర్తించిన అంశాలను తన దృష్టికి తీసుకురావాలన్నారు. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు వర్సిటీలు సమన్వయం కావాలని సూచించారు. ప్రతి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల ఉండాలని సీఎం జగన్ తెలిపారు.

ఇది కూడా చదవండి: గులాబీ దళపతిగా కేసీఆర్.. 9వసారి అధ్యక్షుడిగా ఎన్నిక

Advertisement

తాజా వార్తలు

Advertisement