Wednesday, April 24, 2024

అమూల్‌ తో పాడిరైతులకు మరింత మేలు: సీఎం జగన్

గతంలో సహకార రంగంలోని డెయిరీలను స్వప్రయోజనాలకు మళ్లించారని, కొందరు సహకార డెయిరీలను తమ ప్రైవేటు సంస్థలుగా మార్చుకున్నారని సీఎం జగన్‌ అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో జగనన్న అమూల్‌ పాలవెల్లువ, మత్స్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. సహకార రంగాన్ని వ్యవస్థీకృతంగా ధ్వంసం చేశారని తెలిపారు. హెరిటేజ్‌కు మేలు చేయడానికి ఏ సహకార సంస్థనూ సరిగ్గా నడవనీయని పరిస్థితులను సృష్టించారని అన్నారు. అమూల్‌ ప్రవేశించిన తర్వాత రాష్ట్రంలోని డెయిరీలకు తప్పక ధరలు పెంచాల్సి వచ్చిందని అన్నారు. అమూల్‌ వచ్చాక లీటరుకు రూ.5 నుంచి రూ.15ల వరకూ అదనపు ఆదాయం వచ్చిందని గుర్తుచేశారు. రేట్ల పరంగా ఈ పోటీని కొనసాగించడం ద్వారా పాడిరైతులకు మరింత మేలు జరుగుతుందని సీఎం జగన్‌ అన్నారు.

మహిళల సుస్థిర ఆర్థికాభివృద్ధికోసం ఆసరా, చేయూత లాంటి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తమ ఆదాయాలు పెంచుకునే మార్గంలో చాలా మంది మహిళలు పాడిపశువులను కొనుగోలు చేశారని తెలిపారు. వారికి మరింత చేయూత నివ్వడానికి బీఎంసీయూలను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. మహిళల పాడి వ్యాపారంలో ఇవి చాలా కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. బీఎంసీయూల నిర్వహణను పారదర్శకంగా చేపట్టాలని తెలిపారు.

దానివల్ల మహిళలకు మరింత మేలు జరుగుతుందని, మహిళలకు మేలు కలిగే దిశగా ఈ చర్యలను చేపడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు. పారదర్శక సహకార వ్యవస్థ ద్వారా మహిళలకు మేలు జరుగుతుందని తెలిపారు. గ్రామాల్లో మళ్లీ సహకార వ్యవస్థబలోపేతం కావాలని అన్నారు. చిత్తూరు డెయిరీని పునరుద్ధరించాలి సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్‌ పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య రూపొందించిన జగనన్న పాలవెల్లువ మహిళా డెయిరీ సహకార సంఘం- కార్యదర్శికి మార్గదర్శకాలు, జగనన్న పాలవెల్లువ-శిక్షణా కరదీపిక పుస్తకాలను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. 

ఇది కూడా చదవండి: ఏపీలో మరింత తగ్గిన కరోనా.. కొత్త కేసులు ఎన్నంటే..

Advertisement

తాజా వార్తలు

Advertisement