Friday, April 19, 2024

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌.. పర్యటన షెడ్యూల్‌ ఇలా..

ఏపీ సీఎం వైస్ జగన్ రెండు రోజుల పాటు రాయలసీమ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు,  వరదలకు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్.. నేడు, రేపు పర్యటించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని  పరిస్థితులను పరిశీలించనున్నారు.

తొలిరోజు కడప, చిత్తూరు జిల్లాల్లోని బాధితులు, రైతులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలిస్తారు. సంబంధిత సహాయ శిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షిస్తారు.

ఈ రోజు ఉదయం 9.20 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 10.15 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 10.50 గంటలకు రాజంపేటలోని నవోదయ విద్యాలయంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఉదయం 11.10 గంటలకు పులపుత్తూరు గ్రామానికి చేరుకుని అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. ఆ తర్వాత వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి అనంతరం పులపుత్తూరు సచివాలయానికి చేరుకుంటారు.

అనంతరం రాత్రికి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో బస చేస్తారు. ఇక, రెండో రోజు చిత్తూరు, నెల్లూరు జిల్లాలు, పెన్నానదీ పరీవాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను స్వయంగా సీఎం పరిశీలించి..అధికారులతో సమీక్షిస్తారు. సంబంధిత సహాయశిబిరాల్లో ఉన్న బాధితులతో మాట్లాడుతారు.  ఆయా ప్రాంతాల్లో జరిగిన వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు.  అధికారులు, ప్రజా ప్రతినిధులతో వరద నష్టంపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకుని, అక్కడ నుంచి తాడేపల్లిలోని ఇంటికి చేరుకుంటారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం  ఫేస్‌బుక్‌ట్విట్టర్  పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement