Thursday, April 25, 2024

బద్వేల్‌ ఉప ఎన్నిక.. వైసీపీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి

ఏపీలోని బద్వేల్ ఉప ఎన్నికపై అధికార వైసీపీ దృష్టి సారించింది. తిరుపతి ఉపఎన్నికలో గెలిచినట్లే బద్వేల్ సిట్టింగ్ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందిన బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్‌ దాసరి వెంకటసుబ్బయ్య అనారోగ్యంతో ఈ ఏడాది మార్చి 28 న మృతి చెందడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో దివంగత డాక్టర్‌ వెంకటసుబ్బయ్య సతీమణి డాక్టర్‌ దాసరి సుధను పార్టీ అధిష్టానం బద్వేలు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఎంపిక చేసింది.

ఈ క్రమంలో సీఎం జగన్ గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కీలక ఆదేశాలు జారీ చేశారు. బద్వేల్‌ నియోజకవర్గ బాధ్యతలన్నీ సమావేశానికి వచ్చిన వారందరి మీద ఉన్నాయన్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి అందరూ హాజరు కావాలని పేర్కొన్నారు. 2019లో దాదాపు 44 వేలకు పైగా ఓట్ల మెజార్టీ వచ్చిందని సీఎం జగన్‌ గుర్తు చేశారు. గతంలో వెంకట సుబ్బయ్యకు వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీ డాక్టర్‌ సుధకి రావాలని తెలిపారు. ఎక్కడా అతి విశ్వాసం ఉండకూడదని, కష్టపడి ప్రజల ఆమోదాన్ని పొందాలని పేర్కొన్నారు. 2019లో 77శాతం ఓటింగ్‌ జరిగిందని, ఓటింగ్‌ శాతం పెరగాలని సూచించారు. అందరూ ఓట్లు వేసేలా ఓటర్లను ప్రోత్సహించాలని సీఎం జగన్‌ తెలిపారు. ప్రతి సామాజిక వర్గాన్ని కలుపుకుపోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రతి మండలం కూడా బాధ్యులకు అప్పగించాలని, గ్రామస్థాయి నాయకులతో కలిపి ప్రచారం నిర్వహించాలని తెలిపారు. నెల రోజులపాటు నాయకులు తమ సమయాన్ని కేటాయించి ఎన్నికపై దృష్టిపెట్టాలని సూచించారు. బద్వేల్‌ ఉప ఎన్నికకు పార్టీ ఇంఛార్జిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో తెలియజేయాలని మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశించారు. కాగా, బద్వేలు ఉప ఎన్నిక అక్టోబర్‌ 30న పోలింగ్‌ నిర్వహిస్తారు. నవంబర్‌ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఇది కూడా చదవండి: బీజేపీలో చేరికపై మాజీ సీఎం అమరీందర్ కీలక వ్యాఖ్య

Advertisement

తాజా వార్తలు

Advertisement